Waking Up at 2AM: రాత్రుళ్లు సరిగా నిద్రపట్టట్లేదా.. అర్ధరాత్రి రెండింటికి మెళకవ వస్తోందా.. ఈ డాక్టర్ ఏం చెబుతున్నారంటే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 08:21 PM
ప్రతి రోజూ అర్ధరాత్రి 2 లేదా మూడు గంటలకు మెళకువ వస్తోందా? దీని కారణం అధిక ఒత్తిడి కారణమని డా. ఎరిక్ తెలిపారు. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు వచ్చి నిద్ర చెడిపోతుందని వివరించారు.

ఇంటర్నెట్ డెస్క్: నేటి ఆధునిక జమానాలో యువతకు, ఉద్యోగస్థులు రాత్రి పగలకు తేడా లేకుండా గడిపేస్తున్నారు. మెళకువగా ఉంటే పని చేసుకోవడం.. నిద్ర వచ్చినప్పుడు కునుకు తీయడం.. ఇలా కాలాన్ని వెళ్లబుచ్చుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగబాధ్యతలు క్షణం తీరిక కూడా లేకుండా చేసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక మందికి రాత్రిళ్లు కలత నిద్ర సర్వసాధారణంగా మారిపోయింది. కొందరికి ఠంచనుగా అలారం మోగించినట్టు అర్ధరాత్రి 2 లేదా 3 గంటలకు మెళకువ వస్తుంటుంది. ఇలా తరచూ జరుగుతుంటే సందేహించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు (Waking Up at 2AM Cortisol Imbalance).
Also Read: పురుష ఉద్యోగుల్లో 57 శాతం మందికి ఈ సమస్య.. జాగ్రత్త పడకపోతే..
రాత్రి వేళ్లుల్లో తరచూ మెళకువ రావడం అనారోగ్య సంకేతమని డా. ఎరిక్ బర్గ్ తాజాగా పేర్కొన్నారు. కార్టిసాల్ హార్మోన్ స్థాయిలో అసమతౌల్యానికి ఇది సంకేతమని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్ చేశారు.
మనం ఎప్పుడు నిద్రించాలి. ఎప్పుడు మేల్కోవాలో నిర్ణయించేది జీవ గడియారమని ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై కార్టిసాల్ ప్రభావం ఉంటుందని వివరించారు. ఒత్తిడి ఎక్కువైన సందర్భాల్లో రాత్రిళ్లు శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగి నిద్రాభంగం కలుగుతుందని చెప్పారు.
కార్టిసాల్ స్థాయిలు నియంత్రించడంలో మెగ్నీషియం పాత్ర కూడా ముఖ్యమేనని అన్నారు. మెగ్నీషియం స్థాయిలు తగినంత ఉన్నప్పుడు కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయని, కండరాలు రిలాక్స్ అవుతాయని, నాడీ వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇక మెగ్నీషియం లోపం ఉన్న వాళ్లల్లో కండరాలు పట్టేసినట్టు ఉండటం, అలసట వేధిస్తాయని చెప్పారు. ఇలాంటి వాళ్లు రాత్రిళ్లు నిద్రకు ఉపక్రమించే ముందు మెగ్నీషియం గ్లైసీనేట్ తీసుకుంటే శరీరం రిలాక్స్ అవుతుందని అన్నారు.
Also Read: పండగల్లో ఫుల్లుగా తినేశారా.. ఇలా చేస్తే బాడీ సెట్
ఇక ఉదయం పూట మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుందని డా. ఎరిక్ హెచ్చరించారు. కాబట్టి, రాత్రిళ్లు అకస్మాత్తుగా మెళకువ వచ్చిన సందర్భాల్లో నిర్లక్ష్యం వహించకుండా వైద్యులను సంప్రదిస్తే సమస్య ఏంటో ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టే అవకాశం దక్కుతుందని అన్నారు. నిద్రే కదా అన్న నిర్లక్ష్యం ఏమాత్రం వద్దని సూచించారు.
Also Read: కిడ్నీల్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్.. ఈ సంకేతాలపై నిర్లక్ష్యం వహిస్తే డేంజర్