Scott Bessent: చైనా, రష్యాతో పోలిస్తే భారత్ అమెరికాకే దగ్గర: అమెరికా ట్రెజరీ సెక్రెటరీ
ABN , Publish Date - Sep 02 , 2025 | 12:07 PM
అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ భారత్‌పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామిక విలువలపరంగా భారత్ అమెరికాకే దగ్గరని అన్నారు. అయితే, భారత్ తీసుకునే తప్పు చర్యల కారణంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం పాటు కొనసాగుతోందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: షాంఘాయ్ సహకార సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం, ఆపై రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశాలు నిర్వహించడం అమెరికా ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీఓ సదస్సు మొత్తం నాటకీయంగా జరిగిందని అన్నారు. భారత్ కొనుగోలు చేస్తున్న రష్యా చమురు.. ఉక్రెయిన్ యుద్ధానికి ఇంధనంగా మారుతోందని అన్నారు. భారత్‌పై సుంకాల విధింపును కూడా ప్రస్తావించారు. అయితే, ఈ ఉద్రిక్తతలను భారత్, అమెరికాలు పరిష్కరించుకుంటాయన్న నమ్మకం తనకు ఉందని అన్నారు.
ఎస్సీఓ సమావేశం, పుతిన్, జిన్‌పింగ్‌లతో ప్రధాని మోదీ సమావేశం గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మీటింగ్ సాధారణంగా జరిగేదేనని వ్యాఖ్యానించారు. అయితే, సమావేశంలో మాత్రం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయని అన్నారు. ‘ఏది ఏమైనప్పటికీ భారత్ అతి పెద్ద ప్రజాస్వామిక దేశం. చైనా, రష్యాతో పోలిస్తే భారత ప్రజాస్వామిక విలువలు అమెరికాకు దగ్గరగా ఉంటాయి.’ అని వ్యాఖ్యానించారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్, చైనా చమురు కొనుగోళ్లు ఇంధనంగా మారుతున్నాయి’ అని అన్నారు. అయితే, భారత్ అమెరికా బంధం పునాదులు బలంగా ఉన్నాయని అన్నారు. ఇక రష్యాపై తదుపరి చర్యలకు తమ ముందు ఉన్న ప్రత్యామ్నాయాలపై కూడా చర్చలు జరుగుతున్నాయని తెలిపారు.
ఇదిలా ఉంటే అమెరికా వాణిజ్య వ్యవహారాల సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్‌పై విమర్శలు గుప్పించారు. అతి పెద్ద ప్రజాస్వామిక దేశానికి నేత అయిన మోదీ, నియంతలతో వేదిక పంచుకోవడం తలవంపులు తెచ్చే ఘటన అని వ్యాఖ్యానించారు. అమెరికా, ఐరోపాతో కలిసి భారత్ పనిచేయాలని రష్యా చమురు కొనుగోళ్లను కట్టిపెట్టాలని అన్నారు.
అంతకుముందు ట్రంప్ కూడా భారత్‌పై విమర్శలు గుప్పించారు. భారత్‌తో ఒప్పందం అమెరికాకు ఓ విపత్తుగా మారిందని అన్నారు. భారత్‌కు అతిపెద్ద వ్యాపార భాగస్వామి అయినప్పటికీ అమెరికా తన ఉత్పత్తులను ఎగుమతి చేయలేకపోతోందని అన్నారు. ఈ విషయాలపై జనాలు ఆలోచించాలనే ఈ పోస్టు పెడుతున్నట్టు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
కుటుంబ వ్యాపారాల కోసం భారత్‌తో సంబంధాలను ట్రంప్ వదులకున్నారు: అమెరికా ప్రభుత్వ మాజీ సలహాదారు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి