Bihar Elections: మహాకూటమికి బిగ్ షాక్.. సిట్టింగ్ ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరణ
ABN , Publish Date - Oct 21 , 2025 | 04:22 PM
శశి భూషణ్ సింగ్ డీసీఎల్ఆర్ కార్యాలయంలో సోమవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ అసంపూర్తిగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీపీఐ వంటి అన్‌రిజిస్టర్డ్ పార్టీల నుంచి 10 మంది ప్రపోజర్లు నామినేషన్ దాఖలుకు అవసరం.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) వేళ విపక్ష మహాఘట్‌బంధన్ (Mahaghathbandhan)కు ఊహించని దెబ్బ తగిలింది. ఈస్ట్ చంపారన్ జిల్లా సుగౌలీ (Sugauli) నియోజకవర్గం వికాస్‌షీల్ ఇన్సాన్ పార్టీ (VIP) అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే శశి భూషణ్ సింగ్ (Shashi Bhushan Singh) నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారులు తోసిపుచ్చారు. సాంకేతిక లోపాలతో ఆయన నామినేషన్ తిరస్కరించినట్టు ప్రకటించారు.
శశి భూషణ్ సింగ్ డీసీఎల్ఆర్ కార్యాలయంలో సోమవారంనాడు నామినేషన్ వేశారు. ఆయన నామినేషన్ అసంపూర్తిగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీపీఐ వంటి అన్‌రిజిస్టర్డ్ పార్టీల నుంచి 10 మంది ప్రపోజర్లు నామినేషన్ దాఖలుకు అవసరం. అయితే ఆర్జేడీతో పొత్తు ఉందనే కారణంగా ఒకే ప్రపోజర్‌తో సింగ్ నామినేషన్ వేసినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన నామినేషన్ చెల్లదని ప్రకటించారు. దీంతో ఇప్పుడు సుగౌలీ నియోజకవర్గంలో లోక్‌జన్‌శక్తి పార్టీ (రామ్‌విలాస్)కి చెందిన రాజేష్ కుమార్ అలియాస్ బబ్లూ గుప్తా, అజయ్ ఝా (జన్ సురాజ్ పార్టీ) మధ్యే పోటీ నెలకొంది. బబ్లూగుప్తాకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
అనర్హతకు గురైన పలువురు అభ్యర్థులు
సుగౌలీ నియోజకవర్గం నుంచి సింగ్‌తో సహా 10 మంది నామినేషన్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురయ్యారు. వీరిలో గయాసుద్దీన్ సామని (ఆమ్ ఆద్మీ పార్టీ), సద్రే ఆలం (అప్ని జనతా పార్టీ), ప్రకాష్ చౌదరి (ఇండిపెండెంట్), కృష్ణమోహన్ ఝా (ఇండిపెండెంట్) తదితరులు ఉన్నారు. 243 మంది సభ్యుల బిహార్ అసెంబ్లీకి రెండు విడతలుగా నవంబర్ 6,11 తేదీల్లో పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి.
ఇవి కూడా చదవండి..
విభేదాల వేళ సీఎం, డిప్యూటీ సీఎంను కలిసిన కిరణ్ మజుందార్
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి