Share News

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

ABN , Publish Date - Feb 14 , 2025 | 05:08 PM

సీఈసీగా 2022 మేలో రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. గత ఏప్రిల్-జూన్‌లో జరిగిన కీలకమైన లోక్‌సభ ఎన్నికలు, దశాబ్దం తరువాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి.

CEC: కొత్త సీఈసీ ఎంపికకు కసరత్తు.. 18న రాజీవ్ కుమార్ పదవీవిరమణ

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) రాజీవ్ కుమార్ (Rajiv Kumar) ఈనెల 18న రిటైర్ అవుతుడటంతో కొత్త సీఈసీ ఎంపిక ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈనెల 17న సెలక్షన్ కమిటీ సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ కమిటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, లోక్‌సభలో విపక్ష నేత హోదాలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉన్నారు. సీఈసీ, ఈసీ ఎంపికకు సంబందించిన కొత్త చట్టానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి ఒకరోజు ముందు సీఈసీ ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Mamata Kulakarni: మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణ


సీఈసీగా 2022 మేలో రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. గత ఏప్రిల్-జూన్‌లో జరిగిన కీలకమైన లోక్‌సభ ఎన్నికలు, దశాబ్దం తరువాత జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి. 2022లో రాష్ట్రపతి ఎన్నికల నిర్వహణ, కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలను సైతం నిర్వహించారు. చివరిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ఇటీవల నిర్వహించారు.


రాజీవ్ కుమార్ తన పదవీకాలంలో ప్రతిపక్షాల నుంచి.. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి ఫిర్యాదులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ఆరోపించాయి. ఈవీఎంల వినియోగాన్ని నిలదీశాయి. లైవ్ ఓటింగ్ ట్రెండ్స్‌ పబ్లిష్ చేయడంలో ఈసీ తీవ్ర జాప్యం చేసిందంటూ హర్యానా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఎలక్షన్ కమిషన్ పూర్తిగా బీజేపీకి లొంగిపోయిందని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ముందు ఆప్ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను సీఈసీ స్వయంగా తిప్పికొట్టారు. ఈవీఎంలను ఎవరూ హ్యాక్ చేయలేరని, ఈసీ నిష్పాక్షికతను ఎవరూ వేలెత్తిచూపలేరని అన్నారు.


రాజీవ్ కుమార్ ఇటీవల తన రిటైర్మెంట్ ప్లాన్స్ వివరిస్తూ, పదవి విరమణ అనంతరం హిమాలయాలకు వెళ్లి కొన్ని నెలలు అక్కడే ఉంటానని చెప్పారు. ఏకాంతం, స్వీయ అధ్యయనం కోసం తనకు కొంత సమయం కావాలని, ఇందుకోసం దూరంగా వెళ్తానని, అనవసర అంశాల నుంచి పూర్తి విముక్తి పొందుతానని చెప్పారు.


వరుస ఎన్నికలు..

కాగా, ఈ ఏడాది ద్వితీయార్థంలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా, వచ్చే ఏడాది బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. దీంతో కొత్త సీఈసీ ఎంపిక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇవి కూడా చదవండి...

PM Modi: ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్ సమావేశం.. అక్రమ వలసదారుల విషయంపై మోదీ కీలక వ్యాఖ్యలు

Chennai: కమల్‌హాసన్‌తో ఉప ముఖ్యమంత్రి భేటీ..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 14 , 2025 | 05:08 PM