Karthika Masa Shivaratri: కుటుంబంలో కలహాలు తొలగాలంటే.. ఈ రోజు..
ABN , Publish Date - Nov 16 , 2025 | 03:20 PM
కార్తీక మాసం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. అలాంటి వేళ.. ఈ మాసంలో వచ్చే కార్తీక మాస శివరాత్రి రోజు.. పరమశివుడిని ఇలా పూజిస్తే చాలా మంచిదని పండితులు వివరిస్తున్నారు.
ప్రతినెల అమావాస్య ముందు రోజు వచ్చే చతుర్థశి తిథిని మాస శివరాత్రిగా భక్తులు జరుపుకుంటారు. ఈ మాస శివరాత్రికి చాలా ప్రాముఖ్యం ఉంది. కార్తీకమాసంలో వచ్చే మాస శివరాత్రి అత్యంత మహిమాన్వితమైందని భక్తులు భావిస్తారు. ఈ ఏడాది కార్తీక మాసంలో మాసశివరాత్రి మంగళవారం అంటే.. నవంబర్ 18వ తేదీన వచ్చింది. ఈ రోజున పాటించాల్సిన విధులు..
ఈ మాస శివరాత్రి.. ఈ అభిషేకాలు..
ఈ రోజు.. ఉదయం శివపూజ చేసి పగలంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం ప్రదోషకాలం సమయంలో ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేయాలి. లేకుంటే పరమ శివుడుని పూజించాలి. అన్నాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని.. ఆహారాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తే పరమ శివుడి అనుగ్రహం తప్పక లభిస్తుందని పండితులు చెబుతారు.
ఈ రోజు శివునికి అభిషేకం చేసినా మంచిదని అంటారు. స్వామి వారికి దర్భలతో కలిపిన నీటితో అభిషేకం చేయాలి. అలాగే పంచామృతాలు, పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు, విభూది జలాలతో అభిషేకం చేసినా మంచిదని అంటున్నారు.
శత్రుబాధలు తొలగిపోవాలంటే మాత్రం మాస శివరాత్రి రోజు.. ఖర్జూర పండ్ల రసంతో శివలింగానికి అభిషేకం చేయాలని చెబుతారు.
ఇక పనుల్లో ఆటంకాలు తొలగిపోవాలంటే ద్రాక్ష పండ్ల రసంతో మహా శివునికి అభిషేకం చేయాలి.
జాతకంలో నవగ్రహాలు అనుకూలించాలంటే బొప్పాయి పండ్ల రసంతో అభిషేకం చేయాలి.
మనశ్శాంతి కోసం వెన్నతో అభిషేకం చేయాలి
మహిళలకు దీర్ఘసుమంగళి యోగం కోసం ఈ రోజు.. శివలింగంపై రాళ్లఉప్పు ఉంచి నమస్కారం చేయాలని సూచిస్తున్నారు.
ఈ రోజు స్వామి వారిని..
ఈ మాస శివరాత్రి రోజు.. పరమేశ్వరుడిని జిల్లేడు పూజలతో పూజించాలని చెబుతున్నారు.
నాగశివలింగ పుష్పాన్ని (సహస్ర ఫణి పువ్వు) శివుని వద్ద ఉంచి నమస్కరించాలని సూచిస్తున్నారు. లేకుంటే జిల్లేడు పూలు, ఎర్ర మందారాలతో ఆయన్ని పూజించాలని చెబుతున్నారు.
ఈ రోజు శివునికి కొబ్బరి ముక్కలు, అరటి పండ్లు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరం నైవేద్యంగా పట్టాలని సూచిస్తున్నారు. అలాగే శివుడికి పంచ సౌగంధికాలను తాంబూలంగా సమర్పించాలని అంటున్నారు. అంటే.. తమలపాకులో వక్కలు ఉంచి జాజికాయ, జాపత్రి, యాలకలు, దాల్చిన చెక్క, లవంగాలను తాంబూలంగా సమర్పించాలి. ఆ తర్వాత దానిని స్వీకరించాలని సూచిస్తున్నారు.
ఈ రోజు చదవాల్సిన మంత్రాలు..
శ్రీ శివాయ.. మహాదేవాయ.. ఐశ్వర్వేశ్వరాయ నమ:,
శ్రీం శివాయ నమ:
గ్రహ, నక్షత్ర దోషాలు పోవాలంటే..
‘ఓం నమో భగవతే రుద్రాయ’ మంత్రాన్ని చదువుతూ.. శివునికి అభిషేకం చేయాలి.
ఈ హారతిని దర్శించుకుంటే..
మాస శివరాత్రి రోజు పరమ శివునికి నంది హారతి, నాగ హారతి ఇస్తారు. వీటిని దర్శించుకోవాలని సూచిస్తున్నారు.
కుటుంబంలో మనశ్శాంతి కోసం..
కుటుంబంలో మనశ్శాంతి లభించాలంటే.. కలహాలు తొలగిపోవాలంటే.. ఈ రోజు సాయంత్రం కొబ్బరినూనెతో దీపం వెలిగించాలి.
గమనిక.. పై వివరాలను కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. వీటిని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
ఈ వార్తలు కూడా చదవండి..
కుటుంబంలో కలహాలు తొలగాలంటే.. ఈ రోజు..
మళ్లీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టులు మృతి
For More Devotional News And Telugu News