Share News

Minister Payyavula Keshav: స్కామ్‌లు బయటపడేకొద్దీ జగన్‌లో భయం

ABN , Publish Date - May 23 , 2025 | 07:07 AM

వైసీపీ పాలనలో జరిగిన స్కామ్‌లు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో జగన్‌కు భయం పెరుగుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తూ, అభివృద్ధికి అడ్డుకావాలని జగన్‌ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Minister Payyavula Keshav: స్కామ్‌లు బయటపడేకొద్దీ జగన్‌లో భయం

  • అస్తిత్వం కోసమే అవాస్తవాలు: పయ్యావుల

అనంతపురం, మే 22(ఆంధ్రజ్యోతి): వైసీపీ దుర్మార్గపు పాలనలో చేసిన స్కామ్‌లు బయటపడేకొద్దీ జగన్‌లో భయం పుడుతోందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తమ ప్రభుత్వంపై అవాస్తవాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అనంతపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అమరావతి మీద విషం చిమ్మడానికి.. అభివృద్ధిని అడ్డుకోవడానికే జగన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టినట్టుగా ఉంది’ అని అన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం భూములిస్తుంటే వారిని భయపెట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని మండిపడ్డారు. ‘రాష్ర్టానికి కంపెనీలను తీసుకురావడానికి మేం శ్రమ పడుతుంటే.. మీరు అప్పుడప్పుడు తెరపైకి వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే కంపెనీలు భయపడతాయి. మీరు కనిపిస్తే.. మీ అక్రమ పాలన, అవినీతి, ఇసుక దోపిడీ, లిక్కర్‌ కుంభకోణం, మీ అనుచరుల దౌర్జన్యాలు, దాడులు, భూ కుంభకోణాలు, అక్రమ కేసులు అన్నీ గుర్తుకు వస్తాయి. సిగరెట్‌ ప్యాకెట్‌పైన పొగతాగడం హానికరం అని ముద్రించినట్టుగా.. వైసీపీ పాలన ఈ రాష్ర్టానికి హానికరమని ప్రజలకు మళ్లీ మళ్లీ చెప్పాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ‘మా లిక్కర్‌లో ఏదో స్కాం ఉందని జగన్‌రెడ్డి అంటున్నారు. 50 ఏళ్లకుపైగా అమలులో ఉన్న పాలసీనే అమలు చేస్తున్నాం. ఓపెన్‌ ఆక్షన్‌లో మద్యం షాపులు కేటాయిస్తే.. అందులో ఏం తప్పు కనబడింది? ఇసుకలో ఏదో స్కాం జరిగిందని ఫొటోలు చూపించి మాట్లాడుతున్నావ్‌.


కప్పం కట్టి ఇసుక తీసుకునే పరిస్థితి మీ పాలనలో ఉండేది. మీ హయాంలో జరిగిన లిక్కర్‌ స్కామ్‌లో అవినీతి బయటకొస్తోంది. గతంలో గాలి జనార్దన్‌రెడ్డితో నాకేం సంబంధమన్నారు. ఇప్పుడు రాజ్‌ కసిరెడ్డితో నాకేం సంబంధం అనే పరిస్థితి వచ్చింది. అమరావతిలో రివర్స్‌ టెండరింగ్‌ తీసేశారని అంటున్నారు. రివర్స్‌ టెండరింగ్‌ చేసి మీరు సాధించిందేమిటి? 3.50 లక్షల ఎకరాలకు ఎలాంటి రికార్డులు.. ఆధారం లేకుండా ఫ్రీ హోల్డ్‌ చేసేశారు.. ఈ భూములన్నీ ఎవరి చేతుల్లోకి వెళ్లాయి? ఏడాదిలోనే చంద్రబాబు అప్పులు విపరీతంగా చేశారని మాట్లాడుతున్నారే.. ఎందుకు చేశాం.? మేం తినడానికి చేశామా?. గత ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేయడంతోపాటు రూ.1.50 లక్షల కోట్లు బకాయి పెట్టారు. రూ.9,600 కోట్ల పరిశ్రమల ప్రోత్సాహక బకాయిలు ఉన్నాయి. మీరు చేసిన అప్పులు, వాటికి వడ్డీలు కట్టేందుకే ఇప్పుడు అప్పులు చేయాల్సి వస్తోంది’ అని కేశవ్‌ అన్నారు.

Updated Date - May 23 , 2025 | 07:07 AM