Share News

Bangladesh violence: బంగ్లాదేశ్‌లో మూకదాడిపై భారత్‌లో ఆగ్రహ జ్వాల

ABN , Publish Date - Dec 24 , 2025 | 04:15 AM

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌పై మూకదాడి చేసి చంపి, కాల్చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా ఢిల్లీ, కోల్‌కతాల్లో నిరసనలు భగ్గుమన్నాయి....

Bangladesh violence: బంగ్లాదేశ్‌లో మూకదాడిపై భారత్‌లో ఆగ్రహ జ్వాల

  • ఢిల్లీలో ఆ దేశ ఎంబసీ వద్ద వీహెచ్‌పీ, బజ్‌రంగ్‌దళ్‌ నిరసన

  • కోల్‌కతాలో బంగ్లాదేశ్‌ డిప్యూటీ హై కమిషన్‌ ముట్టడి ఉద్రిక్తం

న్యూఢిల్లీ, ఢాకా, వాషింగ్టన్‌, డిసెంబరు 23: బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌పై మూకదాడి చేసి చంపి, కాల్చేసిన దుర్మార్గానికి వ్యతిరేకంగా ఢిల్లీ, కోల్‌కతాల్లో నిరసనలు భగ్గుమన్నాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని బంగ్లాదేశ్‌ రాయబార కార్యాలయం వద్ద వీహెచ్‌పీ, బజ్‌రంగ్‌దళ్‌ తదితర సంస్థలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. వందలాది మంది కాషాయ జెండాలు చేతబూని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ పాల్గొన్నారు. అనేక మంది బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి, ఢిల్లీలో ఉంటున్నారని, వారిలో ఒక్కరిపైనా దాడి జరగలేదని, కానీ, బంగ్లాదేశ్‌లో మాత్రం హిందువులపై మూకదాడులు జరుగుతున్నాయని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి, దోషులను శిక్షించాలని, ఈ తరహా ఘటనలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఎంబసీ ఆవరణలోకి నిరసనకారులు ప్రవేశించకుండా పోలీసు అధికారులు 1500 మంది పోలీసులను మోహరించారు. ఏడు వరుసల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ రవాణా సంస్థకు చెందిన బస్సులను కూడా అడ్డంగా పెట్టి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా, పోలీసులతో నిరసనకారులు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను పక్కకు నెట్టివేశారు. బంగ్లాదేశ్‌లో హిందువుల రక్షణ కోసం అక్కడి ప్రభుత్వం చర్యలు చేపట్టే వరకూ తమ నిరసనలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో కూడా నిరసనలు మిన్నంటాయి. స్థానికంగా ఉన్న బంగ్లాదేశ్‌ డిప్యూటీ హై కమిషన్‌ ఆఫీసు ముట్టడికి బీజేపీ, హిందూ సంఘాల నేతలు, కార్యకర్తలు యత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవటంతో తోపులాట జరిగి.. పలువురు నిరసనకారులు, పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. 12మంది ఆందోళనకారుల్ని పోలీసులు అరెస్టు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడి హత్య ప్రకంపనలు అమెరికానూ తాకాయి. భారత మూలాలున్న అమెరికా చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, న్యూయార్క్‌ రాష్ట్ర అసెంబ్లీ సభ్యురాలు జెనిఫర్‌ రాజ్‌కుమార్‌ ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని, దేశంలోని హిందువులు, బౌద్ధులు తదితర మైనారిటీలకు రక్షణ కల్పించాలని వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశారు.

భారత రాయబారికి బంగ్లాదేశ్‌ సమన్లు

భారత్‌లో పలు ప్రాంతాల్లోని తమ దౌత్య కార్యాలయాల వద్ద హింసాత్మక నిరసనలు, ఘటనలు జరుగుతున్నాయని.. ఇవి తమ సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే ప్రమాదం ఉందని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం భారత రాయబారి ప్రణయ్‌ వర్మకు బంగ్లాదేశ్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ సమన్లు జారీ చేసింది. ఈ మేరకు ఆయన విదేశాంగ కార్యదర్శి ఎదుట హాజరయ్యారు. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో, 22న సిలిగురిలో జరిగిన ఘటనల్ని ఉదహరిస్తూ తమ ఆందోళనను విదేశాంగ కార్యదర్శి ప్రణయ్‌వర్మకు తెలిపారు.

Updated Date - Dec 24 , 2025 | 04:15 AM