Share News

Kim Jong: చైనా పర్యటన.. బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బయలుదేరిన ఉత్తరకొరియా అధ్యక్షుడు

ABN , Publish Date - Sep 02 , 2025 | 01:02 PM

చైనా పర్యటన కోసం ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సోమవారం సాయంత్రం ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బయలుదేరారు. నేటి సాయంత్రం ఆయన చైనాకు చేరుకోనున్నారు. అక్కడి మిలిటరీ పరేడ్‌‌ను పుతిన్, జిన్‌పింగ్‌తో కలిసి వీక్షించనున్నారు.

Kim Jong: చైనా పర్యటన.. బుల్లెట్ ప్రూఫ్ రైల్లో బయలుదేరిన ఉత్తరకొరియా అధ్యక్షుడు
Kim Jong Un China Visit

ఇంటర్నెట్ డెస్క్: సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తాజాగా బుల్లెట్ ప్రూఫ్ రైల్లో చైనా పర్యటనకు వెళ్లారు. తన ప్రత్యేకమైన ప్రేవేటు రైల్లో ఆయన సోమవారం సాయంత్రం చైనాకు బయలుదేరారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసి 80 సంవత్సరాలు అయిన నేపథ్యంలో చైనాలో జరుగుతున్న మిలిటరీ పరేడ్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన నేటి సాయంత్రం అక్కడకు చేరుకుంటారు.

గతేడాది రష్యాలో పర్యటించిన కిమ్ తాజాగా చైనా పర్యటన చేపట్టారు. కిమ్ వెంట ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి, ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. ఇక 2019లో చివరిసారిగా కిమ్, జీ సమావేశమయ్యారు. తాజా పర్యటనలో ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలిసి పరేడ్‌ను వీక్షించనున్నారు. శక్తిమంతమైన ఇద్దరు దేశాధినేతలతో కిమ్ వేదిక పంచుకోవడం ఉత్తర కొరియా ప్రాధాన్యత పెరగడానికి సంకేతమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక కిమ్ కుటుంబం కూడా ఇదే రైలును వినియోగించింది. ఉత్తర కొరియాను ఏలిన కిమ్ తండ్రి కూడా ఇదే రైల్లో ప్రయాణించేవారు. భద్రతతో పాటు జర్నీని ఎంజాయ్ చేసేందుకు ఈ రైలును కిమ్ ఇష్టపడతారని సమాచారం. గతంలో రష్యా పర్యటనకు కూడా ఇదే రైల్లో కిమ్ వెళ్లారు.


ఉత్తరకొరియాకు చైనా ఎప్పటి నుంచో అండగా ఉంటున్న విషయం తెలిసిందే. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల ఆంక్షలతో ఇక్కట్ల పాలైన ఉత్తరకొరియాకు ఒకే ఒక దిక్కుగా చైనా నిలుస్తోంది. ఇటీవల కాలంలో కిమ్ రష్యాకు కూడా దగ్గరయ్యారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు ఆయుధాలు, సైనికులను ఉత్తర కొరియా సమకూరుస్తోందని అమెరికా ఆరోపించింది.

రష్యా, చైనా, ఉత్తర కొరియా మధ్య బంధం మరింతగా బలోపేతం అవుతోందనేందుకు కిమ్ చైనా పర్యటన ప్రధాన సంకేతమని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. దౌత్య సంబంధాల్లో కిమ్ ప్రాముఖ్యత తాజా పర్యటనతో మరింత పెరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక 2019లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఉత్తరకొరియాలో పర్యటించారు. కొరియా ద్వీకల్పంలో అణ్వాయుధాలు ఉండకూడదని ఆ సందర్భంగా పిలుపునిచ్చారు. అంతకుమునుపు పది నెలల కాలంలో కిమ్ ఏకంగా నాలుగు సార్లు చైనాలో పర్యటించారు. అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలతో సఖ్యత పెంపొందించుకునేందుకు చైనా సహకరించాలని కోరారు.


ఇవీ చదవండి:

జపాన్ టూరిస్టుల నుంచి లంచం వసూలు.. ట్రాఫిక్ పోలీసులపై సస్పెన్షన్ వేటు

చైనా, రష్యాతో పోలిస్తే భారత్ అమెరికాకే దగ్గర: అమెరికా ట్రెజరీ సెక్రెటరీ

Read Latest and Viral News

Updated Date - Sep 02 , 2025 | 01:11 PM