Tirumala: అక్కడ.. సకలం ఉచితమే!
ABN , Publish Date - Sep 21 , 2025 | 10:52 AM
సంపన్నులతో వేలూ లక్షలూ ఖర్చుపెట్టించే తిరుమల వెంకన్న, పేదలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా తన దర్శనం చేసుకునే అవకాశం కల్పించాడు. తిరుపతికి చేరుకున్న భక్తులు చేతిలో పైసా లేకపోయినా సలక్షణంగా తిరుమలకు చేరుకుని స్వామి దర్శనం చేసుకోవచ్చు.
సంపన్నులతో వేలూ లక్షలూ ఖర్చుపెట్టించే తిరుమల వెంకన్న, పేదలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా తన దర్శనం చేసుకునే అవకాశం కల్పించాడు. తిరుపతికి చేరుకున్న భక్తులు చేతిలో పైసా లేకపోయినా సలక్షణంగా తిరుమలకు చేరుకుని స్వామి దర్శనం చేసుకోవచ్చు. అందుకు తగిన ఏర్పాట్లు టీటీడీ చేసింది. అదెలాగంటే..
- తిరుపతి రైల్వేస్టేషన్‌లో, బస్టాండ్‌లో దిగిన భక్తులు కాలినడక దారులైన అలిపిరి, శ్రీవారి మెట్టు ప్రాంతాలకు చేరుకోవడానికి ధర్మరథాలు పేరుతో ఉచిత బస్సులు సిద్ధంగా ఉంటాయి. వేకువజాము 5గంటల నుంచి రాత్రి 7గంటల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి.
- నడకమార్గాల్లో భక్తులు లగేజీని మోసుకెళ్లే అవసరం లేకుండా అక్కడి కౌంటర్లలో డిపాజిట్ చేస్తే చాలు తిరుమలకు ఉచితంగా చేరుస్తారు.
- తిరుమలకు చేరుకున్న తర్వాత ఎక్కడికి చేరుకోవాలన్నా ఉచిత బస్సులు ఉంటాయి. 12 ఎలక్ర్టిక్ బస్సులు 24 గంటలూ తిరుమలోని అనేక ప్రాంతాలకు భక్తులను చేరవేస్తుంటాయి.

- వయోవృద్ధులు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు ఆలయం వద్దకు వెళ్లేందుకు, తిరిగి బస్టాండ్ వద్దకు చేరుకు నేందుకు 8 బ్యాటరీ వాహనాలు అందుబాటులో ఉంటాయి.
- తిరుమలలో ఉచిత వసతి కోసం లాకర్లు, మరుగుదొడ్లు, స్నానపుగదులతో కూడిన ఐదు యాత్రికుల వసతి సముదాయాలున్నాయి. 40 వేల మంది భక్తులకు ఇవి వసతిని కల్పిస్తున్నాయి.
- భక్తులు తాత్కాలికంగా బస చేసేందుకు వివిధ ప్రాంతాల్లో మూడు భారీ రేకుల షెడ్లు అందుబాటులో ఉన్నాయి.
- వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనంలోని నాలుగు హాళ్ల ద్వారా ఒకేసారి 4 వేల మంది భక్తులు భోజనం చేయవచ్చు.

- రాంభగీచా, వీజీవో ఆఫీస్ ఎదురు, కల్యాణిసత్రం, ఏఎన్సీ ప్రాంతాల్లో కూడా సాంబారన్నం, ఉప్మా, పొంగలి వంటి ప్రసాదాలను నిత్యం ఉచితంగా భక్తులకు పంపిణీ చేస్తుంటారు.
- యాత్రికుల వసతి సముదాయం 4, 2లో 10 వేల మందికి రోజూ అన్నప్రసాదాలు అందిస్తున్నారు.
- శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో ఉండే భక్తులకు, కంపార్టుమెంట్లలోని భక్తులకూ అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు ఉచితంగా ఇస్తుంటారు.
- తిరుపతిలోని స్విమ్స్, రుయా, ఆయుర్వేదిక్ ఆస్పత్రులకు వచ్చే రోగులకు కూడా అన్నప్రసాదాలను ఉచితంగా అందిస్తూ ఉంటారు.
- ప్రతిరోజు తిరుమలేశుడుని 70 వేల నుంచి 80 వేల మంది దర్శించుకుంటారు. వారాంతాలు, విశేష పర్వదినాలు, ఉత్సవాల సమయంలో ఈ సంఖ్య లక్ష వరకు చేరుతుంది. వీరిలో 70 శాతం మంది ఉచిత దర్శన భక్తులే గమనార్హం.

- తిరుపతికి చేరుకునే భక్తులకు శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌ల్లో స్లాటెడ్ సర్వదర్శనం(ఎస్‌ఎస్‌డీ) టోకెన్లను దాదాపు 15 వేల నుంచి 20 వేల మందికి రోజూ జారీ చేస్తున్నారు. ఇవి పూర్తిగా ఉచితం.
- ఎలాంటి టికెట్లు, టోకెన్లు లేని దాదాపు 30 వేల మంది నేరుగా తిరుమలకు చేరుకుని స్వామిని దర్శించుకుంటున్నారు.
- శ్రీవారిమెట్టు కాలినడక మార్గంలో వచ్చే 3వేల మందికి దివ్యదర్శన టోకెన్లు కూడా ఉచితమే.
- ప్రతిరోజు వెయ్యి మంది దివ్యాంగులు, వృద్ధులు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న భక్తులకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా ఉచిత దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నారు.
- ఏడాదిలోపు చంటిబిడ్డలున్న వెయ్యి మంది తల్లిదండ్రులు కూడా సుపథం నుంచి స్వామిని ఉచితంగా దర్శించుకోవచ్చు.
- స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ ఓ లడ్డూ ఉచితంగా లభిస్తుంది. దర్శనం పూర్తిచేసుకుని బయటకు వచ్చేవారికి ప్రసాదాలు కప్పుల్లో ఉచితంగా అందజేస్తారు.
- తలనీలాలు సమర్పించేందుకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
- సెల్‌ఫోన్లు, లగేజీ, ఎలక్ర్టికల్ వస్తువులనూ ఉచితంగానే భద్రపరుచుకోవచ్చు.
- తిరుమలలో భక్తులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే అశ్విని ఆసుపత్రిలో ఉచితంగానే వైద్యసేవలు అందుతాయి.
- దర్శనం కోసం వేచిఉండే వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2 కంపార్టుమెంట్లలో భక్తులకు అందుబాటులో నిరంతరం రెండు డిస్పెన్సరీలు ఉంటాయి.
- అలిపిరి కాలినడకమార్గంలో, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి ప్రాంతాల్లో ఈసీజీ, డీ ఫిబ్‌రిలేటర్ వంటి పరికరాలు, స్ట్రెచర్లు ఉన్న డిస్పెన్సరీలు అందుబాటులో ఉంటాయి.
- ఐదు టీటీడీ అంబులెన్స్‌లతో పాటు మరో ఐదు 108 అంబులెన్సులు తిరుమల, అలిపిరి, ఘాట్‌రోడ్లలో నిరంతరం అందుబాటులో ఉంటాయి.
- తిరుమల దర్శనానికి వచ్చి ఎవరైనా చనిపోతే మృతదేహాలను స్వంత ప్రాంతాలకు ఉచితంగానే చేరవేస్తారు. ఇందుకోసం 5 మార్చురీ వ్యాన్లు అందుబాటులో ఉంచారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News and National News