Dasara Navaratri: నవరాత్రులు.. అమ్మవారికి నైవేద్యాలు..
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:04 AM
ఈ ఏడాది దసరా నవరాత్రులు10 రోజుల పాటు జరగనున్నాయి. 11వ రోజు దసరా పండగ జరుపుకోనున్నారు. ఈ నవరాత్రుల వేళ.. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారికి పలు రకాల నైవేద్యాలను భక్తులు సమర్పించనున్నారు.
శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ ఈ నవరాత్రుల వేళ.. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అలాంటి వేళ.. అమ్మ వారిని దర్శించుకుంటే శుభాలు కలుగుతాయంటారు. ప్రతి ఏటా నవరాత్రులు తొమ్మిది రోజులు పాటు జరుపుతారు. కానీ ఈ ఏడాది పది రోజులు జరగనున్నాయి. 11వ రోజు దసరా పండగా జరుపుకోనున్నారు. అయితే ఈ నవ రాత్రుల వేళ అమ్మవారికి ఏ రోజు ఏ ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారంటే..
శ్రీబాలా త్రిపుర సుందరి దేవి
తొలి రోజు.. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారు.. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను శాసించే శక్తిగా భావిస్తారు. అమ్మవారు 16 ఏళ్ల బాలిక రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారికి పులిహోరను ప్రసాదంగా సమర్పిస్తారు. అలాగే శనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు.
శ్రీగాయత్రి దేవి అలంకారం..
రెండో రోజు గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారు.. జ్ఞానానికి, శ్రేయస్సుకు, శాంతికి ప్రతీకగా భావిస్తారు. ఈ అవతారంలో అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే పాలు, తేనె, నెయ్యితో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెడతారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పించడం అనవాయితీగా వస్తుంది.
శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం..
మూడో రోజు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారు.. శక్తి, సంపదతోపాటు ఆహారానికి ప్రతీకగా భావిస్తారు. అమ్మ వారికి కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే అన్నం, నెయ్యి, కూరగాయలతో చేసిన భోజనం, లడ్డూ, గారెలు, పులిహోర నైవేద్యంగా పెడతారు.
శ్రీకాత్యాయనీ దేవి అలంకారం..
నాలుగో రోజు.. శ్రీకాత్యాయనీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారు తేజోవంతంగా ఉంటారు. అమ్మవారికి బెల్లం పొంగలి, దద్దోజనం, గారెలు, లడ్డూ, పులిహోర నేవైద్యంగా పెడతారు.
శ్రీమహాలక్ష్మీ దేవి అలంకారం..
ఐదో రోజు శ్రీమహాలక్ష్మీ దేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు సంపద, శాంతి, శుభాలకు ప్రతీక. అమ్మవారికి గారెలు నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే క్షీరాన్నం, పాయసం, పులిహోర అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
శ్రీలలిత త్రిపుర సుందరి దేవి అలంకారం..
ఆరో రోజు.. శ్రీలలితా త్రిపుర సుందరి దేవి రూపంలో అమ్మవార భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని పూజించడం ద్వారా శక్తి, ధనం, జ్ఞానం, సంతోషం, సంతానం కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆమెకు దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తారు. అలాగే పాయసం, లడ్డూలు, గారెలు, బెల్లం పొంగలి, వడపప్పు కూడా నైవేద్యంగా పెడతారు.
శ్రీ మహా చండీదేవి అలంకారం..
ఏడో రోజు.. శ్రీ మహా చండీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. దుర్గమ్మ ఉగ్ర రూపాల్లో ఈ రూపం ఒకటని చెబుతారు. ఈ రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల శత్రువుల నుంచి రక్షణ, విజయం లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. అమ్మవారికి బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. దద్దోజనం, వడపప్పు కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
శ్రీసరస్వతీ దేవి అలంకారం..
ఎనిమిదో రోజు.. శ్రీసరస్వతి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని పూజించడం వల్ల జ్జానం, విద్య, కళలు, సంగీతం పొందుతారని విశ్వసిస్తారు. అమ్మవారికి పాయసం, పెసరట్టు, వడపప్పు, దద్దోజనం, బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు.
శ్రీదుర్గాదేవి అలంకారం..
తొమ్మిదో రోజు.. శ్రీ దుర్గాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ రూపంలో అమ్మవారికి కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు. పులిహోర, దద్దోజనం, పాయసం, వడపప్పు నైవేద్యంగా పెడతారు.
శ్రీమహిషాసుమర్దిని దేవి అలంకారం..
పదవ రోజు.. శ్రీమహిషాసుమర్దిని దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి చలిమిడి, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తారు. పాయసం, పులిహోర, దద్దోజనం కూడా నైవేద్యంగా పెడతారు.
శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం..
పదకొండో రోజు.. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.ఈ రూపంలో అమ్మవారికి పూర్ణాలు నైవేద్యంగా సమర్పిస్తారు. పాయసం, పులిహోర, వడపప్పు, దద్దోజనం, బెల్లం పొంగలిని నైవేద్యంగా పెడతారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. ఎప్పటి నుంచి అంటే..
దసరాతో దశ తిరగనున్న రాశులు ఇవే..
For More Devotional News And Telugu News