Kidney Fungal Infections: కిడ్నీల్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్.. ఈ సంకేతాలపై నిర్లక్ష్యం వహిస్తే డేంజర్
ABN , Publish Date - Mar 16 , 2025 | 10:34 PM
కిడ్నీ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ బారిన పడినప్పుడు కనిపించే సంకేతాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ కథనంలో మనం కూలంకషంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఆరోగ్యవంతులకు కిడ్నీల్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్ సోకడం చాలా అరుదని నిపుణులు చెబుతున్నారు. అయితే, రోగ నిరోధక శక్తి తగ్గిన వారిలో మాత్రం ఇవి పెను ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్‌తో పాటు ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్న వారిలో ఇవి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి.
ఏమిటీ కిడ్నీ ఫంగస్
రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారికి ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువ. కిడ్నీ ఫంగల్ ఇన్‌ఫెక్షన్లకు ప్రధాన కారణం మధుమేహమని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో అధిక చక్కెర స్థాయిలు, ఫలితంగా బలహీనపడే రోగ నిరోధక శక్తి కారణంగా ఫంగస్ సోకే అవకాశాలు పెరుగుతాయి. కరోనా సంక్షోభం సమయంలో బ్లాక్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్లు పెరిగిన ఘటనలకు ఇదే కారణమని కూడా వైద్యులు చెబుతున్నారు.
Read More: కొత్త డైట్.. వరుసగా మూడు రోజుల పాటు కేవలం ద్రాక్ష పళ్లు మాత్రమే తింటే..
కిడ్నీ ఫంగల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు
కిడ్నీ ఫంగల్ ఇన్‌ఫక్షన్ బారిన పడ్డ వారిలో కొన్ని రోగ లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయి. మూత్రంలో మంట, నిత్యం మూత్రానికి వెళ్లాల్సి రావడం, ఫ్లాంక్ పెయిన్, వాంతులు, ఫీవర్ వంటివన్నీ ఫంగల్ ఇన్‌ఫెక్షన్‌కు సంకేతాలు. ఇన్‌ఫెక్షన్ తీవ్రంగా ఉన్న సందర్భాల్లో వీపుపై చర్మం రంగు మారిపోతుందని కూడా చెబుతున్నారు. రక్తపోటు కూడా ప్రమాదకర స్థాయిలో పడిపోతుందని అంటున్నారు.
Read More: కొబ్బరి నూనెకు ఈ ఐదు కలిపి జుట్టుకు పట్టిస్తే బట్టతల నుంచి ఉపశమనం
వ్యాధిని వీలైనంత త్వరగా గుర్తించడమే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ నివారణ ప్రధానమని వైద్యులు చెబుతున్నారు. ఆ తరువాత యాంటీఫంగల్ యాంటీబయాటిక్స్ ట్రీట్‌మెంట్‌తో వ్యాధిని తొలగించుకోవచ్చని చెబుతున్నారు. సరైన సమయంలో ట్రీట్‌మెంట్ అందితే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లతో ఎటువంటి ముప్పు ఉండదని, దీర్ఘకాలిక ప్రభావాలు ఏవీ ఉండవని చెబుతున్నారు.
ఇక కిడ్నీల ఆరోగ్యం కాపాడుకునేందుకు మధుమేహం, అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను, మూత్ర వ్యవస్థలో సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో కూడిన సంతులన ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పక వ్యాయామం చేయడంతో పాటు, సరిపడా విశ్రాంతి తీసుకోవాలి. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కిడ్నీ సమస్యలు దరి చేరవని నిపుణులు భరోసా ఇస్తున్నారు.