Thomas Kurian: థామస్ కురియన్ జీవితం యువతకు ఆదర్శం
ABN , Publish Date - Oct 16 , 2025 | 06:10 PM
విజేతలు గా నిలిచిన ఎంతో మంది స్టోరీలు మనకు కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. అంతేకాక ఎంతో మంది యువతకు కూడా ఆదర్శంగా ఉంటాయి. వెయిటర్ నుంచి క్లౌడ్ సీఈఓగా ఎదిగిన ఓ వ్యక్తి..జీవితం నేటి యువతకు స్ఫూర్తి
ప్రతి ఒక్కరికి జీవితంలో లక్ష్యం అనేది ఉంటుంది. అయితే కొందరు మాత్రమే ఆ టార్గెట్ ను అందుకుంటారు. కారణం.. విజయాలు అనేవి అంత ఈజీగా దక్కవు. విజేతలు గా నిలిచిన ఎంతో మంది స్టోరీలు మనకు కన్నీళ్లు తెప్పిస్తుంటాయి. అంతేకాక ఎంతో మంది యువతకు కూడా ఆదర్శంగా ఉంటాయి. వెయిటర్ నుంచి క్లౌడ్ సీఈఓగా ఎదిగిన ఓ వ్యక్తి..జీవితం నేటి యువతకు స్ఫూర్తి. మరి.. ఆయన ఎవరు.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
దిగ్గజ సంస్థ గూగుల్‌లో క్లౌడ్ సీఈఓ (Google Cloud CEO)గా పని చేస్తున్న థామస్ కురియన్ విశాఖపట్నంలో గూగుల్ (Google) అతిపెద్ద ఏఐ హబ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఆయన లైఫ్ జర్నీ చాలా విచిత్రంగా సాగింది. కేరళలోని కొట్టాయం జిల్లా పాంపడికి చెందిన థామస్ కురియన్‌ది విద్యావంతుల కుటుంబం. తండ్రి కెమికల్ ఇంజినీర్, తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఈ దంపతులకు నలుగురు సంతానం. థామస్ కురియన్ తన సోదరుడు జార్జ్ కురియన్ తో కలిసి బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఐఐటీ మద్రాసు(IIT Madras)లో చేరారు. అక్కడే వీరి జీవితం మలుపు తిరిగింది. చెన్నైలో చదువుతున్నప్పుడు అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో సీటు లభించింది. దీంతో అందరు గొప్పగా భావించే మద్రాస్ ఐఐటీ చదువును మధ్యలోనే వదిలేసి వీరు యూఎస్ఏ(USA) వెళ్లిపోయారు.
అమెరికాలో థామస్ కురియన్(Thomas Kurian) సోదరులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. డబ్బుల కోసం తొలినాళ్లలో కేఫ్‌లో వెయిటర్‌గా, కార్ పార్కింగ్‌ల వద్ద అటెండర్లుగా పనిచేశారు. అలా వెయిటర్ గా పని చేస్తూ చదువు కోసం డబ్బు సమకూర్చుకున్నారు. అలా కెరీర్‌ను ప్రారంభించిన థామస్ స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అనంతరం మొదటి సారి మెకెన్సీ అండ్ కంపెనీలో చేరారు. అక్కడ ఆరేళ్లు పనిచేసిన తర్వాత ఒరాకిల్‌లో చేరారు. ఆయన దాదాపు 22 ఏళ్ల పాటు ఆ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. 32 దేశాల్లో దాదాపు 35వేల మందికి టీమ్ లీడ్‌గా వ్యవహరించారు. కురియన్ (Thomas Kurian)2018లో ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు.
అదే ఏడాది గూగుల్ క్లౌడ్ విభాగంలో సీఈఓగా(Google Cloud CEO) నియమితులయ్యారు. థామస్ కురియన్ నేతృత్వంలో గూగుల్ క్లౌడ్ కస్టమర్ సర్వీస్‌లో పలు మార్పులు తీసుకొచ్చారు. తాజాగా విశాఖలో గూగుల్ ఏఐ హబ్(Google AI Hub Visakhapatnam) ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం థామస్ కురియన్ నికర సంపద దాదాపు రూ.15వేల కోట్లకు పైనే ఉంటుందని అంచనా. ఇలా పట్టుదలతో, ఎన్ని అవాంతరాలు వచ్చినా ముందుకు సాగి విజయం సాధించిన థామస్ కురియన్ జీవితం నేటి తరం యువతకు ఆదర్శం .
ఈ వార్తలు కూడా చదవండి:
Pawan Kalyan On GST Meeting: ప్రధాని మోదీని కర్మయోగిగా చూస్తాం: పవన్ కల్యాణ్