Oral Health Cancer Link: ఈ ఒక్క పని చేస్తే క్యాన్సర్ ఫ్రీ అవ్వచ్చు: ఎయిమ్స్
ABN , Publish Date - Jul 14 , 2025 | 06:05 PM
నేటి కాలంలో క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందుకే ఎప్పటికప్పుడు క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని, ముందస్తు నివారణా చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎయిమ్స్ చేసిన ఓ పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ ఒక్క పనిలో క్యాన్సర్ మహమ్మారిని దూరంగా తరిమికొట్టవచ్చని పరిశోధకులు కనుగొన్నారు.
Oral Health Cancer Link AIIMS Reasearch: ప్రపంచవ్యాప్తంగా ఏటికేడు క్యాన్సర్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఎప్పుడు ఏ తరహా క్యాన్సర్ దాడి చేస్తుందో అనే భయం ప్రజలను ఉక్కిరిబిక్కిరిచేస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవాళ్లూ హఠాత్తుగా ఈ మహమ్మారి బారిన పడుతుండటమే జనాలను కలవరపెడుతోంది. అయితే, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ (AIIMS) పరిశోధకులు ఒక కొత్త విషయం కనుగొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఒక్క పని కోసం రోజూ సమయం కేటాయిస్తే 90 శాతం క్యాన్సర్లను నివారించవచ్చని అంటున్నారు.
ది లాన్సెట్ రీజినల్ హెల్త్ - సౌత్ ఈస్ట్ ఆసియా జర్నల్‌లో AIIMS ఆంకాలజిస్టులు డాక్టర్ అభిషేక్ శంకర్, డాక్టర్ వైభవ్ సాహ్ని నోటి ఆరోగ్యం, క్యాన్సర్ మధ్య సంబంధాన్ని గురించి ఓ పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. ఒక్క నోటి ఆరోగ్యం క్యాన్సర్ ముప్పును ఎలా తగ్గిస్తుంది.. మన ఆయుష్షును పెంచడంలో దీని పాత్రేంటి అనే విషయాలను ఇందులో పొందుపర్చారు. మానవ మనుగడను గణనీయంగా ప్రభావితం చేసే నోటి ఆరోగ్యంపై ప్రజలు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను విపులంగా వివరించారు.
క్యాన్సర్ సంరక్షణకు నోటి ఆరోగ్యం చాలా కీలకమని, మనుగడ రేటున పెంచుతుందని ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ (AIIMS) పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా తల, మెడ క్యాన్సర్లలో (HNC) నోటి ఆరోగ్యం, క్యాన్సర్ మధ్య గల సంబంధాన్ని గురించి అనేక ప్రపంచ అధ్యయనాలను కూడా వారు ఉదహరించారు. గత పదేళ్లలో డెంటల్ చెకప్ కోసం వెళ్లే ప్రజల సంఖ్య పెరగడం క్యాన్సర్ మరణాలను తగ్గించినట్లు అధ్యయానాల్లో తేలిందని పేర్కొన్నారు. ఎందుకంటే, పోర్ఫిరోమోనాస్ జింగివాలిస్, ప్రీవోటెల్లా ఇంటర్మీడియా వంటి వ్యాధికారక నోటి బ్యాక్టీరియా క్యాన్సర్ వచ్చే అవకాశాలు భారీగా పెంచుతుంది.
నోటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరించేందుకు టూత్ బ్రషింగ్ కార్యక్రమాలను, పీరియాంటల్ వ్యాధిని ముందస్తుగా నిర్ధారించడానికి మౌత్‌రిన్స్ ఆధారిత పాయింట్-ఆఫ్-కేర్ 3 (PoC) పరీక్షను అమలు చేయడం వంటి వాటిపై చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ పరిశోధకులు అంటున్నారు . ఆగ్నేయాసియా ప్రాంతంలో క్యాన్సర్ సంరక్షణ, నోటి ఆరోగ్యం ప్రాముఖ్యతను నొక్కి చెప్పేలా ఎన్నో అవగాహన కార్యక్రమాలను, విధాన స్థాయిలో నిర్ణయం తీసుకునేలా అధికారులను ప్రోత్సహించినట్లు ఢిల్లీ AIIMSలో రేడియేషన్ ఆంకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శంకర్ అన్నారు.
ఇంకా, నోటి ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి ఉపాధ్యాయులు, కుటుంబాలకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని, మార్పు కోసం ఉచిత టూత్ బ్రష్, టూత్‌పేస్ట్ శాంపిల్స్ అందించాలని తమ పరిశోధనా పత్రంలో పేర్కొన్నారు. ఇదేకాక, పోషకాహారం, చక్కెర వినియోగంపై ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
మడమల పగుళ్లతో ఇబ్బంది పడుతున్నారా? ఈ నివారణలను ట్రై చేస్తే పగుళ్లు మాయం.!
ఆపరేషన్ అవసరం లేదు.. ఈ 7 ఆయుర్వేద పానీయాలతో కిడ్నీలో రాళ్లకు చెక్..
For More Health News