Oil Price Surge: రష్యాపై ఆంక్షలతో చమురు ధరలకు రెక్కలు
ABN , Publish Date - Oct 23 , 2025 | 10:47 PM
రష్యాలోని రెండు అతి పెద్ద చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంతో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ధర సుమారు 4 శాతం మేర పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: రష్యాకు చెందిన రెండు భారీ చమురు సంస్థలపై అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలకు రెక్కలొచ్చాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ ధరలు బ్యారెల్‌కు 2.71 డాలర్ల చొప్పున పెరిగి 65.30 డాలర్లు చేరుకున్నాయి. ఇక యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధరలు కూడా 2.56 డాలర్ల మేర పెరిగి 61.06 డాలర్లు చేరుకున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యన్ కరెన్సీ రూబుల్ మరింత బలపడింది. డాలర్‌తో పోలిస్తే రూబుల్ విలువ 81.30గా ఉంది (Oil Price Surge).
అమెరికా ఆంక్షలపై రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి స్పందించారు. ఆంక్షలను ఎదుర్కునే శక్తి తమకు ఉందని అన్నారు. మరోవైపు, రష్యా చమురు కంపెనీలతో కార్యకలాపాలు నిలిపివేసేందుకు ఇతర దేశాల ఆయిల్ కంపెనీలకు అమెరికా ట్రెజరీ నవంబర్ 21 దాకా సమయం ఇచ్చింది. ఈలోపు కంపెనీలు చమురు దిగుమతులను పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది (US Sanctions on Russian Oil Companies).
అమెరికాతో పాటు బ్రిటన్ కూడా రష్యాను టార్గెట్ చేసింది. రెండు రష్యన్ కంపెనీలతో పాటు రష్యా చమురును తరలించే 44 ఫ్లీట్ ట్యాంకర్‌లను గతవారమే టార్గెట్ చేసింది. ఈయూ కూడా రష్యాపై 19వ దశ ఆంక్షలకు ఆమోదం తెలిపింది. రష్యా ఎల్ఎన్‌జీ దిగుమతులపై నిషేధం విధించింది.
మరోవైపు, ట్రంప్ ప్రకటన అనంతరం భారత్ ఆయిల్ రిఫైనరీలు ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారించాయి. సముద్రమార్గం మీదుగా రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశంగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే. గత నాలుగేళ్లగా భారత్ పెద్ద మొత్తంలో రష్యా చమురును దిగుమతి చేసుకుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ రోజుకు సగటున 1.7 మిలియన్ బ్యారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇదిలా ఉంటే ఒపెక్ దేశాలు కూడా చమురు ఉత్పత్తిని పెంచడంతో ఈవారంలో చమురు ధరలో తగ్గాయి.
ఇవి కూడా చదవండి:
కెనడాకు తగ్గిన అంతర్జాతీయ విద్యార్థులు.. మునుపెన్నడూ చూడని విధంగా..
పాకిస్తాన్‌కు దెబ్బ మీద దెబ్బ.. చుక్కలు చూపిస్తున్న టీటీపీ..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి