Hyderabad: అన్నకు ప్రాణం పోసిన చెల్లి..
ABN , Publish Date - Jul 16 , 2025 | 07:39 AM
తనకు శస్త్రచికిత్స అని చెబితే పదకొండేళ్ల ఆ బాలుడు ఏమాత్రం భయపడలేదు. ‘నేను చదువుకోవాలి.. ఆడుకోవాలి. తొందరగా ఆపరేషన్ చేయండి’ అని డాక్టర్ తో అన్నాడు. పైగా.. ‘నాకేమీ కాదు.. కంగారు పడొద్దు’ అని తల్లిదండ్రులకు తానే ధైర్యం చెప్పాడు.
- 11 ఏళ్ల బాలుడికి మూలకణాల దానం చేసిన సోదరి
- బాలుడికి అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా సమస్య
- మూలకణాలు దానం చేస్తేనే ప్రాణం నిలుస్తుందన్న వైద్యులు
- కన్నవారికి ధైర్యం చెప్పి సర్జరీ కోసం ముందుకొచ్చిన బాలుడు
- కొండాపూర్ కిమ్స్ కడల్స్‌లో శస్త్రచికిత్స.. బాలుడికి పూర్తి స్వస్థత
హైదరాబాద్ సిటీ: తనకు శస్త్రచికిత్స అని చెబితే పదకొండేళ్ల ఆ బాలుడు ఏమాత్రం భయపడలేదు. ‘నేను చదువుకోవాలి.. ఆడుకోవాలి. తొందరగా ఆపరేషన్ చేయండి’ అని డాక్టర్ తో అన్నాడు. పైగా.. ‘నాకేమీ కాదు.. కంగారు పడొద్దు’ అని తల్లిదండ్రులకు తానే ధైర్యం చెప్పాడు. ఇక తాను మూలకణాలను దానం చేస్తే తప్ప అన్న బతకడు అని తెలియడంతో పదేళ్ల సోదరి పెద్ద మనసుతో ముందుకొచ్చింది. ఫలితంగా కొండాపూర్ కిమ్స్ కడల్స్ ఆస్పత్రి(Kondapur KIMS Kadals Hospital)లో మూలకణాల చికిత్స చేయడంతో కొన్నాళ్లుగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న బాలుడు ఆ సమస్య నుంచి బయటపడ్డాడు.
ఈ మేరకు ఆ ఆస్పత్రి యాజమాన్యం మంగళవారం ఓ పత్రిక ప్రకటనను విడుదల చేసింది. అందులోని వివరాల ప్రకారం.. వరంగల్‌లో ఓ సామాన్య కుటుంబానికి చెందిన 11 ఏళ్ల బాలుడు అత్యంత అరుదైన అప్లాస్టిక్ ఎనీమియా అనే సమస్యతో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి పీడితుల్లో ఎముక మజ్జ లోపం వల్ల సరిపడా రక్త కణాల ఉత్పత్తి జరగదు. ఇది అత్యంత అరుదైన వ్యాధి అని, ప్రతి పది లక్షల మంది పిల్లల్లో 6నుంచి 8 మందికే వస్తుందని పీడియాట్రిక్ హెమటాలజిస్టు, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ నిపుణులు డాక్టర్ చందనా మారెడ్డి పేర్కొన్నారు.

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బాలుడిని తల్లిదండ్రులు గత మే నెలలో కొండపూర్‌లోని కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. బాబు రక్తంలో హెమోగ్లోబిన్, ప్లేట్‌లెట్లు, న్యూట్రోఫిల్స్ బాగా తక్కువ స్థాయిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించాక ఆ బాబు.. సీవియర్ అప్లాస్టిక్ ఎనీమియాతో బాధపడుతున్నట్లు.. మూలకణ చికిత్స చేస్తే తప్ప వ్యాధి నయం కాదని వైద్యులు నిర్ధారణకొచ్చారు.
బాలుడి చెల్లెలికి పరీక్షలు చేయడంతో మూలకణాలు కొంతమేర మ్యాచ్ అయ్యాయి. తన అన్నకు ఏదో ఆపద వచ్చిందని గ్రహించిన ఆ చిన్నారి.. మూలకణాలు దానం చేసేందుకు ముందుకొచ్చింది. ఆ పాప మూలకణాలు పూర్తిస్థాయిలో మ్యాచ్ కాకపోయినా (హాఫ్ మ్యాచ్) అంతర్జాతీయ ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా బాలుడికి ఎక్కించామని వైద్యులు చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు పలు రకాల ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుందని..

నోటిపూత, జుట్టు రాలడం, వాంతులు చేసుకోవడం, రుచి లేకపోవడం, ఆకలి పుట్టకపోవడం లాంటి సమస్యలు రావొచ్చునని పేర్కొన్నారు. బాలుడు ధైర్యంగా ఉండటంతో ఎలాంటి సమస్యా రాలేదని చెప్పారు. బాధిత కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో ఆస్పత్రి నుంచి భారీగా రాయితీలు ఇచ్చి చికిత్స చేశామని, అంతా బాగుండడంతో బాలుడిని డిశ్చార్జి చేశాం అని డాక్టర్ చందనా మారెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ కెమిస్ర్టీ ఒలింపియాడ్‌లో నారాయణ విద్యార్థికి పతకం
Read Latest Telangana News and National News