Bangladesh Communal Violence: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 02:12 PM
బంగ్లాదేశ్‌లో మతోన్మాదానికి బలయిన హిందూ యువకుడి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం ఇదంతా జరిగిందని, అతడిపై దాడి చేసిన మతోన్మాద మూకల్లో అతడి సహోద్యోగులు కూడా ఉన్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో మతోన్మాదానికి బలయిన హిందూ యువకుడు దీపూ చంద్ర దాస్ ఉదంతంలో తాజాగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్లాన్ ప్రకారం, అతడి హత్య జరిగినట్టు తెలుస్తొంది. మైమెన్‌సింగ్ జిల్లాలోని ఓ దుస్తుల ఫ్యాక్టరీలో పని చేస్తున్న దీపు చంద్ర దాస్ (27)పై కొందరు దైవ దూషణ ఆరోపణలు మోపి గురువారం దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. మతోన్మాద మూకలు దాడి చేసి అతడిని పొట్టనపెట్టుకున్నాయి. అనంతరం మృతదేహానికి నిప్పు పెట్టాయి (Bangladesh Communal Violence Incident).
జాతీయ మీడియా కథనాల ప్రకారం, పక్కా ప్లానింగ్‌తో ఈ దారుణం జరిగినట్టు తెలుస్తోంది. దాడికి కొన్ని గంటల ముందు ఫ్యాక్టరీలోని సూపర్‌వైజర్లు దీపూతో బలవంతంగా ఉద్యోగానికి రాజీనామా చేయించారు. ఆ తరువాత ఫ్యాక్టరీ నుంచి బయటకు పంపి అల్లరి మూకలకు అప్పగించారు. దుస్తుల ఫ్యాక్టరీలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు కూడా ఈ దాడిలో పాలుపంచుకున్నట్టు బంగ్లాదేశ్ రాపిడ్ యాక్షన్ బెటాలియన్, పోలీసు అధికారులు చెబుతున్నారు. పోలీసులకు సకాలంలో సమాచారం అందించి ఉంటే అతడు బతికి ఉండేవాడని కూడా చెబుతున్నారు. ఇక, దీపూ దైవ దూషణకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకూ సుమారు 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో దుస్తుల ఫ్యాక్టరీ అధికారులు, వర్కర్లు కూడా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
దీపూ హత్య అకస్మాత్తుగా జరిగినది కాదని కూడా అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు కొన్ని గంటల ముందే ప్లానింగ్ జరిగి ఉంటుందని చెబుతున్నారు. దీపూతో బలవంతంగా రాజీనామా చేయించడం, పోలీసులకు సమాచారం ఇవ్వడంలో జాప్యం జరగడం, బాధితుడిని అల్లరి మూకలకు అప్పగించడం వంటి వన్నీ ఘటనకు ముందు జరిగిన ప్లానింగ్‌ను సూచిస్తున్నాయని అన్నారు.
మరోవైపు, ఈ ఉదంతంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ దారుణంలో పోలీసులు పాత్ర కూడా ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందా అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. దీపూకు మూడు ఏళ్ల క్రితం వివాహమైంది.
ఇవీ చదవండి:
వీసా ఫీజు పెంపు.. కాలిఫోర్నియాలో బెంబేలెత్తిస్తున్న టీచర్ల కొరత
కెనడా జనాభాలో తగ్గుదల.. 1946 తరువాత తొలిసారిగా..