Share News

Israel-Iran Conflict: ఆ ఒక్క షరతుపై చర్చలకు సిద్ధమేనన్న టెహ్రాన్

ABN , Publish Date - Jun 17 , 2025 | 11:33 AM

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు మంగళవారంతో ఐదోరోజుకు చేరుకున్నాయి. ఇరువైపులా దాడులు ఉద్ధృతం చేస్తున్నాయి. దీంతో టెహ్రాన్‌లోని తమ దేశ పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశించారు.

Israel-Iran Conflict: ఆ ఒక్క షరతుపై చర్చలకు సిద్ధమేనన్న టెహ్రాన్
Iran Israel War

టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు ఉధ్ధృతం కావడంతో న్యూక్లియర్ ప్రోగ్రాంపై చర్చలకు టెహ్రాన్ సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అరబ్ మిత్ర దేశాలతో ఇటు ఇజ్రాయెల్‌కు, అమెరికాకు రాయబారం పంపిందని చెబుతున్నారు. ఇరువర్గాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉద్రిక్తతలు తగ్గేలా చర్చలకు తాము సిద్ధమేనని, అయితే ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఘర్షణలో అమెరికా పాలుపంచుకోరాదని ఇరాన్ షరతు పెట్టినట్టు సమాచారం. గల్ఫ్‌ దేశాలైన సౌదీ, ఖతార్, ఒమన్ దేశాలు కూడా ఈ సంక్షోభాన్ని త్వరగా ముగించాలని వాషింగ్టన్‌ను కోరినట్టు తెలుస్తోంది.


ఐదోరోజుకు..

మరోవైపు.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడులు మంగళవారంతో ఐదోరోజుకు చేరుకున్నాయి. ఇరువైపులా దాడులు ఉద్ధృతం చేస్తున్నాయి. దీంతో టెహ్రాన్‌లోని తమ దేశ పౌరులను వెంటనే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని ట్రంప్ ఆదేశించారు. కెనడాలోని జీ-7 సదస్సుకు వెళ్లిన ట్రంప్ ఒకరోజు ముందుగానే అర్ధాంతరంగా తన పర్యటనను ముగించుకుని అమెరికాకు తిరిగి వస్తున్నారు. ఆ వెనువెంటనే ఆయన జాతీయ భద్రతా మండలితో అత్యవసర సమావేశంలో పాల్గొంటారు. ఇదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాలను మరిచిపోవాలంటూ ట్రంప్ సోషల్ మీడియాలో కుండబద్ధలు కొట్టారు. డీల్‌పై సంతకాలు చేయాలని ఇరాన్‌కు తాను గట్టిగా చెప్పానని, ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండదని తాను మళ్లీ చెబుతున్నానని సోషల్ మీడియాలో ట్రంప్ పోస్ట్ చేశారు.


ట్రంప్ సందేశం అనంతరం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌, న్యూక్లియర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు కీలకంగా ఉన్న నతాంజ్‌లోనూ పేలుళ్ల వినిపించినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. అటు ఇజ్రాయెల్‌ భూభాగంపై ఇరాన్ క్షిపణి దాడులు జరపడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత టెల్ అవివ్‌లో ఎయిర్ రెయిడ్ సైరెన్లు మోగాయి.


ఇవి కూాడా చదవండి..

అర్ధాంతరంగా అమెరికాకు ట్రంప్

కొనసాగుతున్న ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ..ట్రంప్‌ నేతన్యాహూ మధ్య వీటో వివాదం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 11:54 AM