Macron Calls Trump: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి.. అమెరికా అధ్యక్షుడికి ఫ్రాన్స్ అధ్యక్షుడి కాల్
ABN , Publish Date - Sep 23 , 2025 | 08:59 PM
న్యూయార్క్‌లో అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ కోసం ట్రాఫిక్ నిలిపివేయడంతో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన కాన్వాయ్ కూడా నిలిచిపోవడంతో చివరకు మాక్రాన్ ట్రంప్‌కు కాల్ చేసినట్టు వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా వీధుల్లో పోలీసులు అడ్డగించడంతో చిక్కుల్లో పడ్డ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మాక్రాన్ చివరకు డొనాల్డ్ ట్రంప్ సహాయం అర్థించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. సోమవారం న్యూయార్క్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది (Macron blocked by NYPD).
న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడి కాన్వాయ్ ప్రయాణించే మార్గం చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్‌పై ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడి కాన్వాయ్ కూడా రోడ్డుపై నిలిచిపోయింది. ఈ క్రమంలో కారు దిగిన మాక్రాన్ అక్కడి పోలీసులను ఏం జరుగుతోందని ప్రశ్నించాడు. ‘మిస్టర్. ప్రెసిడెండ్.. సారీ ఏమనుకోవద్దు. డొనాల్డ్ ట్రంప్ కాన్వాయ్ నేపథ్యంలో ట్రాఫిక్‌ను చాలా చోట్ల నిలిపివేశారు. ఏమనుకోవద్దు’ అంటూ ఆయనను ముందుకు కదలనీయలేదు (Macron Trump phone call).
దీంతో, మాక్రాన్ రోడ్డుపై నిలబడి నేరుగా డోనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘మీకు కనబడకపోతే నేను రోడ్డు దాటుతా.. ఇక్కడ నేను నిలబడిపోయా.. మీ కోసం ట్రాఫిక్ మొత్తాన్ని నిలిపివేశారు’ అని ఫోన్‌లో ఆయన అనడం రికార్డయ్యింది. అయితే, అమెరికా అధ్యక్షుడు ఐక్యరాజ్య సమితికి వెళ్లేటప్పుడు ఆయన ప్రయాణించే మార్గంలో చుట్టుపక్కల కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని సంబంధిత వర్గాలు తెలిపాయి. పలు చోట్ల ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపివేస్తామని తెలిపాయి. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడితో సెల్ఫీలు దిగేందుకు పలువురు ఆసక్తి చూపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఐక్యరాజ్య సమితి 80వ సాధారణ సమావేశాల్లో పాల్గొనేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీ నుంచి సోమవారం న్యూయార్క్‌కు చేరుకున్నారు. మంగళవారం ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ఆయన ఏడు యుద్ధాలను ఆపానంటూ మరోసారి చెప్పుకున్నారు. ఈ ఉదంతం మరోసారి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇవి కూడా చదవండి:
చైనా కే వీసా.. హెచ్-1బీ వీసాకు పోటీగా..
హెచ్-1బీ వీసా పెంపును సమర్థించుకున్న అమెరికా.. వాస్తవాలు ఇవిగో అంటూ ప్రకటన
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి