Share News

Bangladesh: దిగొచ్చిన యూనస్ సర్కార్.. దీపూదాస్ హంతకులపై చర్యలకు హామీ

ABN , Publish Date - Dec 24 , 2025 | 11:16 AM

బంగ్లాదేశ్ సమాజంలో హింసకు తావులేని, దీపూదాస్ హత్యా ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని మీడియాతో మాట్లాడుతూ అబ్రార్ తెలిపారు. ఆరోపణలు, వదంతులు, భిన్నమైన విశ్వాసాలు హింసకు కారణం కారాదని అన్నారు.

Bangladesh: దిగొచ్చిన యూనస్ సర్కార్.. దీపూదాస్ హంతకులపై చర్యలకు హామీ
Dipu Chandra Das family

ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ (Dipu Chandra Das)పై మూకదాడి చేసి పాశవికంగా హత్య చేసిన ఘటనను ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వం ఖండించింది. ఈ పాశవిక హత్యకు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని, ఇందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేస్తుందని మీ ఇచ్చింది. దీపూదాస్ కుటుంబ సభ్యులను విద్యాశాఖ సలహాదారు సీఆర్ అబ్రార్ కలుసుకుని ప్రభుత్వం తరఫున సంతాపం తెలియజేశారు.


బంగ్లాదేశ్ సమాజంలో హింసకు తావులేని, దీపూదాస్ హత్యా ఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని మీడియాతో మాట్లాడుతూ అబ్రార్ తెలిపారు. ఆరోపణలు, వదంతులు, భిన్నమైన విశ్వాసాలు హింసకు కారణం కారాదని అన్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని చెప్పారు. చట్టాన్ని పరిరక్షించేందుకు తాత్కాలిక ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేరాలన్నింటి పైనా సమగ్ర దర్యాప్తు జరిపించి న్యాయం జరిపిస్తామని హామీ ఇచ్చారు.


దైవదూషణకు పాల్పడ్డాడనే ఆరోపణతో దీపూ చంద్ర దాస్‌పై కొందరు ఛాందసవాదులు గత వారంలో మూకదాడి చేసి, చెట్టుకు ఉరివేసి చంపారు. అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై విసిరేసి పెట్రోలుతో తగులబెట్టారు. ఈ అమానుష ఘటనపై అటు బంగ్లాలోనూ, ఇటు భారత్‌లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, హైదరాబాద్, మధ్యప్రదేశ్, అగర్తలా సహా పలు ప్రాంతాల్లో హిందూ సంస్థలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. బంగ్లాలో షేక్ హసీనా ప్రభుత్వం గత ఏడాది కుప్పకూలడానికి దారితీసిన విద్యార్థి ఉద్యమానికి నాయకుడైన షరీఫ్ ఒస్మాన్ బిన్ హాదీపై డిసెంబర్ 12 కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హాదీ సింగపూర్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికింది. ఈ క్రమంలోనే హిందూ యువకుడు దీపూదాస్‌ పాశవిక హత్య మరింత ఉద్రిక్తతలకు దారితీసింది.


ఇవి కూడా చదవండి..

బంగ్లాదేశ్‌లో మూకదాడిపై భారత్‌లో ఆగ్రహ జ్వాల

బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో యువనేతపై కాల్పులు

Updated Date - Dec 24 , 2025 | 11:16 AM