Share News

Trump Tariffs on Canada: కెనడాపై అదనపు సుంకం.. భారీ షాకిచ్చిన ట్రంప్

ABN , Publish Date - Oct 26 , 2025 | 08:27 AM

సుంకాలను వ్యతిరేకిస్తూ కెనడాలోని ఓంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం స్పాన్సర్ చేసిన ఓ యాడ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. కెనడా దిగుమతులపై తాజాగా 10 శాతం అదనపు సుంకాన్ని విధించారు.

Trump Tariffs on Canada: కెనడాపై అదనపు సుంకం.. భారీ షాకిచ్చిన ట్రంప్
Donald Trump Canada tariff

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాకు భారీ షాకిచ్చారు. కెనడా దిగుమతులపై మరో 10 శాతం సుంకం విధిస్తున్నట్టు సోషల్ మీడియాలో శనివారం ప్రకటించారు. సుంకాలను వ్యతిరేకిస్తూ కెనడాలోని ఓంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రసారమైన ఓ ప్రకటనతో ఆగ్రహానికి గురైన ట్రంప్ సుంకాలను మళ్లీ పెంచారు. సుంకాలతో అమెరికా జనాలకే నష్టం కలుగుతుందంటూ రిపబ్లికన్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ 1987లో చేసిన ప్రసంగాన్ని ఓంటారియో ప్రభుత్వం తన ప్రకటనలో చేర్చింది. సుంకాలతో వాణిజ్య యుద్ధాలు మొదలవుతాయని అప్పట్లో ఆయన హెచ్చరించారు (Trump 10 percent Tariff on Canada).


ఈ యాడ్‌పై అగ్గిమీద గుగ్గిలమైన ట్రంప్ రెండు రోజుల క్రితమే కెనడాతో వాణిజ్య చర్చల నుంచి తప్పుకున్నారు. యాడ్‌ను తొలగిస్తామని ఓంటారియో ప్రభుత్వం కూడా శుక్రవారం పేర్కొంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఓంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ పేర్కొన్నారు. అయితే, ఈ వారాంతంలో మాత్రం యాడ్ కొనసాగుతుందని అన్నారు. ఇది ట్రంప్‌కు ఆగ్రహం తెప్పించడంతో కెనడాపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు శనివారం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘వాళ్లు యాడ్‌ను వెంటనే తొలగించి ఉండాల్సింది. కానీ నిన్నటి క్రీడల్లో భాగంగా యాడ్‌ను ప్రదర్శించారు. అది మోసమని తెలిసీ తమ తీరు మార్చుకోలేదు. ఇది దుందుడుకు చర్య. కాబట్టి కెనడాపై అదనంగా 10 శాతం సుంకాన్ని విధిస్తున్నాను’ అని పేర్కొన్నారు (Regan Ad in Ontario).


కెనడాపై అమెరికా 35 శాతం సుంకాన్ని విధిస్తోంది. దీనితో పాటు రంగాల వారీగా లెవీలు కూడా విధించింది. కెనడా నుంచి దిగుమతయ్యే ఖనిజాలపై 50 శాతం లెవీ, ఆటోమొబైల్ ఉత్పత్తులపై 25 శాతం లెవీ విధిస్తుంది. అయితే, రెండు దేశాల మధ్య ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కారణంగా చాలా ఉత్పత్తులకు సుంకాల నుంచి మినహాయింపు ఉంది. అమెరికా, కెనడా మధ్య చాలా కాలంగా వాణిజ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. జీ7 దేశాల్లో కెనడా మాత్రమే ఇప్పటివరకూ అమెరికాతో ఎలాంటి ట్రేడ్ డీల్ కుదుర్చుకోలేదు. అమెరికా సుంకాల కారణంగా కెనడా ఆటోమొబైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది.


ఇవి కూడా చదవండి:

పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి మౌనం.. మంత్రి జైశంకర్ విమర్శలు

పాక్‌కు భారత్ తరహాలో బుద్ధి చెప్పేందుకు సిద్ధమైన అఫ్ఘానిస్థాన్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 26 , 2025 | 08:37 AM