Health Tips : ఆ సమయంలో ఈ పనులు చేయటం చాలా తప్పు..
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:38 PM
ప్రతి మహిళా నెలసరి సమస్యను నెల నెలా భరించాల్సిందే. కడుపు నొప్పి, అలసట, నీరసం, ఇలా రకరకాల సమస్యలు సహజంగానే ఉంటాయి. కానీ, కొందరిలో నొప్పి తీవ్రంగా ఉంటుంది. అందుకు ఈ తప్పులే కారణం కావచ్చు..
ప్రతి మహిళా నెలసరి సమస్యను నెల నెలా భరించాల్సిందే. పొత్తికడుపులో నొప్పి, అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్ ఇలా రకరకాల సమస్యలు సహజంగానే ఉంటాయి. కానీ, కొందరు భరించలేని నొప్పితో బాధపడుతుంటారు. వీటి నుంచి తప్పించుకునేందుకు నొప్పి నివారణ మందులపై ఆధారపడతారు. ఈ పద్ధతి అప్పటికి తాత్కాలిక ఉపశమనం కలిగించినా దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్యాలకు దారితీస్తుంది అని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. పీరియడ్స్ ఆలస్యంగా రావడం, వచ్చినా భరించలేని నొప్పులు, రక్తస్రావం వంటివి ఉండటానికి మీరు చేస్తున్న ఈ తప్పులే కారణం కావచ్చు. అవేంటో తెలుసుకుందాం.
నెలసరి సమయంలో నొప్పులు రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. రక్తం బ్లీడింగ్ రూపంలో బయటికి వెళ్లేందుకు ప్రొస్టాగ్లాడిన్స్ అనే పదార్థాలను మన శరీరం విడుదల చేస్తుంది. ఆ సమయంలో గర్భాశయంపై ఎక్కువ ఒత్తిడి పడి పొత్తికడుపు వద్ద నొప్పి తీవ్రమవుతుంది. హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు ఏర్పడి శరీరాన్ని అలసట, నీరసం, నడుం నొప్పులు వంటి అసౌకర్యాలు బాధిస్తాయి. ప్రొస్టాగ్లాడిన్స్ అధికంగా ఉత్పత్తి అయినవారిలో ఈ నొప్పులు మరీ ఎక్కువ. మనం అనుసరించే జీవనశైలి అలవాట్లు, దినచర్యలు పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పిని కలిగించవచ్చు.
పీరియడ్స్ సమయంలో అధిక నొప్పికి కారణాలు ఇవే..
అనారోగ్యకరమైన ఆహారం: శరీరంలో ఒమేగా-3, మెగ్నీషియం, విటమిన్ డి, కొవ్వులు, అవసరమైన పోషకాలు తగ్గినప్పుడు పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు వద్ద తీవ్రమైన నొప్పి, కడుపు ఉబ్బరం వంటివి ఎక్కువగా కనిపిస్తాయి. పండ్లు, కూరగాయలకు బదులుగా ప్రాసెస్ ఫుడ్ అధికంగా తినే మహిళలే నెలసరిలో తీవ్ర బాధ అనుభవిస్తారు.
నీరు : తగినంత నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని తెలిసిందే. నెలసరి సమయంలో ఈ సమస్య ఉబ్బరం, భరించలేని నొప్పికి దారితీస్తుంది. అందుకే ప్రతి రోజూ తగిన మొత్తంలో నీరు తీసుకుంటూ హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో.
నిద్ర : శరీరానికి తగినంత నిద్ర లేకపోతే, అది మెలటోనిన్, కార్టిసాల్ వంటి హార్మోన్ల విడుదలలో సమతుల్యత లోపించి రుతుచక్రాన్ని దెబ్బతీస్తుంది. దీని వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి పెరుగుతుంది. నిద్ర లేకపోవడం వల్ల వాపు, నొప్పి, మానసిక రుగ్మతలు, ఇతర ఆరోగ్య సమస్యలకు తలెత్తుతాయి.
కెఫీన్, ఆల్కహాల్ : ఆల్కహాల్, కెఫీన్ అధికంగా వినియోగించడం శరీరానికి అంత మంచిది కాదు. మరీ ముఖ్యంగా ఋతుస్రావం సమయంలో మహిళలు ఆల్కహాల్ లేదా కెఫీన్‌ను దూరం పెట్టడం అత్యవసరం. ఇలా చేయకపోతే పీరియడ్స్ నొప్పి తీవ్రమవుతుంది.
అధిక ఒత్తిడి : అధిక ఒత్తిడి హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. అది మెన్‌స్ట్రూవల్ సైకిల్‌పైనా ప్రభావం చూపిస్తుంది. సక్రమంగా పీరియడ్స్ రాకపోవడం, ఆ సమయంలో తిమ్మిరి, మూడ్ స్వింగ్స్, అధిక నొప్పులు ఏర్పడవచ్చు. అందుకే ఒత్తిడిని అదుపులో పెట్టేందుకు యోగా, ధ్యానం ప్రతి రోజూ సాధన చేయాలి.
ఫిట్‌నెస్ : శరీర బరువు అకస్మాత్తుగా పెరగడం లేదా తగ్గడం హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. తమ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపని స్త్రీలు రుతుక్రమ సమస్యలను ఎదుర్కొంటారు. వేగంగా బరువు పెరగడం లేదా తగ్గడం ఋతు చక్రంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నెలసరి రోజులను బాధకరంగా మారుస్తుంది.
కాబట్టి పై తప్పులను గుర్తించి నివారణకు ప్రయత్నిస్తే మహిళలు నెలసరి సమయంలో అసౌకర్యాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.