Indian American-ICE: అమెరికాలో భారత సంతతి వ్యక్తికి వలసల శాఖ అధికారుల వేధింపులు
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:09 PM
అమెరికా పౌరసత్వం ఉన్న ఓ భారత సంతతి వ్యక్తిని వలసల శాఖ అధికారులు అతడి ఇమిగ్రేషన్ స్టేటస్ గురించి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టిన వైనం తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఈ ఘటనను రాష్ట్ర గవర్నర్ కార్యాలయం ఖండించింది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా పౌరసత్వం ఉన్న ఓ భారత సంతతి వ్యక్తిని వలసల శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేశారు. నీకు మమ్దానీ ఎవరో తెలుసా అంటూ ప్రశ్నల పరంపరతో ఇక్కట్ల పాలు చేశారు. ఈ మేరకు చికాగో టైమ్స్ ప్రచురించిన ఓ కథనం ప్రస్తుతం అమెరికాలో కలకలం రేపుతోంది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పార్క్ రిడ్జ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది (Indian Origin Man Questioned by ICE Agents).
మీడియా కథనాల ప్రకారం, ఆ భారత సంతతి వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఇల్లినాయిస్ (Illinois) రాష్ట్ర ట్రాన్స్‌పోర్టేషన్ శాఖలో పనిచేస్తున్నారు. పార్క్ రిడ్జ్ ప్రాంతంలో ఓ నిర్మాణ ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో వలసల శాఖకు (ఐసీఈ) చెందిన ముగ్గురు ఏజెంట్స్ ఆయనను సమీపించారు. ఆయన ఇమిగ్రేషన్ స్థితిగతుల గురించి ప్రశ్నించారు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో గెలిచిన మమ్దానీ ఎవరో నీకు తెలుసా? అని కూడా ప్రశ్నించారు.
ఈ ఘటనపై ఇల్లినాయిస్ గవర్నర్ కార్యాలయం స్పందించింది. వలసల శాఖ అధికారుల తీరును ఖండించింది. శరీర వర్ణం ఆధారంగా ఆయనను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర మౌలిక వసతులను మెరుగు పరిచేందుకు కృషి చేస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగిని ఇలా ప్రశ్నించారని తెలిసి తాను షాకయ్యానని గవర్నర్ అన్నట్టు ఆయన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అకారణంగా ఇలా చేయడం సబబు కాదని తెలిపింది.
అయితే, ఈ వార్తలను అమెరికా హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ మాత్రం ఖండించింది. పార్క్ రిడ్జ్ ప్రాంతంలో తమ శాఖ ఉద్యోగులు తినిఖీలు నిర్వహించినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చింది. ఇక అక్రమ వలసలకు అడ్డుకట్ట వేస్తున్నామంటూ ఇష్టారీతిన రెయిడ్స్ నిర్వహించడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. తమ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ నిరసన బాటపట్టారు.
ఇక వలసల విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. వలసల శాఖ అధికారులు హద్దు మీరుతున్నారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ వారు చేయవలసినంత చేయట్లేదని అభిప్రాయపడ్డారు. ఉదారవాద న్యాయమూర్తులు, మునుపటి ప్రభుత్వాల కారణంగా వలసల శాఖ వెనక్కు తగ్గాల్సి వచ్చిందని అన్నారు.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి