New Year: న్యూ ఇయర్‌కు కేక్ కొంటున్నారా.. అయితే ముందు ఈ జాగ్రత్తు పాటించాల్సిందేమరి
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:04 PM
కొత్త సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేస్తుంటాం. అయితే.. ఈ కేకుల తయారీలో వాడే కలర్స్ వల్ల, తయారు చేసే ప్రదేశాల పట్ల తడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఆయా అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
కేకుల్లో అనారోగ్య హేతువులు!
హైదరాబాద్ సిటీ: నూతన సంవత్సర(New Year) వేడుకలకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. 31న అర్ధరాత్రి పార్టీల కోసం ఇప్పటికే ప్రణాళిక చేసుకున్నారు. న్యూ ఇయర్ ఆరంభం వేళ కేక్ కటింగ్ తప్పనిసరి. ఆనందోత్సాహాలతో కేకులను తింటూ ఆస్వాదించాలనుకునే వారు పలు జాగ్రత్తలు పాటించాలని డాక్టర్లు(Doctors) సూచిస్తున్నారు. కేకుల తయారీలో వాడే కలర్స్, వాటిని తయారు చేసిన వాతావరణం, కేకులపై దట్టంగా అద్దిన క్రీమ్ అన్నీ అనారోగ్య హేతువులే అని హెచ్చరిస్తున్నారు. గుర్తింపు పొందిన బేకర్స్ నాణ్యత పరంగా రాజీ పడకపోవచ్చు కానీ, రోడ్ల పక్క జరిపే విక్రయాల దగ్గర మాత్రం ఆచితూచి స్పందించాల్సి ఉంటుందంటున్నారు. గత సంవత్సరం కర్నాటకలో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన దాడుల్లో బ్లాక్ ఫారెస్ట్, రెడ్ వెల్వెట్ తరహా కేకుల్లో వాడే కలర్స్‌లో క్యాన్సర్ కారకాలు కనిపిస్తున్నాయని వెల్లడించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
- కేకులంటేనే హై కేలరీ ఫుడ్. వీటిలో షుగర్, ఫ్యాట్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు చాలా చోట్ల కేకులు మైదాతో చేస్తారు. దీనివల్ల ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయి. అలాగని కేకులు తినొద్దని కాదు పరిమితంగా ఉండాలంటున్నారు జనరల్ ఫిజీషియన్ ఉదయ్.
- అత్యధిక చక్కెర, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ వంటివి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు కన్సల్టెంట్ న్యూట్రిషియనిస్ట్ స్రవంతి.

- కాస్త శ్రద్ధ పెడితే కేకుల్లో వాడే హానికర కలర్స్ గుర్తించవచ్చంటున్నారు క్లినికల్ న్యూట్రిషియనిస్ట్ వర్షిణి. ఫుడ్ కలర్స్‌లో ఈ129, రెడ్ 40 వాడడం వల్ల దురదలు, అలర్జీలు, ఈ124 సింథటిక్ రెడ్ డై (స్ట్రాబెర్రీ రెడ్)తో వికారం, వాంతులు, సన్‌సెట్ ఎల్లో ఎఫ్‌సీఎఫ్, ఈ110 వల్ల వికారం, వాంతులు, డయేరియా, చర్మ సంబంధిత, టారా్ట్రజైన్ (లెమన్ ఎల్లో) అని వాడే ఈ102 వల్ల పిల్లల్లో హైపర్ యాక్టివిటీ వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ఈ 122 అని కార్మోసైన్ (మెరూన్)ను వాడటానికి అనుమతి ఉంది కానీ, ఎక్కువ కాలం దీనిని తీసుకుంటే క్యాన్సర్ ప్రభావం కనిపిస్తోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. ఫ్రూట్ కేకులు అందులో తాజా పళ్లతో చేసిన కేకులు, రంగుల కేకులకు బదులు డ్రై కేకులు తీసుకోవడం మంచిదని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ
మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు
Read Latest Telangana News and National News