Vladimir Putin: అలస్కా ట్రిప్‌లో రష్యా అధ్యక్షుడు.. పుతిన్ సూట్‌కేసులో ఏమి ఉంటుందో తెలుసా..
ABN , Publish Date - Aug 18 , 2025 | 05:24 PM
పుతిన్ విదేశీ పర్యటనల్లో తన ఆరోగ్య పరిస్థితి బయట ప్రపంచానికి తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారని అడపాదడపా కథనాలు వస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అలాంటి కథనాలే వెలుగుచూశాయి.
అలస్కా: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) ఆరోగ్యంపై గత కొద్దికాలంగా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆయనకు ఆరోగ్యం సరిగాలేదని, పార్కిన్‌సన్ వ్యాధితో బాధపడుతున్నాడని, ముఖ్యంగా విదేశీ పర్యటనల్లో ఆయన ఆరోగ్య పరిస్థితి బయట ప్రపంచానికి తెలియకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారని అడపాదడపా కథనాలు వస్తుంటాయి. ఇప్పుడు మరోసారి అలాంటి కథనాలే వెలుగుచూశాయి. గత శుక్రవారంనాడు అలస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పుతిన్ సమావేశమయ్యారు. ఉక్రెయిన్ విషయంపై చర్చ జరిపారు. అలస్కా ట్రిప్‌లో పుతిన్ భద్రతా వివరాలు తాజాగా వెలుగుచూశాయి. ఈ ట్రిప్ కోసం పుతిన్ బాడీగార్డులు మలసేకరణ (Poop) సూట్‌కేసులు తీసుకువెళ్లారని సమాచారం. పుతిన్ మల, మూత్రాలు విసర్జిస్తే ప్రత్యేక బ్యాగుల్లో సేకరించి వాటిని సూట్‌కేసుల్లో పెట్టి రష్యాకు తీసుకెళ్తారని ఆ కథనాలు పేర్కొన్నాయి.
ఇదే విషయాన్ని 2022లో ఇద్దరు వెటరన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు రేజిస్ జెంటే, మిఖైల్ రూబిన్‌లు ఫ్రెంచ్ పబ్లికేషన్ పారిస్ మ్యాచ్‌లో రాశారు. రష్యా అధ్యక్షుడి విదేశీ ప్రయాణాల్లో ఫెడరల్ ప్రొటక్షన్ సర్వీస్ (ఎఫ్‌పీఎస్) ఆయన మల, మూత్రాలను సేకరిస్తుంటుందని అందులో పేర్కొన్నారు. కాగా, పుతిన్ అలస్కా టూర్‌లో పుతిన్ బాడీగార్డులు ఆయన వెన్నంటే ఉన్నారు. వీరిలో ఒకరు మల మూత్రాలు సేకరించి రష్యాకు తీసుకువెళ్లే ప్రత్యేక బాధ్యతను చూసుకుంటారు. పుతిన్ ఆరోగ్యంపై బయట ప్రపంచానికి ఏమాత్రం తెలియకుండా ఉండటానికే ఈ ఏర్పాటని చెబుతున్నారు. 2017 మేలో పుతిన్ ఫ్రాన్స్‌లో పర్యటన సమయంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ సమయంలో ఆయన పోర్టబుల్ టాయిలెట్ వాడినట్టు కథనాలు వచ్చాయి. రష్యా అధినేతగా 1999లో పుతిన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇలాంటి జాగ్రత్తలే ఆయన తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.
72 ఏళ్ల పుతిన్ ఆరోగ్యంపై ఇటీవల కాలంలో అనేక పుకార్లు షికార్లు చేశాయి. గత నవంబర్‌లో కజకిస్థాన్‌లో మీడియా సమావేశం జరిగినప్పుడు ఆయన కాళ్లు ఇబ్బందికరంగా కనిపించాయి. దీంతో ఆయన పార్కిన్‌సన్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం జరిగింది.
ఇవి కూడా చదవండి..
చైనాను వదిలిపెట్టి భారత్‌పై సుంకాలు.. ఇలా ఎందుకో చెప్పిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి
రష్యా విషయంలో కీలక పురోగతి.. ట్రంప్ వెల్లడి
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి