Tirumala: కట్టెల పొయ్యి మీదే స్వామికి ప్రసాదాలు
ABN , Publish Date - Sep 21 , 2025 | 10:30 AM
తిరుమల వెంకన్నకి రోజూ షడ్రసోపేతమైన ఆహారపదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషకవిలువలు మెండుగా ఉన్నవే. ఆయుర్వేదపరంగా అత్యంత ఆరోగ్యకరమైనవే. దాదాపు 50 రకాలైన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు.
తిరుపతి: తిరుమల వెంకన్నకి రోజూ షడ్రసోపేతమైన ఆహారపదార్థాలే నైవేద్యంగా పెడతారు. ఇవన్నీ పోషకవిలువలు మెండుగా ఉన్నవే. ఆయుర్వేదపరంగా అత్యంత ఆరోగ్యకరమైనవే. దాదాపు 50 రకాలైన నైవేద్యాలను స్వామికి సమర్పిస్తారు. విశేషం ఏమిటంటే.. టీటీడీ అన్నదాన సత్రంలోని వంటశాలలోనూ, లడ్డూ పోటులోనూ ఆధునిక టెక్నాలజీ వాడుతున్నా శ్రీవారికి నివేదించే ప్రసాదాలను మాత్రం ఇప్పటికీ కట్టెల పొయ్యిమీదే తయారు చేయడం.
గర్భాలయ బంగారువాకిలికి ఆగ్నేయ దిశగా పోటు (వంటశాల) ఉంది. దీన్నే ‘పడిపోటు’ అని పిలుస్తారు. గోవిందుడి తల్లి వకుళమాత ఈ వంటశాలను పర్యవేక్షిస్తుందని చెబుతారు. అందుకే ఇక్కడ వకుళమాత విగ్రహం ఉంటుంది.

ఆమెకు పూజచేసి అర్థరాత్రి 12.30 గంటల నుంచి వంటలు మొదలు పెడతారు. శ్రీవైష్ణవులు మాత్రమే ప్రసాద తయారీలో భాగస్వాములవుతారు. ప్రస్తుతం 70 మంది శ్రీవైష్ణవులు రెండు బ్యాచ్‌లుగా పనిచేస్తున్నారు. పోటులో 10 కట్టెల పొయ్యిలున్నాయి. మొదటి గంట, రెండవ గంట, మూడవ గంట అని మూడు కాలాల్లో స్వామికి నైవేద్యాలను సమర్పిస్తారు. వేకువజామున 5 గంటలకే తొలి గంటకు సమర్పించే నైవేద్యం సిద్ధం అవుతుంది. వండిన ప్రసాదాలను ఇత్తడి గంగాళాల్లో గర్భాలయానికి తీసుకెళ్లి స్వామికి నివేదిస్తారు. 50 రకాల వంటకాలను స్వామికి నివేదిస్తారు. రోజుకి 120 గంగాళాల ప్రసాదాలను తయారుచేసి స్వామికి నివేదించిన తర్వాత దర్శనం చేసుకుని బయటకు వచ్చే భక్తులకు ఆకు దొన్నెల్లో పంచిపెడతారు.

మొదటి గంట ఉదయం 5.30: మీగడ, వెన్న, పెరుగుతో చేసే మా ‘మాతృ దద్యోధనం’ స్వామికి సమర్పిస్తారు. మాత్రన్నం (వెన్న, ఇంగువ, ఉప్పుతో చేసినప్రసాదం), శుద్దన్నం, చక్కెర పొంగలి, ఉప్పుపొంగలి, పులిహోర, కదంబం, దద్యోధనం కూడా ఈ సమయంలో స్వామికి నివేదిస్తారు.
ఉదయం 9.45 గంటలకు అష్టోత్తరశత నామార్చన సమయంలో శుద్ధన్నం, సిరా నివేదిస్తారు.
రెండో గంట ఉదయం 10.00: నాదూకం, లడ్డూ, దోశ, వడ, అప్పం
నివేదిస్తారు. వీటితో పాటూ సేకరాబాత్ పెడతారు.
మూడో గంట రాత్రి 7.30: మరీచాన్నం
(

మలహోర), ఉడాన్నం (బెల్లం పొంగలి), కదంబం, శుద్దన్నం, దద్యోధనం, పులిహోర, అమ్మవారి పాయసం (పలచగా వుండే చక్కెర పొంగలి), తోమాల దోసె, సీరాలను నివేదిస్తారు.
రాత్రి విశ్రాంతి సమయంలో పాయసాన్నం నివేదిస్తారు. పడుకోబోయే ముందు.. డ్రై ప్రూట్స్, పాలు, పండ్లు సమర్పిస్తారు.
- ఇవిగాక సేవలతో పాటూ రకరకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పిస్తారు. సుప్రభాత సమయంలో నవనీతం,
గోక్షీరంతో తయారు చేసిన పదార్ధాలను స్వామికి నివేదిస్తారు. తోమాలసేవ
తరువాత నల్ల నువ్వులు, బెల్లంతో చేసిన ‘కొలువు పిండి ప్రసాదం’ నివేదిస్తారు.

- ఆదివారం నాడు బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో ప్రత్యేకంగా తయారు చేసే అమృత కలశం ప్రసాదంగా పెడతారు. పానకం సమర్పిస్తారు.
- మంగళవారం అష్టదళం తర్వాత సిరా, వడపప్పు, పానకం సమర్పిస్తారు.
- గురువారం తిరుప్పావడలో పులిహోర, పిట్టు, జిలేబీ, మురుకులను నైవేద్యంగా పెడతారు. రెండు గంగాళాల పాయసాన్ని కూడా నివేదిస్తారు. పానకం సమర్పిస్తారు.
- శుక్రవారం అభిషేకం తర్వాత బెల్లంపాయసం, పోలీలు, పానకం
నివేదిస్తారు.
- వారపు సేవల్లో జిలేబీ, మురుకు, వడ వంటి ప్రసాదాలను నివేదిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News and National News