Vitamin B12 Deficiency: పురుష ఉద్యోగుల్లో 57 శాతం మందికి ఈ సమస్య.. జాగ్రత్త పడకపోతే..
ABN , Publish Date - Mar 17 , 2025 | 05:05 PM
పురుష కార్పొరేట్ ఉద్యోగుల్లో ఏకంగా 57 శాతం మంది విటమిన్ బీ12 లోపంతో బాధపడుతున్నట్టు తాజాగా జరిగిన ఓ సర్వేలో తేలింది. మహిళా ఉద్యోగుల్లో 50 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నారట.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని నగరాల్లో ప్రజారోగ్య సమస్యలు సంక్షోభ స్థాయికి చేరుకుంటున్నాయి. పురుష కార్పొరేట్ ఉద్యోగుల్లో ఏకంగా 57 శాతం మందిలో విటమిన్ బీ12 లోపం ఉన్నట్టు ఓ సర్వేలో తేలింది. ఇక మహిళా ఉద్యోగుల్లో కూడా 50 శాతం మంది బీ12 లోపంతో బాధపడుతున్నారట. మొత్తం 4400 మందిపై (3338 పురుషులు, 1059 స్త్రీలు) మెడీబడ్డీ అనే సంస్థ జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరాల్లో కార్పొరేట్ ఉద్యోగుల ఆహార అలవాట్లు, అధిక ఒత్తిడి వంటివి ఈ సమస్యకు దారితీస్తున్నాయని ఆ సంస్థ తేల్చింది. శరీరంలో ఎనర్జీ ఉత్పత్తికి, మెదడు పనితీరుకు, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన ఈ విటమిన్‌లోపంతో పలు సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, కొన్ని జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటే ఈ సమస్యను సులువుగానే అధిగమించొచ్చని కూడా భరోసా ఇస్తున్నారు (Vitamin B12 Deficiency in Male Corporate Employees).
Also Read: పండగల్లో ఫుల్లుగా తినేశారా.. ఇలా చేస్తే బాడీ సెట్
జంతు సంబంధిత ఉత్పత్తుల్లో విటమిన్ బీ12 సమద్ధిగా ఉంటుంది. కాబట్టి, మాంసాహారులు గుడ్లు, పాల ఉత్పత్తులు, చికెన్, చేపలు వంటివి తప్పనిసరిగా తినాలి. ఈ విటమిన్ ఉన్న ఫోర్టిఫైడ్ ఆహారాలను శాకాహారులు తీసుకోవాలి.
సోయా, బాదం, ఓట్స్‌తో చేసిన ఫోర్టిఫైడ్ ఉత్పత్తులు, న్యూట్రిషనల్ యీస్ట్ వంటివి వెజిటేరియన్‌లకు అనువుగా ఉంటాయి.
విటమిన్ బీ12 ఉన్న ఆహారాలు తిన్నంత మాత్రాన ఈ లోపం తీరదని కూడా నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియలో లోపాలుంటే ఈ విటమిన్‌ను శరీరం సరిగ్గా గ్రహించలేదు. కాబట్టి, జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు పెరుగు, ఇడ్లి, దోస లాంటి పులియబెట్టిన ఆహారాలు, ఊరగాయ పచ్చళ్లు వంటివి తప్పక తినాలి.
Also Read: కిడ్నీల్లో ఫంగల్ ఇన్‌ఫెక్షన్.. ఈ సంకేతాలపై నిర్లక్ష్యం వహిస్తే డేంజర్
చక్కెరలు అధికంగా ఉండే కార్బోరేటెడ్ ఫుడ్స్, ఇతర ప్రాసెస్డ్ ఆహారాల జోలికి అస్సలు వెళ్లొద్దని నిపుణులు చెబుతున్నారు. వీటితో విటమిన్ బీ12 లోపం తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ ఆహారాలు పేగుల లోపలివైపు ఉన్న పొరను దెబ్బతీసి శరీరం విటమిన్ బీ12
గ్రహించడంలో ఆటంకాలు కలిగిస్తాయి. వీటి బదులు తృణ ధాన్యాలు, పండ్లు, ఇంట్లో వండిన ఆహారం ఆరోగ్యానికి ఎంతో మేల చేస్తుంది.
ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి విటమిన్ బీ12తో పాటు ఐరన్, ఫోలేట్ కూడా అవసరం. ఒకదాంట్లో ఏర్పడే కొరత రెండో విటమిన్‌పై ప్రభావం చూపిస్తుంది. ఈ సమస్య నివారణకు ఆహారంలో పాలకూర, బఠాణీలు, బీన్స్, బీట్‌రూట్, దానిమ్మ, బాదం పప్పులు వంటివి సమృద్ధిగా తినాలి. అవసరమనుకుంటే విటమిన్ బీ12 సప్లిమెంట్లు కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.