JNTU: పీహెచ్‌డీ అభ్యర్థులకూ టీసీ..
ABN , Publish Date - Jun 19 , 2025 | 10:46 AM
జేఎన్‌టీయూలో పీహెచ్‌డీ అభ్యర్థులకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న బదిలీ పత్రాల (టీసీ) జారీ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. పీహెచ్‌డీ అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు అంతకు ముందు చదివిన కాలేజీ జారీ చేసిన టీసీని తప్పనిసరిగా సమర్పించాలని పట్టుబట్టే జేఎన్‌టీయూ అధికారులు, పీహెచ్‌డీ కోర్సు పూర్తి చేసిన తర్వాత టీసీ జారీ చేయడం లేదు.
- సమస్యకు పరిష్కారం చూపిన జేఎన్‌టీయూ వీసీ
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో పీహెచ్‌డీ అభ్యర్థులకు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న బదిలీ పత్రాల (టీసీ) జారీ సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. పీహెచ్‌డీ అడ్మిషన్ సమయంలో అభ్యర్థులు అంతకు ముందు చదివిన కాలేజీ జారీ చేసిన టీసీని తప్పనిసరిగా సమర్పించాలని పట్టుబట్టే జేఎన్‌టీయూ అధికారులు, పీహెచ్‌డీ కోర్సు పూర్తి చేసిన తర్వాత టీసీ జారీ చేయడం లేదు. దీంతో సదరు అభ్యర్థులు మరే ఇతర కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు వీలు కావడం లేదు. అలాగే, కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాల సమయంలోనూ టీసీలు లేక ఇబ్బందులు పడుతున్నారు.
జేఎన్‌టీయూలోనే ఒక అంశంపై పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థి, మరొక స్పెషలైజేషన్‌లో పీహెచ్‌డీ అడ్మిషన్ పొందాలంటే అధికారులు టీసీ సమర్పించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. వర్సిటీలోని ఆర్‌అండ్‌డీ విభాగం టీసీ జారీకి విముఖత వ్యక్తం చేయడం, అడ్మిషన్ విభాగంలో టీసీ లేకుంటే ప్రవేశాలకు ససేమిరా అంటుండడంతో కొన్నేళ్లుగా అభ్యర్థులు నానా అవస్థలు పడుతున్నారు. గతేడాది కొందరు అభ్యర్థులకు టీసీ లేదనే సాకుతో అడ్మిషన్లను నిరాకరించడంతో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి.

దీంతో ఇటీవల రెగ్యులర్ వైస్‌చాన్స్‌లర్‌గా నియమితులైన కిషన్‌కుమార్ రెడ్డి టీసీల జారీ సమస్యను పరిష్కరించారు. పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులకు టీసీలు జారీచేయాలని ఆర్‌అండ్‌డీ విభాగం డైరెక్టర్ చెన్నకేశవరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. పీహెచ్‌డీ పూర్తయిన అభ్యర్థులు నిర్ధేశించిన ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకుంటే వారికి అవసరమైన టీసీలను జారీ చేస్తామని ఆర్‌అండ్ డైరెక్టర్ చెన్నకేశవరెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విదేశాల్లో ఉద్యోగాల పేరిట మోసం
ఈ నెలాఖరులోపు బకాయిలు చెల్లించాల్సిందే
Read Latest Telangana News and National News