JNTU: జేఎన్‌టీయూ పరీక్షల విభాగంలో.. సిబ్బంది కొరత
ABN , Publish Date - Jun 27 , 2025 | 08:57 AM
జేఎన్‌టీయూలో కీలకమైన పరీక్షల విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఇటీవల పరీక్షల విభాగంలో కొందరు అధికారులను, సిబ్బందిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కొన్ని సెక్షన్లలో సేవలు స్తంభించాయి.
- స్టూడెంట్ సర్వీస్ సెక్షన్‌లో విద్యార్థులకు అరకొరగానే సేవలు
- రెండు వారాలుగా పత్తాలేని పర్వవేక్షణాధికారి
హైదరాబాద్ సిటీ: జేఎన్‌టీయూ(JNTU)లో కీలకమైన పరీక్షల విభాగాన్ని సిబ్బంది కొరత వెంటాడుతోంది. ఇటీవల పరీక్షల విభాగంలో కొందరు అధికారులను, సిబ్బందిని బదిలీ చేసిన ఉన్నతాధికారులు వారి స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కొన్ని సెక్షన్లలో సేవలు స్తంభించాయి. కీలకమైన ఎలక్ట్రానిక్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ పేపర్స్ (ఈడీఈపీ) సెక్షన్‌లో సాంకేతిక నిపుణుల కొరత ఏర్పడడంతో వన్‌టైమ్ చాన్స్‌లో పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ప్రశ్నాపత్రాల రూపకల్పనకు ఆటంకం ఏర్పడింది.
ఇంతకు ముందు అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్లు అదనపు కంట్రోలర్లుగా పనిచేసిన పరీక్షల విభాగంలో ఇటీవల మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగానికి చెందిన ప్రొఫెసర్లను ఎక్కువమందిని నియమించడం కూడా పరీక్షల నిర్వహణలో నెలకొన్న స్తబ్ధతకు మరొక కారణంగా తెలుస్తోంది. వేలాదిమంది అభ్యర్థులు వన్‌టైమ్ చాన్స్‌కు దరఖాస్తు చేయడంతో ఆయా పరీక్షల నిర్వహణ,
ప్రశ్నాపత్రాల రూపకల్పన, మూల్యాంకనం వంటి ప్రక్రియలను పర్యవేక్షించేందుకు అదనపు కంట్రోలర్లు, ఉద్యోగుల అవసరమేర్పడింది. సిబ్బంది కొరత ఉందని తెలిసినా ఉన్నతాధికారులు తాత్సారం చేయడంతో ఇతర సెక్షన్లలోని అధికారులు, ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయా సెక్షన్లలో పనిచేస్తున్న వారిపై పనిభారం పెరిగి విద్యార్థులకు అందాల్సిన సేవలకు ఆటంకం ఏర్పడుతోంది.
ధ్రువపత్రాల కోసం నిరీక్షణ
స్టూడెంట్ సర్వీసెస్ సెక్షన్‌లో పనిచేయాల్సిన పర్యవేక్షణాధికారి, మరికొందరు ఉద్యోగులకు వేరొక సెక్షన్‌లో అదనపు పనులకు పురమాయించడంతో వివిధ ధ్రువపత్రాల కోసం వచ్చే విద్యార్థులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. పలు ప్రవేశపరీక్షల ఫలితాలు వెల్లడి కావడం, క్యాంపస్ సెలక్షన్స్‌లో ప్లేస్‌మెంట్స్ పొందిన, విదేశీ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలు, ట్రాన్స్‌స్ర్కిప్ట్స్ కోసం స్టూడెంట్ సర్వీస్ సెక్షన్‌కు వందల సంఖ్యలో వస్తున్నారు.
కౌంటర్లలో అరకొరగా ఉన్న సిబ్బంది.. వందలాది మంది విద్యార్థులు అడుగుతున్న సమాచారం ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. విధిలేని పరిస్థితిలో పర్యవేక్షణాధికారిని కలవమని చెప్పినా, రెండు వారాలుగా ఆయన అందుబాటులో లేకపోతుండడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని గంటల్లో అందాల్సిన ధ్రువపత్రాల కోసం వారాల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి నుంచి వచ్చిన కొందరు దివ్యాంగ అభ్యర్థులు ఎంబీఏ పరీక్షల్లో ఉత్తీర్ణతకు ఉండే మినహాయింపు గురించి కౌంటర్లలో సిబ్బందిని అడగగా.. సెక్షన్ అధికారిని కలవమని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నప్పటికీ ఆ అధికారి జాడ లేకపోవడంతో వారు అవస్థలుపడ్డారు.
మహిళలకు తగ్గిన ప్రాధాన్యం
జేఎన్‌టీయూ పరీక్షల విభాగం నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యం తగ్గించడాన్ని కొందరు ప్రొఫెసర్లు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. అంతకు ముందు డైరెక్టర్, కంట్రోలర్, అదనపు కంట్రోలర్లతో కలిపి మొత్తం ఎనిమిది పోస్టులు ఉండగా, అందులో సగం మంది మహిళా ప్రొఫెసర్లకు అవకాశం కల్పించారు. ప్రస్తుతమున్న అధికారులలో మహిళా ప్రొఫెసర్ ఒక్కరే ఉండడం మహిళల ప్రాతినిధ్యం తగ్గిందనడానికి నిదర్శనంగా చెబుతున్నారు. పరీక్షల విభాగంలో సిబ్బంది కొరత ఉన్న సెక్షన్లలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని, విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వైస్‌చాన్స్‌లర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
నేడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
‘స్థానికం’లో బీసీ రిజర్వేషన్ల పెంపు..
Read Latest Telangana News and National News