Share News

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో యువనేతపై కాల్పులు

ABN , Publish Date - Dec 22 , 2025 | 04:20 PM

హాదీ హంతకులు భారత్‌కు పారిపోయారని, తక్షణం వారిని అరెస్టు చేయాలని ఆందోళనకారులు హింసాకాండకు దిగారు. అయితే హాదీ హంతకుల గురించి సరైన ఆచూకీ లేదని బంగ్లా పోలీసులు చెబుతున్నారు.

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో ఆగని హింస.. మరో యువనేతపై కాల్పులు
Bangladesh Violence

ఢాకా: బంగ్లాదేశ్ హింసాకాండతో అట్టుడుకుతోంది. భారత్ అంటే విద్వేషం కలిగిన ఇంకిలాబ్ మోంచో విద్యార్థి నేత షరీప్ ఉస్మాన్ హాదీ ఇటీవల కాల్పుల్లో మరణించిన అనంతరం తలెత్తిన ఆందోళనలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరో యువనేతపై సోమవారంనాడు కాల్పులు జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో అతని తల ఎడమ వైపు తుపాకీ తూటా దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ ఖుల్నా డివిజన్ చీఫ్ మొతలేబ్ సిక్దార్ (Motaleb Sikdar)గా అతనిని గుర్తించారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రస్తుతం చికిత్స జరుగుతోంది.


బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వం గత ఏడాది కూలిపోవడానికి దారితీసిన విద్యార్థి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన హాదీపై ఇటీవల ఢాకాలో కాల్పులు జరిగాయి. 2026 ఫిబ్రవరి 12న జరుగనున్న పార్లమెంటరీ ఎన్నికల కోసం ప్రచారం జరుపుతుండగా జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హాదీని సింగపూర్ తరలించారు. అయితే చికిత్స పొందుతూ గత వారంలో అతను కన్నుమూయడం బంగ్లాలో తీవ్ర ఆందోళనలకు దారితీసింది. హాదీ హంతకులు భారత్‌కు పారిపోయారని, తక్షణం వారిని అరెస్టు చేయాలని ఆందోళనకారులు హింసాకాండకు దిగారు. అయితే హాదీ హంతకుల గురించి సరైన ఆచూకీ లేదని బంగ్లా పోలీసులు చెబుతున్నారు. గత శనివారంనాడు జరిగిన హాదీ అంత్యక్రియల్లో బంగ్లా చీఫ్ అడ్వయిజర్ మహమ్మద్ యూనుస్ హాజరయ్యారు. హాదీ హంతకులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బంగ్లాదేశ్ ఉన్నంతవరకూ హాదీని ప్రజలు మరచిపోరని ఆయన వ్యాఖ్యానించారు.


ఇవి కూడా చదవండి..

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

ఆగని హింస, బీఎన్‌పీ నేత ఇంటికి నిప్పు.. ఏడేళ్ల కుమార్తె సజీవదహనం

Updated Date - Dec 22 , 2025 | 04:28 PM