Amarnath Yatra 2025: ఆకాశాన్ని తాకే మంచుకొండల్లో శివయ్య దర్శనం.. అమర్‌నాథ్ యాత్ర మొదలు!
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:54 PM
Amarnath Yatra 2025: హిమాలయ పర్వతసానువుల్లో మంచులింగ రూపంలో కొలువై ఉన్న ఆదిదేవుని దర్శనభాగ్యం కోసం తహతహలాడతారు భక్తులు. దేశవిదేశీయులు ఏటా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఇవాళ ప్రారంభమైంది.
Amarnath Yatra 2025: ఆధ్యాత్మికతకు, ప్రకృతి సోయగాలకు పుట్టినిల్లు హిమాలయాలు. పరమేశ్వరుడు సతీసమేతంగా నివసించే కైలాసపర్వతం ఉండే ఈ పర్వతశ్రేణుల్లోనే ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. హిందువులు, బౌద్ధులు, జైనులు ఇలా ఎందరికో పవిత్ర ప్రాంతమైన ఈ తెల్లని మంచు కొండల్లో ఏటా ఉద్భవించే అద్భుతం కోసం ఆత్రుతగా వేచిచూస్తారు భక్తులు. సంవత్సరంలో కొన్ని రోజుల మాత్రమే మంచు రూపంలో కనువిందు చేసే శివయ్యను దర్శించుకునేందుకు అత్యంత సాహసోపేతమైన అమర్‌నాథ్ యాత్ర చేయాలని ఆరాటపడతారు. దేశవిదేశీ యాత్రికులు ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూసే పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఇవాళ ఆరంభమైంది.
జమ్మూకశ్మీర్‌లోని హిమాలయ పర్వతాలలో 17 వేల అడుగుల ఎత్తులో ఉన్న పవిత్ర అమర్‌నాథ్ గుహ భక్తుల కోసం తెరచుకుంది. ఏడాదంతా మంచుతో కప్పబడి ఉండే ఈ దివ్యధామాన్ని ఇవాళ్టి (జులై3) నుంచి ఆగస్టు 9 వరకూ భక్తులు మనసారా వీక్షించవచ్చు. 38 రోజుల పాటు సాగనున్న ఈ పవిత్ర యాత్రను బుధవారం జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. జమ్మూలోని భగవతి నగర్‌లోని యాత్ర బేస్ క్యాంప్ నుంచి 5,892 మంది యాత్రికులతో కూడిన మొదటి బ్యాచ్ బయల్దేరింది. దక్షిణ కాశ్మీర్ అనంత్‌నాగ్‌లోని పహల్గామ్ నున్వాన్ బేస్ క్యాంప్, మధ్య కాశ్మీర్ గండేర్‌బాల్‌లోని సోనామార్గ్ ప్రాంతంలో ఉన్న బాల్టాల్ బేస్ క్యాంప్ నుంచి పురుషులు, మహిళలు, సాధువులతో సహా యాత్రికుల బృందాలు తెల్లవారుజామున బయలుదేరాయని అధికారులు తెలిపారు. యాత్ర సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.
దక్షిణ కశ్మీర్‌లోని శ్రీనగర్‌కు 141 కిలోమీటర్ల దూరంలో ఉండే అమర్‌నాథ్ గుహ సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో ఉంది. లిడ్డర్ వ్యాలీకి చివరన ఇరుకైన లోయలో ఉండే ఈ గుహను యాత్రికులు రెండు మార్గాల్లో చేరుకోవచ్చు. పహల్గాం నుంచి 46 కి.మీ లేదా బాల్‌తాళ్ నుంచి 14 కిలోమీటర్లు కాలినడకన లేదా గుర్రాల మీదుగా కఠినమైన దారుల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. పహల్గాం నుంచి అమర్‌నాథ్‌కు చేరుకునేందుకు యాత్రికులకు 5 రోజుల సమయం పడుతుంది. అదే బాల్‌తాళ్ మార్గం గుండా వెళితే కేవలం 14 లేదా 16 కి.మీ దూరమే ఉంటుంది. కేవలం 1-2 రోజుల్లోనే గమ్యా్న్ని చేరుకోవచ్చు. కానీ, ఇది అత్యంత ప్రమాదకరమైన బాట కావడంతో అన్ని వయసుల వారూ ఈ మార్గంలో వెళ్లలేరు
ఇవి కూడా చదవండి
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి