Share News

US-India Trade: తగ్గేదే లే!

ABN , Publish Date - Feb 15 , 2025 | 04:47 AM

సుంకాల విషయంలో మాత్రం తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తేల్చిచెప్పేశారు! ‘కంటికి కన్ను.. పంటికి పన్ను’ అన్న సామెత చందంగా.. తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే దేశాలపై తామూ అధిక పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు.

US-India Trade: తగ్గేదే లే!

అమెరికా ఉత్పత్తులపై భారత్‌ ఎంత సుంకం విధిస్తుందో మేమూ అంతే వేస్తాం

ప్రధాని మోదీ సమక్షంలో తేల్చిచెప్పిన ట్రంప్‌

అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ

వాణిజ్యం, రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ

భారత్‌కు ఎఫ్‌-35లు ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్‌

26/11 దాడి కేసు నిందితుడు తహవుర్‌ రాణాను భారత్‌కు తక్షణమే అప్పగించనున్నట్టు ప్రకటన

2030 నాటికి రెండు దేశాల మధ్య 500 బిలియన్‌ డాలర్ల వాణిజ్యమే లక్ష్యంగా మిషన్‌ 500 ప్రకటన

అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకోవడానికి సిద్ధం: ట్రంప్‌తో మోదీ

119 మందితో నేడు అమృత్‌సర్‌కు మరో విమానం

ఆదివారం మరో విమానం వచ్చే అవకాశం హెచ్‌-1బీ పునరుద్ధరణలో మరింత జాప్యం డ్రాప్‌బాక్స్‌ అర్హత 12 నెలలకు కుదింపు

భారతీయ దరఖాస్తుదారులపైనే తీవ్ర ప్రభావం

మనది మెగా భాగస్వామ్యం

ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఎప్పుడూ మాగా (మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్‌) గురించి మాట్లాడుతుంటారు. మేం మా దేశంలో ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాన్ని.. ‘మేక్‌ ఇండియా గ్రేట్‌ ఎగైన్‌’ అనొచ్చు. రెండూ (మాగా+మిగా) కలిస్తే.. అది సౌభాగ్యానికి మెగా భాగస్వామ్యం అవుతుంది.

- ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌

బేరాల్లో నాకంటే మోదీనే బెటర్‌

‘మీ ఇద్దరిలో బాగా బేరసారాలు చేయగలిగేది ఎవరు?’ అని విలేకరులు అడిగిన ప్రశ్నకు.. ఆ విషయంలో మోదీనే తనకంటే చాలా మెరుగని, ఆయనకు అసలు పోటీయే లేదని ట్రంప్‌ చెప్పారు.

- విలేకరులతో ట్రంప్

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 14: భారత ప్రధాని నరేంద్రమోదీని గొప్ప మిత్రుడిగా అభివర్ణించినా.. ఆత్మీయ ఆలింగనాలు, సుదీర్ఘ కరచాలనాలతో ఆహ్వానించినా.. సుంకాల విషయంలో మాత్రం తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తేల్చిచెప్పేశారు! ‘కంటికి కన్ను.. పంటికి పన్ను’ అన్న సామెత చందంగా.. తమ దేశ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించే దేశాలపై తామూ అధిక పన్నులు విధిస్తామని స్పష్టం చేశారు. ‘‘అది ఇండియా కానివ్వండి, మరే దేశమైనా కానివ్వండి.. మా ఉత్పత్తులపై తక్కువ సుంకాలు విధిస్తే మేమూ అలాగే విధిస్తాం. భారత్‌ ఎలా వసూలు చేస్తే.. మేమూ అలాగే వసూలు చేస్తాం’’ అని సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా.. ఆయన పక్కనే నిలబడి.. సంయుక్త పత్రికా సమావేశంలో ఎలాంటి శషభిషలూ లేకుండా నిర్మొహమాటంగా ప్రకటించారు. తనకన్నా మోదీనే మెరుగైన బేరగాడని వ్యాఖ్యానించారు. త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు రెండు దేశాలూ ఎదురుచూస్తున్నాయన్న ట్రంప్‌.. అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై భారత్‌ విధిస్తున్న సుంకాలు అన్యాయంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

bnfd.jpg

కాకపోతే.. భారతదేశంతో పోలిస్తే చైనా, యూరోపియన్‌ యూనియన్‌తో వాణిజ్యసంబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో తన తొలి హయాంలో జరిపిన చర్చల వల్ల సుంకాలు తగ్గలేదని.. అందుకే ఈసారి పరస్పర సుంకాల విధానాన్ని అనుసరించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మోదీతో భేటీ కావడానికి కొన్ని గంటల ముందు ఆయన ఈ పరస్పర సుంకాలకు సంబంధించిన ఉత్తర్వుపై సంతకం చేశారు. ఆ సమయానికే.. స్పేస్‌ఎక్స్‌ చీఫ్‌ మస్క్‌ ప్రధాని మోదీతో భేటీ అయిన నేపథ్యంలో విలేకరులు ట్రంప్‌ను మస్క్‌-మోదీ భేటీ గురించి అడిగారు. అప్పుడు కూడా ట్రంప్‌ భారత్‌ అధిక సుంకాల గురించి ప్రస్తావించడం గమనార్హం. ఆ తర్వాత కొన్నిగంటలకు (భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో) ప్రధాని మోదీ శ్వేతసౌధానికి చేరుకుని ట్రంప్‌ను కలిశారు. తన చిరకాల మిత్రుడైన మోదీకి ట్రంప్‌ ఆత్మీయ స్వాగతం పలికారు. సుదీర్ఘ కరచాలనం.. గాఢ ఆలింగనంతో ఓవల్‌ ఆఫీసులోకి తీసుకెళ్లారు. మోదీని గొప్ప స్నేహితుడిగా, అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణిస్తూ.. తన సిబ్బందికి పరిచయం చేశారు. మళ్లీ మోదీవైపు తిరిగి.. ‘‘మేం మిమ్మల్ని మిస్‌ అయ్యాం.. చాలా మిస్‌ అయ్యాం’’ అన్నారు. మోదీ కూడా.. ట్రంప్‌ను మళ్లీ కలిసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మోదీకి ట్రంప్‌ ‘అవర్‌ జర్నీ టుగెదర్‌’ పేరిట.. తమ ఇద్దరి ఫొటోలతో కూడిన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. దానిపై ‘‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌, యు ఆర్‌ గ్రేట్‌ (మీరు చాలా గొప్ప)’ అని రాసి సంతకం పెట్టారు. ట్రంప్‌ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీ అక్కడ పర్యటించినప్పటి ఫొటోలు, ట్రంప్‌ భారత్‌కు వచ్చినప్పుడు ఇక్కడ మోదీతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలూ అందులో ఉన్నాయి.


yhkjulk.jpg

కుశలప్రశ్నలు, పరస్పర పొగడ్తల అనంతరం.. ఇరువురు నేతలూ వాణిజ్యం, దౌత్యం, రక్షణ, ఇంధన భద్రత, హెచ్‌1బీ వీసాలు, వలస విధానం, కృత్రిమ మేధ, నవకల్పనలు, తదుపరి తరం టెక్నాలజీలు సహా పలు రంగాలకు సంబంధించిన కీలక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇరు దేశాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న పలు అంతర్జాతీయ అంశాలు కూడా వారి భేటీలో ప్రస్తావనకు వచ్చాయి. అనంతరం వైట్‌హౌ్‌సలోని ఈస్ట్‌ రూమ్‌లో నిర్వహించిన 44 నిమిషాల సంయుక్త పత్రికా సమావేశంలో ఇద్దరు నేతలూ మాట్లాడారు. భేటీలో తాము తీసుకున్న పలు నిర్ణయాల గురించి వెల్లడిస్తూ సంయుక్త ప్రకటన చేశారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య 500 బిలియన్‌ డాలర్ల వాణిజ్యమే లక్ష్యంగా ‘మిషన్‌ 500’ ప్రకటించారు. ‘యూఎ్‌స-ఇండియా 123 పౌర అణు ఒప్పందం’ అమలుకు కట్టుబడి ఉన్నామని ఇరువురు నేతలూ వెల్లడించారు. అమెరికా, ఇండియాల మధ్య అంతరిక్ష రంగంలో సహకారానికి సంబంధించి 2025 మార్గదర్శిగా నిలవబోతోందని.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తొలి భారతీయ వ్యోమగామిని పంపడానికి నాసా-ఇస్రో కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. అంతరిక్ష పరిశోధనల్లో ఇరు దేశాలూ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. డిఫెన్స్‌, ఏఐ, క్వాంటమ్‌, బయోటెక్నాలజీ, స్పేస్‌ తదితర రంగాలకు సంబంధించి కీలకమైన, అత్యంత అధునాతన పరిజ్ఞానాలపై కలిసి పని చేసేలా.. ‘ట్రాన్స్‌ఫార్మింగ్‌ ద రిలేషన్‌షి్‌ప యుటిలైజింగ్‌ స్ట్రాటజిక్‌ టెక్నాలజీ (ట్రస్ట్‌)’ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత సహకారాన్ని పెంపొందించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.


hjuikl.jpg

ట్రంప్‌ అలా.. మోదీ ఇలా..

భారత్‌ అధిక సుంకాలు విధిస్తే తామూ విధిస్తామంటూ సంయుక్త పత్రికా సమావేశంలో ట్రంప్‌ కుండబద్దలు కొడితే.. అదే వేదికపై, ట్రంప్‌ సాక్షిగా.. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను తిరిగి తీసుకోవడానికి భారత్‌ సిద్ధంగా ఉన్నదని మోదీ ప్రకటించారు. అమెరికాతో భారత్‌కు 50 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు ఉందని.. దాన్ని పూడ్చడానికి భారత్‌ అమెరికా నుంచి మరింతగా చమురు, గ్యాస్‌, మిలటరీ హార్డ్‌వేర్‌ను కొనుగోలు చేస్తుందని ట్రంప్‌ తెలిపారు. ఈమేరకు ప్రధాని మోదీ, తాను ఒక ఒప్పందానికి వచ్చామని.. దీనివల్ల భారత్‌కు అమెరికా నంబర్‌ వన్‌ ఆయిల్‌, గ్యాస్‌ సరఫరాదారుగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన కొన్ని ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడంతోపాటు, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను అనుమతిస్తూ న్యూఢిల్లీ ఇటీవల తీసుకున్న చర్యలను కొనియాడారు. ఇరు దేశాలూ రక్షణ భాగస్వామ్యాన్ని కూడా మరింత విస్తరించుకోవాలని నిర్ణయించినట్టు తెలిపారు. అందులో భాగంగా ఈ ఏడాది నుంచి భారతదేశానికి రక్షణ ఉత్పత్తుల విక్రయాలను వందల కోట్ల డాలర్ల మేర పెంచుతామని.. అంతిమంగా ఎఫ్‌-35 స్టెల్త్‌ ఫైటర్లను కూడా విక్రయించేందుకు మార్గం సుగమం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అలాగే, మునుపెన్నడూ లేని విధంగా.. ప్రపంచవ్యాప్తంగా రాడికల్‌ ఇస్లామిక్‌ తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు భారత్‌, అమెరికా కలిసి పనిచేస్తాయని ట్రంప్‌ ప్రకటించారు. ప్రపంచంలోని అత్యంత దుష్టులలో ఒకడు.. 2008 నవంబరు 26న ముంబైపై జరిగిన దాడి సూత్రధారుల్లో కీలక వ్యక్తి అయిన తహవ్వుర్‌ రాణాను భారత్‌కు తక్షణమే అప్పగించనున్నట్టు ట్రంప్‌ వెల్లడించారు.


‘‘అతడు చట్టం ముందు నిలబడడానికి ఇండియాకు వెళ్తున్నాడు’’ అని పేర్కొన్నారు. అంతేనా.. భారత్‌ నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు త్వరలో మరికొంతమందిని కూడా అప్పగిస్తామని ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఇక.. పౌర-అణు ఇంధన రంగంలో కూడా ఇరు దేశాల మధ్య సానుకూల కదలిక వచ్చిందని.. అమెరికా అణు పరిజ్ఞానాన్ని భారత మార్కెట్లలోకి ఆహ్వానించేందుకు ఇండియా తన చట్టాలను సంస్కరిస్తోందని ప్రెసిడెంట్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. భారత్‌-చైనా సంబంధాలపై విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు.. ఇరు దేశాల మధ్య సరిహద్దు సంఘర్షణలను తాను గమనిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఆ ఘర్షణను ఆపడానికి తాను ఏమైనా సాయం చేయగలిగితే ఆనందంగా చేస్తానన్నారు. చైనా, భారత్‌, అమెరికా, రష్యా కలిసికట్టుగా ముందుకెళ్లాలన్నది తన కోరిక అని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత్‌-మధ్యప్రాచ్యం-యూర్‌ప ఆర్థిక కారిడార్‌ గురించి ప్రశ్నించగా.. చరిత్రలోనే అత్యంత గొప్ప వాణిజ్య మార్గాల్లో ఒకదాన్ని నిర్మించడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.


jujujujuju;ik.jpg

ట్రంప్‌ నుంచి నేర్చుకున్నది అదే..

ట్రంప్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో చూడడం ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు జాతీయ (అమెరికా) ప్రయోజనాలే ముఖ్యమని, ఆయన్నుంచి తాను నేర్చుకున్నది అదేనని కొనియాడారు. ట్రంప్‌లాగానే తాను కూడా భారత దేశ ప్రయోజనాలనే అన్నింటికన్నా ముఖ్యంగా భావిస్తానని పేర్కొన్నారు. రక్షణ రంగానికి సంబంధించి రెండు దేశాలూ వచ్చే దశాబ్దకాలంపాటు పరస్పర సహకారంతో పనిచేస్తాయని.. ఇరు దేశాల మధ్య సహకార సంబంధాలు మరింత మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్‌ తొలివిడత పాలన సమయంతో పోలిస్తే ఇప్పుడు రెట్టింపు వేగంతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని.. అంటే 500 బిలియన్‌ డాలర్లకు చేర్చాలన్న ఉమ్మడి లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఈమేరకు ఇరుదేశాలకూ ప్రయోజనకరంగా ఉండే ఒప్పందాన్ని రూపొందించేందుకు ఇరు దేశాల యంత్రాంగాలూ కృషి చేస్తాయని తెలిపారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను వెనక్కి తీసుకోవడానికి అంగీకరిస్తున్నట్టు చెప్పారు. అయితే.. అలా అక్రమంగా ఉంటున్నవారంతా సాధారణ కుటుంబాలకు చెందినవారేనని, వారందరికీ ఎన్నో కలలు ఉంటాయని.. కొందరి మాటలు విని తప్పుదోవన అమెరికాకు వచ్చి ఉంటారని మోదీ వివరించారు.


అలా మానవ అక్రమ రవాణాకు పాల్పడే వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని.. అందుకు ఇరు దేశాలూ కలిసి పనిచేయాలని అభిప్రాయపడ్డారు (అమెరికా ఇప్పటికే అలా 104 మంది అక్రమ వలసదారులను భారత్‌కు పంపిన సంగతి తెలిసిందే. అలా పంపిస్తున్నవారికి సంకెళ్లు వేసి పంపించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. త్వరలో మరికొందరు భారతీయులను రెండు విమానాల్లో పంపేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో.. వారికి సంకెళ్లు వేసి పంపే విషయమై ట్రంప్‌-మోదీ మధ్య ఎలాంటి చర్చా జరిగినట్టు సమాచారం లేదు. సంయుక్త పత్రికా సమావేశంలో కూడా దీనిపై ఎవరూ ప్రశ్నించకపోవడం గమనార్హం). ఒక దేశంలో అక్రమంగా ప్రవేశించే వ్యక్తికి అక్కడ నివసించే హక్కు ఉండదని.. ఇది ప్రపంచంలో ఎవరికైనా వరిస్తుందని మోదీ స్పష్టం చేశారు. అలాగే.. తహవ్వుర్‌ రాణాను భారత్‌కు అప్పగించాలనే నిర్ణయం తీసుకున్నందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భారత కోర్టులు అతడికి తగిన శిక్ష విధిస్తాయని పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ఆపే పరిష్కారమార్గాల దిశగా ట్రంప్‌ చేస్తున్న కృషికి తన మద్దతు ఉందని మోదీ పేర్కొన్నారు. ‘‘ఎందుకో.. ఈ యుద్ధం విషయంలో భారత్‌ తటస్థ వైఖరి అవలంబిస్తోందని ప్రపంచం అనుకుంటోంది. కానీ, వాస్తవానికి భారతదేశం ఈ యుద్ధం విషయంలో ‘శాంతి’ వైపు ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై తాను ఇరు దేశాల నేతలనూ కలిసి మాట్లాడినట్టు చెప్పారు.


గతంలో తాను పుతిన్‌ను కలిసినప్పుడు.. ఇది యుద్ధాల యుగం కాదని, సమస్యలకు పరిష్కారాలను యుద్ధరంగంలో కనుగొనలేమని.. చర్చల ద్వారానే శాంతి సాధ్యమని చెప్పినట్టు వెల్లడించారు. ఢిల్లీలో జరగనున్న క్వాడ్‌ నేతల సమావేశంలో ట్రంప్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురుచూస్తున్నట్టు ప్రధాని మోదీ తెలిపారు. 2020లో ట్రంప్‌ భారత పర్యటనను భారతీయులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారని పేర్కొన్నారు. ‘‘మీరు మళ్లీ వస్తారని వారంతా ఎదురుచూస్తున్నారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున నేను మిమ్మల్ని ఇండియాకు ఆహ్వానిస్తున్నా’’ అన్నారు. కాగా, ట్రంప్‌తో సమావేశానికి ముందు ప్రధాని మోదీ అమెరికా జాతీయ భద్రత సలహాదారు మైక్‌ వాల్ట్స్‌, ఆ దేశ జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్‌ తుల్సీ గబ్బార్డ్‌, టెక్‌ బిలియనీర్‌, స్పేస్‌ఎక్స్‌ చీఫ్‌ ఈలన్‌ మస్క్‌, రిపబ్లికన్‌ లీడర్‌ వివేక్‌ రామస్వామితో విడివిడిగా భేటీ అయ్యారు. ఇక, ట్రంప్‌తో జరిగిన అద్భుతమైన సమావేశం.. ఇరు దేశాల మధ్య స్నేహానికి గణనీయమైన ఉరవడినిస్తుందని పేర్కొంటూ ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు. ట్రంప్‌తో భేటీ అనంతరం అమెరికా నుంచి భారత్‌కు ఆయన తిరిగొచ్చారు.


అమెరికాలో మరో రెండు కాన్సులేట్లు

భారతదేశం త్వరలోనే అమెరికాలోని బోస్టన్‌, లాస్‌ఏంజెలెస్‌ నగరాల్లో రెండు దౌత్యకార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇరు దేశాల ప్రజల మధ్య బంధాలను ఈ కాన్సులేట్లు బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ సమాజం రెండు దేశాలనూ కలిపే అత్యంత కీలకమైన బంధమని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే.. భారత్‌లో ఆఫ్‌షోర్‌ క్యాంప్‌సలను ప్రారంభించాల్సిందిగా అమెరికన్‌ యూనివర్సిటీలను కోరినట్టు మోదీ తెలిపారు. కాగా, అమెరికాలో ఏర్పాటు చేయబోయే రెండు కాన్సులేట్ల గురించి గత ఏడాది సెప్టెంబరులో న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ప్రకటించడం గమనార్హం.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 15 , 2025 | 04:47 AM