Share News

Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో మళ్లీ సంక్షోభం.. మహమ్మద్ యూనస్ రాజీనామా..!

ABN , Publish Date - May 23 , 2025 | 09:37 AM

తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో వీరిద్దరు మిత్రులుగానే ఉన్నారు.

Muhammad Yunus: బంగ్లాదేశ్‌లో మళ్లీ సంక్షోభం.. మహమ్మద్ యూనస్ రాజీనామా..!
Muhammad Yunus

ఢాకా, మే 23: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మమద్ యూనస్ తన పదవికి రాజీనామా చేస్తారనే చర్చ సాగుతోంది. దేశంలో తాజాగా రాజకీయ ఆస్థిర పరిస్థితుల నెలకున్నాయి. అలాంటి వేళ.. ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయం రావడంతో విఫలమవ్వడం వల్లే ఆయన ఈ నిర్ణయానికి వచ్చి ఉండవచ్చని స్థానిక మీడియా తన కథనంలో వెల్లడించింది.

స్పందించిన ఎన్‌సీపీ నేత..

ఈ అంశంపై నేషనల్ సిటిజన్ పార్టీ నాయకుడు నిద్ ఇస్లాం స్పందించారు. గురువారం ఉదయం నుంచి మహ్మమద్ యూనస్ రాజీనామా చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఆయనతో కలిసి మాట్లాడినట్లు చెప్పారు. రాజీనామా అంశంపై ఆలోచిస్తున్నట్లు ఆయన చెప్పారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొనసాగేలేనని ఆయన పేర్కొన్నట్లు తెలిపారు. గత రెండు రోజులుగా యూనస్ ప్రభుత్వం పలు సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. వాటిలో ఏకీకృత మిలటరీ దళాలు అంశం ఒకటి అని వివరించారు. గతేడాది దేశంలో విద్యార్థుల తిరుగుబాటులో ఇవి కీలక భూమిక పోషించాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే దేశ భద్రత దృష్ట్యా కొనసాగాలని తాను కోరానని.. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారన్నారు.


ఇద్దరి మధ్య పెరిగిన దూరం..

మరోవైపు తాత్కాలిక ప్రభుత్వ అధినేత యూనస్, ఆర్మీ చీఫ్‌ జనరల్‌ వకారుజ్జమాన్‌ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో మొదట్లో వీరిద్దరు మిత్రులుగానే ఉన్నారు. కానీ ఎన్నికల నిర్వహణ, సైనిక జోక్యం, యూనస్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాల కారణంగా ఇద్దరి మధ్య బాగా దూరం పెరిగినట్లు తెలుస్తోంది.


గతేడాది ఆగస్టులో విద్యార్థు నిరసనల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. అనంతరం జరిగిన చర్చల్లో రిజర్వేషన్లలో సంస్కరణలు చేపడతామని.. అలాగే త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీ ఇవ్వడం ద్వారా మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించారు. దీంతో యూనస్‌కు ఆర్మీ చీఫ్ జనరల్ వకారుజ్జమాన్ మద్దతు సైతం తెలిపారు. కానీ బాధ్యతలు చేపట్టిన తర్వాత యూనస్.. గతంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టడంతో వీరి మధ్య దూరం పెరిగినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇస్లామిస్ట్ నాయకులతోపాటు, బంగ్లాదేశ్ రైఫిల్స్ తిరుగుబాటుదారులను జైలు నుంచి విడుదల చేయడంలో యూనస్ కీలకంగా వ్యవహరించారు. ఈ అంశం ఆర్మీ చీఫ్‌ను తీవ్ర కలవరపాటుకు గురి చేసిందని తెలుస్తోంది. దీంతో యూనస్‌తో ఆయన అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని సమాచారం.


గతేడాది బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళనకు పిలుపు నిచ్చారు. ఈ ఆందోళనకు ప్రజలు సైతం మద్దతు తెలిపారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు ప్రారంభమైనాయి. ఆ క్రమంలో అధికార పార్టీ వర్గాలకు, ఆందోళనకారుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో దాదాపు వంద మంది పౌరులతోపాటు పలువురు పోలీసులు సైతం మరణించారు.

దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఆ కొద్ది రోజులకే మళ్లీ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా డిమాండ్ చేస్తూ.. ఆందోళనలు మొదలయ్యాయి. ఇవి ఉద్రిక్తంగా మారడంతో.. ప్రధాన మంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం సైనిక రక్షణతో ఆమె భారత్‌కు చేరుకున్నారు. నాటి నుంచి ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌పై పాక్ మిలటరీ అధికారి సంచలన వ్యాఖ్యలు

స్కామ్‌లు బయటపడేకొద్దీ జగన్‌లో భయం

For International News And Telugu News

Updated Date - May 23 , 2025 | 10:12 AM