ఈ ఆకుల్ని తెగ తింటున్నారు..
ABN , Publish Date - May 25 , 2025 | 08:11 AM
కూరగాయల కోసం సూపర్‌మార్కెట్లకు వెళ్లేవారి దృష్టి ఎప్పుడో ఓసారి లెట్యూస్ మీద పడే ఉంటుంది. ఏదో కొత్త రకం ఆకుకూర అని దాటేయకుండా కొని, రుచిచూడడానికి ప్రయత్నించండి. సలాడ్లలో కరకర లాడే ఆ ఆకుకూరకు మీరు ఫిదా అయిపోతారు. పోషకాల గనిగా పేరుతెచ్చుకున్న లెట్యూస్ నగరవాసుల సలాడ్లలో విరివిగా కనిపిస్తోంది...

ఎండలకు బాగా అలసిపోతున్నారా? చల్లని మంచి నీళ్లు తాగుతూనే ఉండాలని అనిపిస్తోందా? సలాడ్ రూపంలో కొన్ని లెట్యూస్ ఆకుల్ని తీసుకోండి. శరీరానికి ఉపశమనం లభిస్తుంది. ఎందుకంటే ఈ ఆకుల్లో 95 శాతం నీళ్లే మరి. అందుకే సలాడ్లు, బర్గర్లలో లెట్యూస్ బాగా పాపులర్.
ఉడికించిన లెట్యూస్‌పై కాస్త వెనిగర్, నూనె వేసుకుని అప్పట్లోనే రోమన్లు తినేవారట. సలాడ్‌ల రూపంలో లెట్యూస్‌ను ఆరగించడం క్రీశ 81లో మొదలైంది. ప్రస్తుతం లెట్యూస్‌ను ఉత్పత్తి చేస్తున్న దేశాల లిస్టులో మొదటి స్థానం చైనాది. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో మనదేశం ఉన్నాయి. విత్తనాలు, కాండం, ఆకుల కోసం లెట్యూస్‌ను పండిస్తున్నారు. ఈ ఆకుకూర సుగుణాల గురించి ఇప్పుడిప్పుడే మన దగ్గర అవగాహన పెరుగుతోంది.
అయిదు రకాలు
చూడడానికి ఒకేలా కనిపించినా లెట్యూస్‌లో ఎన్నో రకాలు. రంగు, రుచి, పోషక విలువల్లో ఉన్న తేడాల కారణంగా ప్రధానంగా వీటిని అయిదు రకాలుగా విభజించవచ్చు.
- రొమీన్: ప్రపంచవ్యాప్తంగా అందరూ ఇష్టపడే రకం. ఆకులు కాస్త వగరుగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, కె, ఫోలేట్, పొటాషియం పాళ్లు ఈ రకంలో ఎక్కువ. సలాడ్స్, రాప్స్, గ్రిల్స్‌లో ఎక్కువగా వినియోగించే రకం ఇదే.
- ఐస్‌బర్గ్: ఎక్కువగా కరకరలాడుతూ ఉంటుంది. రుచి మధ్యస్తం. శాండ్విచ్, బర్గర్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పోషక విలువలు తక్కువ. విటమిన్ కె, ఫోలేట్ తక్కువ శాతంలో ఉంటాయి. అయితే నీటి శాతం ఎక్కువ. కాబట్టి ఎండాకాలంలో హైడ్రేటింగ్ ఏజెంట్‌గా భావించవచ్చు.
- బటర్ హెడ్: ఆకులు మృదువుగా, లేతగా ఉంటాయి. కొద్దిగా తియ్యని ఫ్లేవర్ మిళితమైన ఫీలింగ్ కలుగుతుంది. విటమిన్ ఎ, క్యాల్షియం, ఐరన్ పాళ్లు ఇందులో ఎక్కువ.
- లీఫ్: ఆకుపచ్చ, ఎరుపు రంగులో ఉంటుంది. ఆకులు లేతగా ఉంటాయి. రుచి సాధారణం. విటమిన్ ఎ, కెతో పాటు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ అధికం.
- బతావియా: నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్ల పాళ్లు ఎక్కువ.
వివిధ ప్రాంతాలలో వివిధ రకాలైన లెట్యూస్‌ను సాగు చేస్తున్నారు. ఈజిప్టు, చైనాలో స్టెమ్ లెట్యూస్ ఉత్పత్తి ఎక్కువ. మధ్యధరా ప్రాంతంలో రొమీన్ ప్రసిద్ధి. ఉత్తర యూరప్‌లో బటర్‌హెడ్ బాగా పండుతోంది.
కొన్ని వేల ఏళ్ల నుంచి లెట్యూస్‌ను పండిస్తున్నారు కానీ ఈమధ్యే బాగా పాపులర్ అయింది. కారణం ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధ లెట్యూస్‌ను విరివిగా ఉపయోగించేలా చేస్తోంది. ఈ ఆకుకూరలోని పోషకాలు, ప్రయోజనాల గురించి చెప్పాలంటే...
క్యాన్సర్ నివారణ: లెట్యూస్‌లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ. విటమిన్ సి, కెరోటినాయిడ్స్, ఫోలేట్స్, క్లోరోఫిల్ తదితరాలు ఉండడం వల్ల క్యాన్సర్‌లాంటి వ్యాధులు రాకుండా లెట్యూస్ నివారిస్తుంది.
మలబద్ధకం హుష్‌కాకి: ఈ ఆకుకూరలో ఉన్నదంతా నీళ్లు, పీచు పదార్థాలే. అందుకే సాఫీగా అరగేందుకు సహాయపడుతుంది.
ప్రశాంతత: ఆందోళన, ఒత్తిడితో సతమతమవుతున్న వాళ్లకు చక్కని ఉపశమనంగా లెట్యూస్‌ను పేర్కొనవచ్చు. ఈ ఆకులకు చక్కని నిద్రను కలిగించే గుణం ఉంది. నిద్రలేమికి పరిష్కారంగా కూడా కొన్ని ప్రాచీన వైద్యాలు ఉపయోగించాయి.
రక్తహీనతకు చెక్: ఇందులో ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఎక్కువగా ఉంటయి కాబట్టి రక్తహీనతకి చక్కని మందు లెట్యూస్. అయితే ఇందులోని ఐరన్‌ను శరీరం చక్కగా సంగ్రహించాలంటే మాత్రం విటమిన్ సి అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది.
ఎముకల ఆరోగ్యం: క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లాంటి ఖనిజాలు లెట్యూస్‌లో ఎక్కువ. కాబట్టి ఈ ఆకుకూరలు ఆరగించడం వల్ల ఎముకలు పుష్టిగా ఉంటాయి.
వయసు తెలియనీయదు: ఇందులోని విటమిన్ ఎ, ఈ లు సూర్యుడి అలా్ట్రవయొలెట్ కిరణాల నుంచి సంరక్షిస్తాయి. అలాగే లెట్యూస్‌లోని విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా చర్మంపై ముడతలు పడకుండా కాపాడుతుంది.
చక్కని కంటిచూపునకు: విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వల్ల కంటిచూపునకు రక్షగా నిలుస్తుంది. వయసు పరంగా వచ్చే ఛత్వారాన్నీ నివారిస్తుంది.
చక్కెరవ్యాధిపై దాడి: ఈ ఆకులో పీచుపదార్థాలు ఎక్కువ. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. చక్కెర వ్యాధిగ్రస్తులకు, ప్రీడయాబెటిక్ వారికీ లెట్యూస్ పెద్ద సహాయకారి.
బరువు తగ్గొచ్చు: బరువు తగ్గించే ప్రయత్నాల్లో ఉన్న వారికీ లెట్యూస్ చక్కని పరిష్కారం. వీటిని కాస్త తినగానే కడుపు నిండిపోతుంది. పైగా ఇందులో నీళ్లు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. అందుకే ఫిట్‌నెస్ ప్రియులు వీటిని బాగా ఇష్టపడుతున్నారు.
అయితే ఎన్నో సుగుణాలు ఉన్నాయని లెట్యూస్‌ను అతిగా తీసుకోవడం మంచిది కాదంటున్నారు ఆహార నిపుణులు. ఈ ఫుడ్ బ్యాలెన్స్‌డ్ డైట్‌లో భాగంగా మాత్రమే అన్నది గుర్తుంచుకోవాలి. అప్పుడే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఆశించిన ఫలితాలు అందుతాయి. ఆరోగ్యం ఆకుపచ్చని లెట్యూస్‌లా కళకళలాడుతుంది.
స్మూతీలు, సూప్‌లు
లెట్యూస్‌ను వంటకాల్లో ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం.
సలాడ్స్ : పళ్లు, కూరగాయలు, నట్స్‌తో లెట్యూస్‌ను కలిపి అద్భుతమైన సలాడ్ తయారుచేయవచ్చు.
రాప్స్: ఉరుకుల పరుగుల నేటి జీవనంలో ఆహార రాప్స్ పెద్ద రిలీఫ్. శాండ్విచ్, టాకోస్, బర్గర్లలో పెద్ద పెద్ద ఆకుల లెట్యూస్‌ను వాడతారు.
స్మూతీలు : తాజా పళ్లు, యోగర్ట్, కాస్త తేనెతో పాటు లెట్యూస్ ఆకుల్ని చేర్చి బ్లెండ్ చేసిన స్మూతీలు ఎంతో ఆరోగ్యకరం.
సూప్‌లు: ఇంట్లో తయారుచేసుకునే వెజిటబుల్ సూప్‌లలో ఇకపై లెట్యూస్ ఆకుల్ని కూడా చేర్చితే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.
ఔషధపరంగా...
సంప్రదాయ, హెర్బల్ ఔషధాల తయారీలో లెట్యూస్‌ను అనాదిగా అనేక దేశాలలో వినియోగిస్తున్నారు. ప్రాచీన ఈజిప్టు, రోమ్‌లో లెట్యూస్ ఆకుల్ని తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని భావించేవారు. దక్షిణ అమెరికాలో స్మాల్ పాక్స్ నివారణలో లెట్యూస్ ఉపయోగించేవారు. వాస్తవానికి ప్రాచీన ఈజిప్టువాసులే తొలిగా లెట్యూస్‌ను పండించడం ప్రారంభించారు. అక్కడి నుంచే గ్రీస్, రోమ్‌లకు వెళ్లి, యూరప్ అంతా విస్తరించింది. యూరోపియన్ వలసదారుల వల్ల మిగతా ప్రపంచానికి పరిచయమైంది.
రెండూ ఒకటి కాదు
క్యాబేజీ, లెట్యూస్... రెండూ ఒకేలా కనిపిస్తున్నా, వీటి మధ్య ఎంతో తేడా ఉంది. రెండూ వేర్వేరు కుటుంబాలకు చెందిన ఆకు కూరలు. క్యాబేజీ గుండ్రంగా, లెట్యూస్ దీర్ఘచతురస్రాకారంగా ఉంటాయి. క్యాబేజీకి చిన్న కాండం, ఆకులు దళసరిగా, ఎంతో దగ్గరిదగ్గరిగా చుట్టుకుని ఉంటాయి. లెట్యూస్ ఆకులు మృదువుగా, కాడ నుంచి సులభంగా తొలగించవచ్చు. ఇంకా లెట్యూస్‌లో క్లోరోఫిల్ శాతం ఎక్కువ. అందుకే గాఢ ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి.
భార్య సీమంతంలో భర్తకు గుండెపోటు.. మృతి
Hyderabad Metro: పార్ట్-బీ మెట్రోకు డీపీఆర్ సిద్ధం
Read Latest Telangana News and National News