Share News

Tirumala: 207 గ్రాముల బంగారు ఆభరణాలతోనే తొలి బ్రహ్మోత్సవం

ABN , Publish Date - Sep 21 , 2025 | 06:57 AM

తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా వివిధ వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులు కిలోల కొద్దీ బంగారు, వజ్ర ఆభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంటారు.

Tirumala: 207 గ్రాముల బంగారు ఆభరణాలతోనే తొలి బ్రహ్మోత్సవం

తిరుపతి: తిరుమల శ్రీవేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. ఇందులో ప్రధానంగా వివిధ వాహనాలపై ఊరేగే ఉత్సవమూర్తులు కిలోల కొద్దీ బంగారు, వజ్ర ఆభరణాలతో శోభాయమానంగా దర్శనమిస్తుంటారు. కానీ చరిత్ర చెబుతున్న విషయాల ఆధారంగా క్రీ.శ 966లో జరిగిన తొలి బ్రహ్మోత్సవంలో కేవలం 47 కళంజులు (దాదాపు 207 గ్రాములు) బంగారు ఆభరణాలతో మాత్రమే శ్రీవారు దర్శనమిచ్చారు. ఈ ఏడాదిలోనే మనవాళ పెరుమాళ్‌ (భోగ శ్రీనివాసమూర్తి) విగ్రహాన్ని తొలిగా శ్రీవారి ఆలయంలో శాస్ర్తోక్తంగా ప్రతిష్టించారు.


ఈ కార్యం శ్రీవారి ఆలయ చరిత్రకు వెలకట్టలేని ఆధ్యాత్మిక విలువను జోడించింది. ప్రతిష్ట సమయంలో వజ్రాలు, ముత్యాలు, మాణిక్యాలతో తయారు చేసిన తిరుముడి (కిరీటం), కర్ణాభరణాలు సహా విలువైన రత్నాలతో చేయించిన వేళ్లభూషణాలు, చేతికడియాలు, వంకీలతో అలంకరించారు. వీటిని దాదాపు 47 కళంజులు బంగారంతో తయారు చేయించారట. ఈ ఆభరణాలతోనే తొలి పురటాసి బ్రహ్మోత్సవం జరిగిందని చరిత్రకారుల మాట. 966 ఆగస్టు 27న తమిళ మాసం ఆవణి 21వ తేదీ చిత్త నక్షత్రం రోజున ఆరంభమై తొమ్మిదిరోజుల పాటు ‘పురటాసి బ్రహ్మోత్సవం’ జరిగింది. ఇదే మొదటి పురటాసి బ్రహ్మోత్సవం.


పూర్వం ఆలయంలోనే అఖిలాండం

అఖండం అంటే స్వామివారికి కొబ్బరికాయ కొట్టే స్థలమని అర్థం. దీనినే గరుడ గంభం అని కూడా పిలుస్తారు. పూర్వం ఆలయంలో ఉన్న అఖండం దశలవారిగా బేడి అంజనేయస్వామి గుడివద్దకు చేరింది. 50ఏళ్ల క్రితం వరకు ఆలయంలోని గరుడాళ్వార్‌ సన్నిధి వెనుక భాగాన అఖండం ఉండేది. అంటే వెండివాకిలి దాటగానే అఖండం కనిపించేదన్నమాట. కాలక్రమేణ అఖండం అఖిలాండంగా మారింది. పూర్వం కేరళకు చెందిన భక్తుడు ప్రతి ఏటా ఆరడుగుల దీపస్తంభాలను ఆలయానికి బహుకరించేవాడు.


book1.2.jpg

భక్తుల రద్దీకి అనుగుణంగా వెండివాకిలికి వెలుపల (అన్నప్రసాదాలు వితరణ చేసే ప్రదేశం)కు తరలించారు. అటు నుంచి బలిపీఠం, ఆలయం వెలుపల, గొల్లమండపం వద్దకు మారుస్తూ వచ్చారు. ఆ తర్వాత కూడా భక్తుల రద్దీ అధికమవటం, కొబ్బరికాయలు, కర్పూరం వెలిగించటానికి భక్తులు ఆలయంలోనే నిలబడి పోవటంతో టీటీడీ అధికారులకు సమస్యగా మారింది. ఈ క్రమంలోనే 2003లో ఏర్పాటు చేసిన మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా అఖిలాండాన్ని బేడి ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణానికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..

సంక్షేమమా సంక్షోభమా

Read Latest Telangana News and National News

Updated Date - Sep 21 , 2025 | 06:57 AM