Vaikuntha Ekadashi: ముక్కోటి ఏకాదశి వేళ.. తెలంగాణలోని దేవాలయాలకు పోటెత్తిన భక్త జనం
ABN , Publish Date - Dec 30 , 2025 | 08:46 AM
ఈ రోజు మంగళవారం ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణలో ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, సెలబ్రెటీలు వివిధ క్షేత్రాలను సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు(మంగళవారం) ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు వివిధ ఆలయాలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. భద్రాచలం (దక్షిణ అయోద్య) రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారు జామున స్వామివారు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిచ్చారు. గరుడ వాహనంపై శ్రీ రాముడు,గజ వాహనం పై సీతమ్మ,హనుమద వాహనంపై లక్ష్మణ స్వామి దర్శనమిచ్చారు. ఈ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొని స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
వనపర్తి జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం ఇచ్చిన లక్ష్మీ నరసింహ స్వామి వారిని చూడటానికి భారీగా భక్త జనం తరలి వచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, కలెక్టర్ హనుమంతరావు, ఈవో వెంకట్రావు తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా దర్శనమిస్తున్న వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. ముఖ్యంగా వరంగల్ బట్టల బజార్, వందపీట్ల రోడ్డులోని వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ధర్మసాగర్ మండలం చిల్పూర్ బుగులు వేంకటేశ్వరస్వామి, నర్సింహులపేట వేంకటేశ్వరస్వామి ఆలయాలు సహా పలు ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ సమెత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.
జగిత్యాల జిల్లాలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది.. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే నాలుగు అమలుచేశాం. మరో రెండు గ్యారెంటీలను అమలు చేసే శక్తిని ప్రభుత్వానికి ఇవ్వాలని స్వామివారిని వేడుకున్న..రానున్న గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తాం...మాస్టర్ ప్లాన్‌తో ధర్మపురిని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దుతాం’ అని అన్నారు.
ఖమ్మం జిల్లాలో జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచి పలు వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ మొదలైంది. 400 ఏళ్ల చరిత్ర కలిగిన జియాగూడ రంగనాథ స్వామి ఆలయానికి భక్తులు తరలి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు మొదలయ్యాయి. ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటు న్నారు భక్తులు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘ఓం నమో నారాయణాయ’ నామస్మరణ మారుమోగుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News