Donald Trump: వాణిజ్య బెదిరింపులతో దారికి..
ABN , Publish Date - May 13 , 2025 | 04:07 AM
అణుయుద్ధాన్ని నివారించేందుకు వాణిజ్య బెదిరింపులు చేశానని ట్రంప్ వెల్లడించగా, భారత్ వర్గాలు ఆయన వ్యాఖ్యలు వాస్తవం కాదంటూ ఖండించాయి. అమెరికా వాణిజ్యంతో బెదిరించి భారత్, పాక్‌ల మధ్య కాల్పుల విరమణ సాధించానని ట్రంప్ వ్యాఖ్యానించారు.
యుద్ధం ఆపకపోతే వాణిజ్యం ఉండదని బెదిరించా
ఉన్నపళంగా కాల్పుల విరమణ పాటించాలని చెప్పా
భారత్-పాక్ అణు యుద్ధాన్ని నివారించా
లేకుంటే కోట్ల మంది చనిపోయేవారు
భారత్, పాక్ ప్రధానులు పరిస్థితిని అర్థం చేసుకున్నారు
భారత్‌తో చర్చలు ప్రారంభించాం.. పాక్‌తోనూ త్వరలో..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు
ఆయన వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్న భారత ప్రభుత్వ వర్గాలు
న్యూయార్క్/వాషింగ్టన్, మే 12: భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలకు అడ్డుకట్ట వేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్నారు. కాల్పుల విరమణ పాటించకపోతే.. తమ దేశంతో వాణిజ్యం ఆపేస్తానని హెచ్చరించానని, ఇరు దేశాల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ఉప ఖండంలో కొన్ని రోజులుగా చరిత్రాత్మక ఘటనలు జరుగుతున్నాయి. భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. వారు ఇప్పట్లో వెనక్కి తగ్గేలా కనిపించలేదు. ఇరు దేశాలు అమెరికాతో వాణిజ్యం నుంచి ఎంతో లబ్ధి పొందవచ్చని వారికి చెప్పా.. మరింతగా వాణిజ్య అవకాశాలు కల్పిస్తానని ప్రతిపాదించా.. ఒకవేళ భారత్-పాక్ వెంటనే కాల్పుల విరమణ పాటించకపోతే.. అమెరికాతో వాణిజ్యం ఉండబోదని స్పష్టం చేశా.. వాళ్లు పలు కారణాలతో కాల్పుల విరమణ పాటించవచ్చు. కానీ అసలైన పెద్ద కారణం మాత్రం వాణిజ్యమే. మేం పాకిస్థాన్, భారత్ రెండింటితోనూ పెద్ద ఎత్తున వాణిజ్యం జరపనున్నాం. ఈ అంశంలో భారత్‌తో చర్చలు మొదలుపెట్టాం. త్వరలో పాకిస్థాన్‌తోనూ చర్చలు జరుపుతాం..’’ అని ట్రంప్ చెప్పారు. బోలెడన్ని అణ్వాయుధాలు ఉన్న భారత్- పాకిస్థాన్ మధ్య ప్రమాదకర పరిస్థితిని నివారించేలా, ఉన్నపళంగా కాల్పుల విరమణ ప్రకటించేలా తన యంత్రాంగం విజయవంతంగా మధ్యవర్తిత్వం వహించిందని పేర్కొన్నారు. లేకుంటే అణుయుద్ధం జరిగి కోట్లాది మంది చనిపోయేవారని.. దానిని ఆపినందుకు గర్వపడుతున్నానని వ్యాఖ్యానించారు.
ఈ ప్రక్రియలతో తమ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో బాగా కృషి చేశారని ప్రశంసించారు. భారత్, పాక్ ప్రధాన మంత్రులు శక్తివంతులు, తిరుగులేని వారని.. ప్రస్తుత పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోగలిగిన తెలివి వారికి ఉందని వ్యాఖ్యానించారు. వాణిజ్యం అంశాన్ని తాను వినియోగించినట్టుగా ఎవరూ వినియోగించలేరని, అది స్పష్టంగా చెప్పగలనని పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు..!
వాణిజ్యం ఆపేస్తానని హెచ్చరించడంతో భారత్, పాక్ కాల్పుల విరమణకు సిద్ధమయ్యాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వాస్తవదూరమని భారత ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ‘‘ట్రంప్ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం ఖండిస్తోంది. ఆపరేషన్ సిందూర్ మొదలయ్యాక మే 9న ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడారు. మే 8న, 10న విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు డోభాల్‌తో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడారు. అందులో ఎక్కడా, ఏ రకంగానూ వాణిజ్యం ప్రస్తావనే రాలేదు’’ అని వెల్లడించాయి.