Donald Trump: తొలి ప్రసంగంలోనే తానేం చేయబోయేది చెప్పిన ట్రంప్!
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:05 AM
ఈసారి తాను ఏం చేయబోయేదీ ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే పూర్తిస్థాయి క్లారిటీ ఇచ్చేశారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ట్రంప్ తొలి రోజున మొత్తం పది ముఖ్యఅంశాలపై ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ జారీ చేసే అవకాశం
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన తొలి ప్రసంగంలోనే తానేం చేయబోయేది స్పష్టంగా చేప్పేశారు. అమెరికాలో స్వర్ణ యుగం మొదలైందని ఘనంగా ప్రకటించారు. వలసలు, సరిహద్దు భద్రత, పౌరసత్వం తదితర అంశాల్లో తన వైఖరిపై క్లారిటీ ఇచ్చేశారు. అమెరికా మీడియా ప్రకారం ట్రంప్ తొలి రోజున పది ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ (ఆదేశాలు) జారీ చేయనున్నారు (Donald Trump).
ట్రంప్‌పై తొలిగా దృష్టిపెట్టే అంశాలు ఇవే..
అమెరికా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దేశంలోని అక్రమవలసదారులను వారి సొంత దేశాలను తరలిస్తామని స్పష్టం చేశారు. అమెరికా-మెక్సికో సరిహద్దు వెంబడి గోడ నిర్మాణాన్ని వేగవంతం చేసేలా ఆదేశాలు జారీ చేస్తారు. అంతేకాకుండా, ఈ సరిహద్దు మీదుగా అక్రమంగా ప్రవేశించే వారిని శరణార్థులుగా గుర్తించే విధానానికి కూడా ముగింపు పలికే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అమెరికా ప్రజల ఇంధన ధరలు అందుబాటులో ఉండేలా.. దేశీయంగా చమురు ఉత్పత్తి పెంచేందుకు ట్రంప్ తక్షణం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. ఈ దిశగా అలాస్కా ప్రాంతంపై ట్రంప్ దృష్టిసారించనున్నారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్
చైనా, కెనడా, మెక్సికోతో వాణిజ్యంపై ట్రంప్ దృష్టిసారిస్తారు. ఆయా దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలోనే హెచ్చరించారు. ఇప్పటికిప్పుడు ఈ సుంకాలు పెంచే అవకాశం తక్కువే అయినా పరిస్థితిపై వాణిజ్య అధికారులు దృష్టి సారించేలా ట్రంప్ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
ట్రాన్స్ జెండర్ హక్కులకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఊహించని ప్రకటన చేశారు. ఇకపై దేశంలో స్త్రీలు, పురుషులు అనే రెండు జెండర్స్ మాత్రమే ఉంటాయని అన్నారు. ట్రాన్స్ జెండర్ వ్యక్తులు మిలిటరీలో చేరకుండా నిషేధం విధించేందుకు కూడా ట్రంప్ ప్రయత్నించొచ్చనే వార్తలు వస్తున్నాయి
2021 నాటి క్యాపిటల్ దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి క్షమాభిక్ష ప్రసాదించే అవకాశం ఉంది.
ఇక బైడెన్ హయాంలో ప్రవేశపెట్టిన హార్మోన్ థెరపీ, సర్జరీ వంటి జెండర్ రీఎఫర్మింగ్ విధానాలను కూడా తిరగదోడే అవకాశం కనిపిస్తోందని అమెరికా మీడియా పేర్కొంది.
మాదకద్రవ్యాల ముఠాలపై కూడా ట్రంప్ ఉక్కుపాదం మోపుతారు. ముఖ్యంగా ఈ ముఠాలను విదేశీ ఉగ్రవాద సంస్థలు గుర్తించేలా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
అమెరికా ప్రభుత్వ ఉద్యోగుల వర్క్ ఫ్రం హోం విధానానికి కూడా ట్రంప్ ముగింపు పలికే అవకాశం ఉంది. కార్యాలయాలకు రాని వారిని తక్షణం తొలగిస్తామని కూడా ట్రంప్ గతంలోనే ప్రకటించారు.
Read Latest and Internationl News