Earthquake In Afghanistan: మళ్లీ భూకంపం.. 1400 మందికి పైగా మృతి
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:51 PM
కొన్ని గంటల వ్యవధిలోనే ఆఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం దాటికి 1400 మందికి పైగా మరణించారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 02: ఆఫ్ఘానిస్థాన్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. దీంతో 1400 మందికి పైగా మరణించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మంగళవారం సంభవించిన ఈ భూకంప తీవ్రత 5.2 గా నమోదు అయిందని పేర్కొంది. భూకంప కేంద్రాన్ని సైతం గుర్తించినట్లు తెలిపింది. నంగర్హర్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో 34 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని వివరించింది.
పాకిస్థాన్ సరిహద్దులకు సమీపంలోని మారుమూల పర్వత ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి 6.0 తీవ్రతతో భూకంప సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 800 మందికి పైగా మరణించారు. ఈ భూకంపం ఘటన చోటు చేసుకున్న కేవలం రెండు రోజులకే మళ్లీ తాజాగా భూకంపం సంభవించింది. అయితే మంగళవారం సంభవించిన భూకంపం అనంతరం వరుసగా ఐదు ప్రకంపనలు సంభవించాయి. దీంతో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే వేలాది మంది గాయపడ్డారు. ఆస్తి నష్టం సైతం భారీగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆఫ్ఘానిస్థాన్.. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలలో ఒకటి. అలాంటి ఆ దేశాన్ని 2021లో తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ దేశానికి అంతర్జాతీయ సహాయం అందడం క్రమంగా తగ్గిపోయింది. అంతేకాకుండా.. ఆ దేశాన్ని ప్రకృతి విపత్తులు సైతం చుట్టుముడుతున్నాయి.
మంగళవారం సంభవించిన భూకంపంపై తాలిబన్ల ప్రధాన ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ.. కునార్ ప్రావిన్స్ ఒక్క ప్రాంతంలోనే 1,411 మంది మరణించారని తెలిపారు. అలాగే దాదాపు 3 వేలకుపైగా ప్రజలు గాయపడ్డారని వివరించారు. ఇక పొరుగునున్న నంగర్హర్‌లో మృతులతోపాటు గాయపడిన వారు సంఖ్య భారీగా ఉంటుందన్నారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చంద్రబాబు ది గ్రేట్.. సీబీఎన్ కు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న అభినందనలు
250 కోట్ల మంది అకౌంట్లు ప్రమాదంలో.. జీమెయిల్ యూజర్లకు గూగుల్ హెచ్చరిక..
For More International News And Telugu News