Health: ఉదయం పూట కాఫీలో ఓ స్పూన్ నెయ్యి వేసుకొని తాగితే మంచిదేనా?
ABN , Publish Date - Dec 28 , 2025 | 12:35 PM
యాంటీఆక్సిడెంట్స్‌కి చక్కని చిరునామా కాఫీ. ఇందులోని పాలీఫీనాల్స్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. అయితే టీతో పోలిస్తే కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉండటంతో అధికంగా తాగితే ఆందోళన, హృదయ స్పందన వేగం, అసిడిటీ సమస్యలు రావచ్చు.
ఉదయం కాఫీలో ఓ స్పూన్ నెయ్యి వేసుకొని తాగేవాళ్లు పెరుగుతున్నారు. ఇలా తాగడం మంచిదేనా?
- అనుపమ్, హైదరాబాద్
యాంటీఆక్సిడెంట్స్‌కి చక్కని చిరునామా కాఫీ. ఇందులోని పాలీఫీనాల్స్ ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. అయితే టీతో పోలిస్తే కాఫీలో కెఫీన్ ఎక్కువగా ఉండటంతో అధికంగా తాగితే ఆందోళన, హృదయ స్పందన వేగం, అసిడిటీ సమస్యలు రావచ్చు. కాఫీలో నెయ్యి కలపడం వల్ల అందులోని బ్యూటిరిక్ యాసిడ్ పేగుల ఆరోగ్యానికి, మలబద్ధకం తగ్గడానికి కొంత మేలు చేయవచ్చు, అలాగే కొందరికి అధిక సమయం పాటు ఉత్సాహంగా ఉండడం, ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉండడం జరగవచ్చు. కానీ నెయ్యి క్యాలరీలు, కొలెస్ట్రాల్ ఎక్కువగా కలిగిన కొవ్వు పదార్థం కాబట్టి ఇది అందరికీ సరైనది కాదు. బరువు తగ్గాలనుకునేవారు లేదా కొలెస్ట్రాల్, అసిడిటీ సమస్యలున్నవారు జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడూ, పరిమితంగా తీసుకుంటే హానికరం కాదు కానీ ట్రెండ్ కోసం తప్పనిసరిగా చేసుకోవాల్సిన అలవాటు మాత్రం కాదు.
శీతాకాలంలో ఆకుపచ్చని అతిథుల్లా రోడ్ల మీద పలుకరిస్తుంటాయి పెద్ద రేగుపండ్లు. లేత ఆకుపచ్చగా ఉండే పెద్ద రేగు పండ్లలో పోషక విలువలు ఏమిటి?
- సృష్టి, నెల్లూరు

రేగు పండ్లు ఆకుపచ్చ రంగులో, లేత ఎరుపు రంగులో, ముదురు ఎరుపు రంగులో... ఇలా రకరకాలుగా లభిస్తాయి. వీటన్నింటిలోనూ పోషకాలు అధికమే. పచ్చిగా ఉండే ఆకుపచ్చని రేగుపండ్లే పండి ఎరుపు రంగు సంతరించుకుంటాయి. రేగుపళ్ళు ఏ రంగులో ఉన్నా వివిధ రకాల పండ్లలానే వీటిల్లోనూ పిండి పదార్థాలు ఎక్కువ. పచ్చిగా ఉన్నప్పటికన్నా పండినప్పుడు రేగు పళ్లలో చక్కెర శాతం పెరుగుతుంది. రేగుపళ్లలో సి విటమిన్, పీచు పదార్థం, క్వేర్సెటైన్, కాటెచిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికమే. గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడానికి, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచడానికి, బీపీ సమస్య అదుపులో ఉంచడానికి కూడా రేగిపళ్ళు తోడ్పడతాయి. నిద్రలేమి సమస్య ఎదుర్కోడానికి కూడా రేగుపండ్లు ఉపయోగ పడతాయి. అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలకు కూడా ఈ పండ్లు చక్కటి పరిష్కారం.
ఇటీవల బార్బిక్యూ విధానంలో వండిన ఆహారాన్ని తీసుకోవడం సాధారణమైంది. ఇలా తీసుకోవడం వల్ల నిజంగా ఏవైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా?
- వేద, నిజామాబాద్

బార్బిక్యూ విధానంలో వండిన ఆహారం రుచిగా ఉన్నప్పటికీ, ఇటువంటి ఆహారాన్ని అధికంగా తీసుకొంటే కొన్ని ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. బొగ్గు మంటలు లేదా నేరుగా మంట మీద అధిక ఉష్ణోగ్రతల్లో ఆహారాన్ని వండినప్పుడు క్యాన్సర్‌కు కారణమయ్యే హానికారక రసాయనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి శరీర కణాలకు నష్టం కలిగించి, తరచూ తీసుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచవచ్చు. అలాగే బార్బిక్యూ సమయంలో మంటల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా సరైన జాగ్రత్తలు లేకుండా వాడినప్పుడు. ఉష్ణోగ్రతపై నియంత్రణ తక్కువగా ఉండటంతో ఆహారం బయట కాలిపోయి లోపల సరిగా ఉడకకపోవచ్చు, దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉంటుంది. అదనంగా బార్బిక్యూ గ్రిల్లులను తరచూ శుభ్రం చేయాల్సి ఉండటం, బూడిద, పొగ వంటి సమస్యలు ఇబ్బందికరంగా మారుతాయి. అందువల్ల బార్బిక్యూ ఆహారాన్ని తరచూ అలవాటుగా కాకుండా, అప్పుడప్పుడూ మితంగా తీసుకోవడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం. అలా మితంగా తీసుకున్నప్పుడు కూడా మరీ మాడిపోయేలా నల్లగాఅయ్యే వరకు కాల్చకుండా ఉంటే మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
(పాఠకులు తమ సందేహాలను
sunday.aj@gmail.com కు పంపవచ్చు)
ఈ వార్తలు కూడా చదవండి..
బ్రేకులే లేనట్టు దూసుకుపోతున్న పసిడి, వెండి!
ఆ మావోయిస్టులకు ఆశ్రయం ఇవ్వొద్దు
Read Latest Telangana News and National News