Prawns: రొయ్యలు ఇలా తింటే డేంజర్.. ఈ విషయం మీకు తెలుసా?
ABN , Publish Date - Nov 07 , 2025 | 07:07 PM
రొయ్యలు.. మాంసాహార ప్రియులు అమితంగా ఇష్టపడి తింటారు. కానీ కొన్ని విషయాలను పట్టించకోకుండా వాటిని తీసుకోవడం వల్ల అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది.
మాంసాహార ప్రియులు రొయ్యలను అమితంగా ఇష్టపడతారు. రొయ్య కూర వాసనతోపాటు దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనిని చాలా మంది అమితంగా ఇష్టపడతారు. అయితే రొయ్యలు వలిచినప్పుడు.. దానికి వెనుక భాగంలో నల్లని గీతలా కనిపిస్తుంది. చాలా మంది దీనిని రొయ్య రక్తనాళంగా భావిస్తారు. కానీ నిజానికి రొయ్య జీర్ణవ్యవస్థ. దానిని తీయ్యకుండా ఉడికించి తింటే అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని అక్వా రంగ నిపుణులు చెబుతున్నారు.
రొయ్య వెనుక భాగంలో ఉండే ఈ జీర్ణవ్యవస్థలో జీర్ణం కాని ఆహారం ఉంటుంది. అందులో వ్యర్థాలతోపాటు కొన్నిసార్లు ఇసుక సైతం ఉంటుంది. మరికొన్ని సార్లు విషపూరితమైన పదార్థాలు కూడా ఉంటాయి. అయితే రొయ్యల ఆహారం, నీటి నాణ్యతను బట్టి.. అది ఆకుపచ్చ లేదా నలుపు రంగులో గీతలాగా ఉంటుంది.
దీనిని తొలగించకుండా రొయ్యలను అలాగే ఉడికించినట్లయితే.. పలు అనారోగ్య సమస్యలు సంభవించే అవకాశం ఉంది. ఇది కొద్దిగా చేదుగా ఉంటుంది. ఇది మొత్తం కూర రుచిపై ప్రభావం చూపుతుంది. ఇలా కూర చేసుకుని తినడం ద్వారా అలెర్జీ ఉన్నవారిలో జీర్ణ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. కొన్ని సార్లు ఈ వ్యర్థాల్లోని విష పదార్థాలు వల్ల శ్వాస సమస్యలు, గొంతు బిగదీసుకోవడం తదితర అలెర్జీలకు కారణమవుతుంది. అరోగ్యంతో పాటు రుచి కోసం రొయ్య వెనుక భాగంలోని నల్ల సిరను తొలగించాలి.
ఈ జీర్ణ వ్యవస్థను ఎలా తొలగించాలంటే.. ముందుగా రొయ్యల తల, కాళ్లను తొలగించాలి. ఆ తర్వాత షెల్ తొలగించాలి. తోకను అలాగే ఉంచి.. పదునైన కత్తిని తీసుకుని.. రొయ్యల వెనుక భాగంలో కోత పెట్టి.. కత్తి కొన లేదా టూత్ పిక్ ఉపయోగించి.. నల్ల సిరను సున్నితంగాపైకి లాగాలి. ఆ తర్వాత రొయ్యలను చల్లని నీటితో బాగా కడగాలి. అనంతరం మనకు ఎలా కావాలలో అలా కూరను వండుకోవాలి.
అయితే రొయ్యలను సాధారణంగా తక్కువ కొవ్వు కలిగిన సముద్ర ఆహారంగా పరిగణిస్తారు. వాటిలో ఉండే కొవ్వు చాలా ఆరోగ్యకరమైనది. రొయ్యలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లం ఉంటుంది. వీటిలో EPA, DHA పుష్కలంగా ఉంటాయి. ఈ ఒమేగా 3 ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి, మెదడు పని తీరుకు చాలా మంచిది.
ఈ వార్తలు కూడా చదవండి..
పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..
ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు..
For More Health News And Telugu News