వద్దు బాబోయ్.. రావొద్దు...
ABN , Publish Date - Aug 17 , 2025 | 10:38 AM
పిచ్చి పలురకాలు... వెర్రి వేయి రకాలు..’ అని వూరికే అనలేదు మన పెద్దలు. ఆ వెర్రి ఇప్పుడు టూరిజాన్ని పట్టుకుంది. కరోనా తర్వాత రివేంజ్ తీర్చుకున్నట్లు పొలోమని ప్రపంచమంతా చుట్టేస్తున్నారు పర్యాటకులు. కొందరైతే వెళ్లిన దేశానికే మళ్లీ మళ్లీ వెళుతున్నారు.
‘పిచ్చి పలురకాలు... వెర్రి వేయి రకాలు..’ అని వూరికే అనలేదు మన పెద్దలు. ఆ వెర్రి ఇప్పుడు టూరిజాన్ని పట్టుకుంది. కరోనా తర్వాత రివేంజ్ తీర్చుకున్నట్లు పొలోమని ప్రపంచమంతా చుట్టేస్తున్నారు పర్యాటకులు. కొందరైతే వెళ్లిన దేశానికే మళ్లీ మళ్లీ వెళుతున్నారు. ఈ ‘ఓవర్ టూరిజం’ వల్ల ఆయా దేశాలకు ఊపిరాడటం లేదు. స్థానికులకు అద్దె ఇళ్లు దొరకడం లేదు. ధరలు పెరిగాయి. ప్రశాంతత కరువైంది. సంస్కృతి దెబ్బతింటోంది. అందుకే తమ దేశాలకు ‘వద్దు బాబోయ్ రావొద్దు’ అంటూ ‘యాంటీ-టూరిజం’ ఉద్యమం బయలుదేరిందిప్పుడు...
భారతీయ మధ్యతరగతి కల విదేశీయానం. కాస్త ఆర్థిక వెసులుబాటు కలిగితే.. ఏ మలేషియానో, సింగపూరో లేదంటే దుబాయ్‌కో వెళ్లొస్తారు. కానీ, ప్రపంచ పర్యాటకులకు మాత్రం విహారయాత్ర అంటే ఐరోపానే!. అక్కడున్న ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, పోర్చుగల్, గ్రీస్, స్పెయిన్ వంటి దేశాలకు వెళ్లొస్తేనే ప్రపంచపర్యాటకం చేసినట్లు!.
అసలుసిసలు టూర్ అంటే స్విట్జర్లాండ్‌లోని ఆల్ఫ్స్ పర్వతాల నడుమచేసే రైలు ప్రయాణం, పారిస్‌లోని ఈఫిల్‌టవర్, గ్రీస్‌లోని చారిత్రక ప్రదేశాలు... ఇవే ముఖ్యమైనవి. మనకే కాదు.. అంతర్జాతీయ పర్యాటకులందరికీ ఇష్టమైనవి యూరప్‌దేశాలు. అందుకు నిదర్శనం ఈ గణాంకాలు. 2022లో ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు సందర్శించిన దేశం ఫ్రాన్స్. అక్కడికి ఏటా పదికోట్ల మంది పర్యాటకులు తరలివెళ్తారు. ఈ దేశమే టాప్-1 డెస్టినేషన్‌గా రికార్డులకెక్కింది. ఆ తర్వాత స్పెయిన్‌ను 9.3 కోట్ల మంది టూరిస్టులు సందర్శించారు.

అత్యధిక పర్యాటకులను ఆకర్షించిన మూడో దేశంగా నిలిచింది అమెరికా. ఈ దేశానికి 7.2 కోట్ల మంది టూరిస్టులు వెళ్లారు. రోజూ వచ్చీపోయే పర్యాటకులతో స్థానికుల రోజువారీ దినచర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. బస్సుల్లో, రైళ్లలో, హోటళ్లలో ఎక్కడ చూసినా టూరిస్టులే ఉండటంతో ఆయా దేశాల్లోని స్థానికులకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ ఒత్తిడిని భరించలేని ఐరోపా దేశాలు టూరిస్టుల కట్టడికి కొత్త కొత్త ప్రయోగాలు చేయడం మొదలుపెట్టాయి. అందులో భాగంగా పుట్టిందే యాంటీ-టూరిజం ఉద్యమం.
ఫ్రాన్స్.. అత్యధికం
వైవిధ్య సంస్కృతి, చారిత్రక ప్రాముఖ్యం, ప్రాచీన కళాకృతులు, విలాసవంతమైన జీవనశైలి కలిగిన ఫ్రాన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? పారిస్ అందాలతోపాటు ఆ నగర ఫ్యాషన్ ప్రతీ ఒక్కరినీ అలరిస్తుంది. అందుకే ప్రపంచంలోనే అత్యధిక పర్యాటకులు సందర్శించే దేశంగా ఖ్యాతి కెక్కింది ఫ్రాన్స్. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఒక సాధారణ మధ్యతరగతి ఇల్లు ఎలా ఉంటుంది? ఒక హాలు, రెండు పడగ్గదులు, రెండు బాత్‌రూమ్స్, ఒక చిన్న బాల్కనీ.. ఇంతేగా!. భార్యభర్త, ఇద్దరు పిల్లలకు సర్దుకుంటే సరిపోయే ఇల్లు అది. అలాంటి ఇంటికి ఐదుగురు బంధువులు వస్తే.. లేదు.. పదిమంది వస్తే? నిత్యం అంతేసి మంది వస్తూపోతుంటే? ఆ ఇంటోళ్ల ఇక్కట్లను ఒక్కసారి ఊహించండి.

ఇప్పుడు ఫ్రాన్స్ పరిస్థితి కూడా అంతే!. యూరప్‌లోని ఆ దేశ జనాభా 6.85 కోట్లు. ఏటా ఆ దేశాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య మాత్రం 10 కోట్లు. అక్కడ నివసిస్తున్న ప్రజలకంటే .. వచ్చే అతిథులే అధికం. ఇక, ఆ దేశ ప్రధాన నగరం పారిస్ జనాభా అయితే కేవలం ఇరవై లక్షలు... కానీ వచ్చే పర్యాటకులు మాత్రం కోట్లలో!. హోటళ్లు, కాఫీకొట్లు, షాపులు, క్యాబ్‌లు, లాడ్జ్‌లు.. ఎక్కడ చూసినా టూరిస్టులే!. అసలిది మా దేశమేనా? ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి.. మాకు ప్రశాంతత లేకుండా చేస్తున్నారన్నది ఫ్రాన్స్‌వాసుల ఫిర్యాదు. అందుకే ఫ్రాన్స్ కూడా మితిమీరిన పర్యాటకుల సంఖ్యను తగ్గించేందుకు నడుంకట్టింది. పర్యాటకులపై ప్రత్యేక ఆంక్షలను విధిస్తోంది.
పారిస్‌లోని రద్దీ ప్రదేశాల్లో ఇళ్లు దొరకడం చాలా కష్టం. అందులోనూ అద్దె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెరుగుతున్న టూరిస్టులను దృష్టిలో పెట్టుకుని అక్కడి మధ్యవర్తులు ఇళ్లను రిజర్వుచేసి బ్లాక్ చేస్తున్నారు. దాంతో తాత్కాలిక అద్దెలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇలా బ్లాక్ చేసే ఆపరేటర్లపై ఫ్రాన్స్ ప్రభుత్వం కొరడా ఝుళిపిస్తోంది. లైసెన్సు లేని మధ్యవర్తులపై కేసులు కూడా పెడుతున్నారు అధికారులు. ‘‘పర్యాటకుల గురించే కాదు.. మా స్థానికులైన ఫ్రాన్స్ వాసుల యోగక్షేమాలు కూడా మాకు ముఖ్యం. వారి జీవనశైలికి ఎలాంటి ఆటంకం ఏర్పడినా చర్యలు తీసుకుంటాం’’ అంటున్నారు పారిస్‌లోని స్థానిక అధికారులు. టూరిస్టుల కోసం ఇళ్లను బ్లాక్ చేసే అద్దె ఆపరేటర్లపై మూడు వేల పౌండ్లు జరిమానా విధిస్తున్నారు. టూరిస్టు వీసాల జారీలో కూడా ఉదారత ప్రదర్శించడం లేదు ఆ దేశం.

చెడగొట్టేస్తున్నారు..
ఫ్రాన్స్ బాటలో మరిన్ని దేశాలు చేరాయి. క్రొయేషియాలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు పొందిన కొన్ని పట్టణాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు వేలసంఖ్యలో పర్యాటకులు వెల్లువెత్తుతుంటారు. అతిథుల రద్దీ దృష్ట్యా హోటళ్లు, రెస్టారెంట్లు, అద్దె ఇల్లు నిండిపోతున్నాయి. వీరందరికీ తాగునీరు, విద్యుత్తు, ఆకుకూరలు, కూరగాయలు సమకూర్చడం కత్తిమీద సాము. కొన్ని సందర్భాల్లో నీటి సరఫరా పరిమితికి మించి చేయాల్సి వస్తోందని స్థానిక అధికారులు వాపోతున్నారు. అందుకనే విదేశీ పర్యాటకులను తగ్గించేందుకు విలాస నౌకలకు పరిమితులు విధించారు. తద్వార పర్యాటకుల రద్దీ తగ్గుతుందన్నది ఆ దేశ ఉద్దేశం.
ఆస్ట్రియాలోని వియన్నా పరిస్థితి కూడా ఇలాంటిదే!. ఎక్కడెక్కడి నుంచో వచ్చే టూరిస్టులు ఇక్కడే తిష్ట వేస్తుండటంతో స్థానికులకు అద్దె ఇళ్లు దొరకడం లేదు. పల్లెటూళ్ల నుంచి పట్టణాలు, నగరాలకు వలస వచ్చే స్థానిక విద్యార్థులు, ఉద్యోగులకు అద్దె ఇళ్లు దొరకడం లేదన్న ఫిర్యాదులు పెరిగాయి. ఒకవేళ లభించినా అద్దె కట్టలేని దుస్థితి. కొన్ని నెలలపాటు అక్కడుండే టూరిస్టుల వల్ల ఇళ్లకు డిమాండ్ ఏర్పడటంతో.. ఈ సంక్షోభం తలెత్తిందన్నది ఆస్ట్రియా దేశస్థుల అభిప్రాయం. సమస్యను పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వం.. ఆ దేశంలోకి వచ్చే పర్యాటకులు తొంభై రోజులకు మించి అద్దె ఇళ్లలో ఉండటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది.

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రాగ్‌లోని కొన్ని చారిత్రక ప్రాంతాల్లో ప్రశాంతతను కాపాడేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ‘‘విదేశీ పర్యాటకులు పబ్‌లలో రాత్రింబవళ్లు తాగుతూ, కేకలువేస్తూ, నృత్యాలు చేస్తూ మాకు నిద్రాభంగం కలిగిస్తున్నారు. చెవులు తూట్లు పడే మ్యూజిక్ హోరుతో శబ్దకాలుష్యానికి కారణం అవుతున్నారు. ఇవన్నీ మేమెందుకు భరించాలి? ఇది మా మాతృభూమి. ఇక్కడ ప్రశాంతంగా బతికే హక్కు మాకుంది..’’ అంటున్న స్థానిక ప్రజల అభిప్రాయాన్ని ప్రభుత్వం గౌరవించింది.
రాత్రి పదిగంటల తర్వాత ఏ పబ్ పనిచేయడానికి వీల్లేదని కొత్త నిబంధనలను రూపొందించింది చెక్ రిపబ్లిక్ ప్రభుత్వం. పార్టీలు, పబ్బుల్లో పర్యాటకులు విపరీతపోకడలకు దారితీసే అశ్లీల నృత్యాలు చేస్తున్నారని, అభ్యంతరకర కురుచ దుస్తులు ధరిస్తున్నారని, ఆ విశృంఖల జీవనశైలివల్ల తమ పిల్లలు చెడిపోతున్నారనీ ఫిర్యాదులొచ్చాయి. వాటిని పరిగణలోకి తీసుకున్న ఆ ప్రభుత్వం పబ్‌లలో అశ్లీలతను ప్రేరేపించే కాస్ట్యూమ్స్‌ను నిషేధించింది. యాంటీ- టూరిజంపై ఇలా మొదలైన అప్రకటిత ఉద్యమం ఐరోపా మొత్తం వ్యాపించింది.

క్రూజ్‌ల కట్టడి..
ఇక, విలాసనౌకల (క్రూజ్‌షిప్) గురించి అయితే చెప్పక్కర్లేదు. ఒకప్పుడు అమెరికా, బ్రిటన్, హవాయి, సింగపూర్, మలేసియా వంటి దేశాలకు వెళ్లిన పర్యాటకులు విలాసనౌకల్లో ప్రయాణించి ఆనందించేవారు. టికెట్ల ధరలు అధికంగా ఉన్నాసరే వెచ్చించేవారు. ఇప్పుడు క్రూజ్‌ల మధ్య పోటీ పెరగడం.. వీటిలో అత్యాధునిక సౌకర్యాలు, విలాసవంతమైన సదుపాయాలు, భద్రత, టికెట్ల ధరలు అందుబాటులోకి రావడం వంటి మార్పులతో మధ్యతరగతి ప్రజలు సైతం క్రూజ్ ప్రయాణాలకు ఇష్టపడుతున్నారు. అందుకే భారత్‌లో కూడా ఇటీవల కార్డిలియా క్రూజ్‌షిప్ పలు సముద్రమార్గాల గుండా ప్రయాణిస్తోంది. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా విలాసనౌకలు కూడా విపరీతంగా పెరగడం విశేషం. అయితే ఈ రద్దీవల్ల సముద్రతీరాలలో అపరిశుభ్రత పెరుగుతోందని ఆయా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే విలాసనౌకలను కట్టడి చేసేందుకు రకరకాల నిబంధనలు విధిస్తున్నాయి.
ఈ క్రమంలోనే బార్సిలోనా కూడా స్పందించింది. తమ ప్రాంతంలోని ఓడరేవులకు వచ్చే నౌకల సంఖ్యను తగ్గిస్తే.. పర్యాటకుల సంఖ్యను కూడా కట్టడి చేయొచ్చని నిశ్చయించింది. ఫలితంగా ఐరోపాకు వచ్చే టూరిస్టులను తగ్గించడం ముఖ్య ఉద్దేశం. బార్సిలోనా నగర పాలకులు, నౌకాశ్రయ అధికారులు ఒక ఒప్పందం చేసుకున్నారు. 2030 నాటికి క్రూజ్ టెర్మినల్స్ సంఖ్యను ఏడు నుంచి ఐదుకు తగ్గించడానికి ఒప్పందం చేసుకున్నాయి. బార్సిలోనా టూరిజం అబ్జర్వేటరీ ప్రకారం గత ఏడాది నగరాన్ని తిలకించేందుకు సుమారు 36 లక్షల మంది పర్యాటకులు తరలివచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే టూరిస్టులను తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఫ్రెంచ్ రివేరాలోని రిసార్ట్ నగరం కాన్స్ సైతం క్రూజ్‌షిప్ పర్యాటకుల తాకిడిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. భారీ విలాసనౌకలు పోర్టుకు రాకుండా అడ్డుకుంటోంది. పెద్ద షిప్పుల్లోని ప్రయాణికుల్ని చిన్నచిన్న పడవల్లోకి తరలించి.. తీరానికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. దీనివల్ల సముద్రతీరాల్లో అపరిశుభ్రతను, జలకాలుష్యాన్ని కొంతవరకైనా తగ్గించవచ్చన్నది అధికారుల ఆలోచన. గ్రీస్‌లోని శాంటోరినికి నిత్యం క్రూజ్‌లలో వేలమంది వస్తుంటారు. ఈ పట్టణ జనాభా కేవలం 15 వేలు. కానీ, పర్యాటకులు మాత్రం ఏటా ఇరవై లక్షల మంది వస్తుండటం ఆశ్చర్యం. వీరిని తగ్గించేందుకు గ్రీస్ పాలకులు క్రూజ్ పర్యాటకులపై పన్నులు విధించారు. ఒక్కొక్కరు 20 యూరోలు (సుమారు రూ.2 వేలు) చెల్లించాలన్నది నిబంధన. ఈ డబ్బును పట్టణ పరిశుభ్రతకు ఉపయోగిస్తున్నారు.
స్పెయిన్‌లో రాజుకుంది...
‘వద్దు బాబోయ్ రావొద్దు’ అంటున్న దేశాల యాంటీ టూరిజం ఉద్యమం మొట్టమొదట స్పెయిన్‌లో రాజుకుంది. ఐరోపాలో విదేశీపర్యాటక వ్యతిరేక ఉద్యమానికి ఆ దేశం కేంద్రబిందువుగా నిలిచింది. ‘‘ప్రతీదేశానికీప్రత్యేక స్థానికత, అస్తిత్వం, సంస్కృతి, జీవన విధానం వంటి అపురూప లక్షణాలన్నీ ఉంటాయి. వీటిని దెబ్బతీసే ఏ అభివృద్ధీ మాకొద్దు. మితిమీరిన టూరిస్టుల వల్ల వీటన్నింటికీ భంగం కలుగుతోంది. ఆఖరికి స్థానికుల మనుగడకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది... కాబట్టి ఉప్పెనలా వచ్చిపడుతున్న పర్యాటకాన్ని కట్టడి చేయండి.. ప్రశాంతంగా జీవించే హక్కును కల్పించండి’’ అంటున్నారు స్పెయిన్‌వాసులు. సామాజిక మాధ్యమాల ద్వారా ఊపందుకున్న ఈ డిమాండ్ ఐరోపా అంతటా దావానలంలా వ్యాపించింది.
ముఖ్యంగా యువతీయువకులు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ప్రజల మద్ధతు లభించింది. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అంతే... ఐరోపావాసులంతా దండులా కదిలివచ్చారు. ‘‘మాకే ఆశ్చర్యం వేసింది. మితిమీరిన టూరిజం వల్ల స్థానికులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఈ నిరసన వల్ల తెలిసింది. ఏ దేశ ఆర్థికవ్యవస్థ అయినా ముందుకు వెళ్లాలంటే ఎన్నో రంగాలు వృద్ధి చెందాలి. అందులో టూరిజం కూడా ఒకటి. కానీ ఆ పర్యాటకం అనేది బయటి వాళ్లకు ఆనందాన్ని కలిగించి.. స్థానికులను ఇబ్బందికి గురిచేయకూడదు కదా!.
మా ఇంట్లో మేము ప్రశాంతంగా లేకపోతే ఎంత అభివృద్ధి అయితే మాకేం లాభం?’’ అన్నారు ఆందోళనలో పాల్గొన్న స్పెయిన్‌వాసి డేనియల్. ఆ దేశంలోని మాడ్రిడ్‌లో జరిగిన యాంటీ-టూరిజం ఉద్యమానికి 40 నగరాల నుంచి 1.50 లక్షల మంది స్థానికులు తరలివచ్చారు. ఏ దేశమైనా అతిథులను ఆహ్వానిస్తుంది.. ఇదేంటి? ఐరొపావాసులు మాత్రం.. టూరిస్టులను వద్దు బాబోయ్ వద్దు మీరు రావొద్దు.. అంటూ రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తున్నారని ఆశ్చర్యపోతోంది పర్యాటక ప్రపంచం. స్పెయిన్‌లో రాజుకున్న యాంటీ- టూరిజం ఉద్యమం ఐరోపాలోని అన్ని దేశాలకూ వ్యాపించింది.
ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఉద్యమం రావడం ఇదే ప్రథమం. గ్రీస్, ఇటలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఆస్ట్రియా, మాల్టా, చెక్ రిపబ్లిక్‌లలో ఈ తరహా నిరసనలు భారీఎత్తున జరుగుతున్నాయిప్పుడు!. ‘‘టూరిజం అంటే బయటివాళ్లకు కాలక్షేపం కావొచ్చు.. ఇక్కడున్నోళ్లకు సంకటం కాకూడదు. స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, జీవనవిధానం, ఆహారపు అలవాట్లు, ప్రశాంత వాతావరణం దెబ్బతినకూడదు. సొంత అస్తిత్వం దెబ్బతీసే ఏ ప్రగతీ మంచిది కాదు..’’ అంటున్న స్పెయిన్ వాసి పాబ్లో మాటలను ప్రగతిశీలవాదులు, సామాజికవేత్తలు ఆమోదిస్తున్నారు. ప్రపంచ పర్యాటకులు సైతం పునరాలోచనలో పడ్డారు. ‘యాంటీ- టూరిజం..’ ఇప్పుడొక అంతర్జాతీయ అస్తిత్వ పోరాటం!.
- మల్లెంపూటి ఆదినారాయణ
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
డెంగ్యూ దాడికి చెక్ పెట్టండి.. ఈ చిట్కాలతో ఆరోగ్యంగా ఉండండి
Read Latest Telangana News and National News