Jubilee Hills By Elections: ఓటర్లను ఆకట్టుకునేందుకు.. నేతల ప్రణాళికలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:12 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇన్నాళ్లు వేసిన ప్రచారం ఒకెత్తు అయితే ఈ మూడు రోజులు వ్యవహరించే తీరే కీలకమని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తూ.. దాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచారం ముగియనుండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి. ఇన్నాళ్లు వేసిన ప్రచారం ఒకెత్తు అయితే ఈ మూడు రోజులు వ్యవహరించే తీరే కీలకమని సీనియర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేస్తూ.. దాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం జనాకర్షణ ఉన్న బడా నాయకులను రంగంలోకి దించుతున్నారు.
వేడెక్కిన రాజకీయాలు
వారం రోజుల నుంచి అన్ని పార్టీలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగడంతో రాజకీయాలు వేడెక్కాయి.
మూడు రోజుల్లో..
ఈ నెల 9వ తేదీ సాయంత్రం ఆరుగంటలకు ప్రచారం ముగియనున్నది. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నేతలు యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేసుకున్నారు. ఇందులో భాగంగా మంత్రులు తమ డివిజన్లలో కుల సంఘాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న రోడ్డు షో నిర్వహించడంతో పాటు 3వ తేదీన బైక్ ర్యాలీలో పాల్గొననున్నారు. ఆయన నేరుగా ఓటర్లను కలవనున్నట్టు సీనియర్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా చివరి రెండు రోజులు నియోజకవర్గంలో జరిగే రోడ్డు షోలో పాల్గొననున్నారు. బీజేపీ ఈ నెల 6 నుంచే యాక్షన్ ప్లాన్‌ను అమలు చేసింది. బోరబండలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సభ, చివరి రెండు రోజులు కేంద్రమంత్రి కిషణ్ రెడ్డి, ఎంపీలతో సభలు నిర్వహించేలా పథకం వేసింది. మొత్తానికి ఈ మూడు రోజుల పాటు ప్రచారం ఆకాశాన్ని అంటనున్నది అనడంలో అతిశయోక్తి లేదు.
అన్నీతామై..
మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు సీనియర్లు అన్ని తామై తోడుగా నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున 12 మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఆయా వర్గాలకు కేటాయించిన డివిజన్ల లో తమ వ్యూహాలను అమలు చేస్తున్నారు. స్వయంగా సీఎం రేవంత్రెడ్డి ఐదుసార్లు నియోజకవర్గంలో రోడ్డు షో, సభల పేరిట ప్రచారం నిర్వహించడం అభ్యర్థికి కలిసివచ్చే అంశం. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తరపున మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు నెల రోజులుగా నియోజకవర్గంలో పని చేస్తున్నారు. బూత్ లిస్టులను పట్టుకొని రెండు దశల్లో ప్రచారం పూర్తి చేశారు. దీనికితోడు కేటీఆర్ నాలుగుసార్లు రోడ్డు షో నిర్వహించడం కార్యకర్తల్లో జోష్ నింపింది. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరపున రాష్ట్రంలో ఉన్న నేతలంతా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రత్యేకంగా రోజూ ప్రచారంలో కేంద్రమంత్రి కిషణ్ రెడ్డి పాల్గొనడం, పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటనలు చేయడం పార్టీకి కలిసి వచ్చే అంశంగా మారింది.
ఇవి కూడా చదవండి:
Lokesh: కార్యకర్తలు నడిపించే పార్టీ టీడీపీయే
Farming Technology: కిసాన్ డ్రోన్.. సాగు ఖర్చు డౌన్