Share News

Dhaka Shooting Incident: షేక్ హసీనా ప్రత్యర్థిపై కాల్పులు.. తలలోకి తూటా!

ABN , Publish Date - Dec 13 , 2025 | 07:47 PM

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజకీయ ప్రత్యర్థి ఉస్మాన్ హడీపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. రాజధాని ఢాకాలో ఈ దారుణం జరిగింది. బాధితుడి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.

Dhaka Shooting Incident: షేక్ హసీనా ప్రత్యర్థిపై కాల్పులు.. తలలోకి తూటా!
Dhaka Shooting Incicent

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రత్యర్థి ఉస్మాన్ హడీపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. శుక్రవారం బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఈ దారుణం జరిగింది (Dhaka Shooting Incident).

బంగ్లాదేశ్‌లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో షేక్ హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీ ప్రత్యర్థి, ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హడీ బిజయ్‌నగర్ ప్రాంతంలో ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపి పారిపోయారు. తలలోకి తూటా దూసుకుపోవడంతో తీవ్రగాయాల పాలైన హడీని వెంటనే ఢాకా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి డైరెక్టర్ తెలిపారు. అతడి తలలోని బుల్లెట్‌ను ఇంకా తొలగించాల్సి ఉందని అన్నారు.


షేక్ హసీనా పార్టీని పూర్తిగా తొలగించాలంటూ హడీ ఉద్యమిస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ యూనస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ ఇలాంటి ఘటనలు అసలేమాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని అధికారులను ఆదేశించారు. వేగంగా దర్యాప్తు చేసి నిందితులందరినీ పట్టుకోవాలని పోలీసులకు తేల్చి చెప్పారు.

గతేడాది జులై, ఆగస్టు నెలల్లో విద్యార్థుల ఆధ్వర్యంలో నిరసన వెల్లువ తరువాత ప్రధాని షేక్ హసీనా సారథ్యంలోని ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇంక్విలాబ్ మంచ్ ఏర్పాటయ్యింది. సంప్రదాయవాద పార్టీగా పేరున్న ఇంక్విలాబ్ మంచ్.. ఆవామీ లీగ్‌కు దేశంలో ఉనికే లేకుండా చేయాలని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఆపద్ధర్మ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఈ దిశగా ఇప్పటికే యూనస్ సారథ్యంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం ఆవామీ లీగ్‌ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధాజ్ఞలు జారీ చేసింది.


ఇవీ చదవండి:

50 శాతం సుంకాల విధింపు.. మెక్సికోతో చర్చలు జరుపుతున్నామన్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు

కెనడాకు ఫారిన్ స్టూడెంట్‌ల రాకలో 60 శాతం కోత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 13 , 2025 | 07:58 PM