Tirumala: తిరుమలలో.. వెయ్యేళ్ళ వైభవం
ABN , Publish Date - Sep 21 , 2025 | 07:25 AM
శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఇంతటి వైభవాన్ని సంతరించుకోవడం వెనుక అనేకమంది రాజుల, రాణుల పాత్ర ఉంది. దీపాల వెలుగుల మొదలు స్వామికి సమర్పించే పూలూ, నైవేద్యం దాకా లోటు లేకుండా కొనసాగడానికి వెయ్యేళ్లుగా ఎందరో చేసిన దానధర్మాలే కారణం.
తిరుమల: శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం ఇంతటి వైభవాన్ని సంతరించుకోవడం వెనుక అనేకమంది రాజుల, రాణుల పాత్ర ఉంది. దీపాల వెలుగుల మొదలు స్వామికి సమర్పించే పూలూ, నైవేద్యం దాకా లోటు లేకుండా కొనసాగడానికి వెయ్యేళ్లుగా ఎందరో చేసిన దానధర్మాలే కారణం. ఆలయంలో దీపాల కోసమే 7వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు దాదాపు 40 సార్లు పలువురు కానుకలు ఇచ్చినట్టు శాసనాల్లో ఉంది. తిరుమల ఆలయంలో దీపాలు ఆరిపోవడాన్ని అరిష్టంగా భావించేవారు. అలా ఆరిపోయిన సందర్భాల్లో విచారణ జరిపి, కారకులైన వారికి కఠిన శిక్షలు కూడా విధించినట్టు ఆధారాలు లభించాయి. తిరుమల ఆలయంలో దీపాల బాధ్యతను తిరుముండియం గ్రామానికి చెందిన సభాయ్యులు వహించేవారని 1013 నాటి ఒక శాసనం ద్వారా తెలుస్తోంది. ఆలయంలో రోజూ 24 నూనె దీపాలు, ఒక కర్పూర దీపం వెలిగించాల్సి ఉండేది. గర్భ గృహంలో మాత్రం దీపాలు నూనెతో కాకుండా నెయ్యితో వెలిగించేవారు. నేటికీ అంగరంగ వైభవంగా కొనసాగుతున్న పురటాసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించింది పల్లవరాణి సామవై.
ఇక నైవేద్యాలుగా అన్నం, పాలు, పెరుగు, పాయసం, అప్పాలు వంటివి నిరంతరాయంగా కొనసాగడానికి యాదవరాయుల కాలంలో పలు గ్రామాలను దానంగా ఇచ్చారు. పుష్పార్చన కోసమూ కానుకలిచ్చినవారు చాలామందే ఉన్నట్టు శాసనాలు చెబుతున్నాయి. తిరుమలలో సహజసిద్ధంగా పూలు లభించినా, పూజలకు అనుకూలంగా ఉండకపోవడంతో ప్రత్యేక ఉద్యాన వనాలు ఏర్పాటు చేశారు. కొన్ని ఉద్యానవనాల్లో మండపాలు నిర్మించి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి తిరువోలక్కం పేరుతో అర్చన, నైవేద్యం, భక్తులకు ప్రసాద వితరణ చేసినట్టు ఆధారాలున్నాయి.
- 614లో పల్లవ రాజకుమార్తె సామవాయి ఆలయంలో వెండి విగ్రహాన్ని ప్రతిష్టించి దానికి ‘మానవాళపెరుమాళ్’ అని నామకరణం చేశారు.
- 830లో పల్లవరాజు వియదంటి విక్రమదేవుని కాలంలో సొలనూరు ఉలగప్పెరుమనూరు అనే దాత 30 కళంజుల బంగారాన్ని విరాళంగా అందజేసి ఆలయంలోని దీపం ఆరకుండా వెలిగేలా ఏర్పాట్లు చేశారు.
- బాణరాజు విజయాదిత్య మహావళి ఒక విగ్రహాన్ని ప్రతిష్టించి, ఆలయంలోని ముగ్గురు దేవతలకు రోజూ నైవేద్యాలు పెట్టాలని కోరారు.

- 830-850 శాసనం ప్రకారం బాణ రాజు విజయాదిత్యుడు తిరువెంగడమల దేవునికి నిరంతర దీపారాధన కోసం ధనం దానం చేశాడు. రోజూ ఒక నిండా విలక్కు (నిత్యం దీపం) వెలిగించమని ఆ దానం ద్వారా కోరారు.
- 927-936 మధ్య చోళుల కాలంలో ఓ భక్తుడు 40 కళంజుల బంగారాన్ని (176 నుంచి 208 గ్రాములు) ఆలయానికి దానం చేశాడు.
- 1001లో చోళరాణి పరిణకదేవి శ్రీవారి ఆలంకారం కోసం బంగారు పట్టు, వజ్రాలు, మాణిక్యాలు, ముత్యాలు కలిపి చేసిన ఆభరణాన్ని సమర్పించింది.
- 1256లో పాండ్యరాజు జటావర్మ సుందర పాండ్యుడు శ్రీవారి ఆలయ గోపుర విమానంపై బంగారు కలశం ప్రతిష్టించాడు. యాదవరాయులు, చోళులు కూడా గోపుర నిర్మాణాలు, బంగారు కవచం సమకూర్చారు.
- 13వ శతాబ్దం నుంచి తిరుమల, తిరుపతిలో ఆళ్వార్ల విగ్రహాలను ప్రతిష్టించారు.
ఘనంగా ఏర్పాట్లు
బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశాం. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు స్వామివారి వైభవాన్ని మరింత వ్యాప్తిచేసేలా అధికారబృందంతో సమన్వయం చేసుకుని, పటిష్ట ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో ఎన్నడూలేని విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం. భక్తులను ఆకట్టుకునేలా పూల, విద్యుత్ అలంకరణ చేస్తున్నాం.
- బీఆర్ నాయుడు, చైర్మన్, టీటీడీ బోర్డు
కన్నులపండువగా నిర్వహణ...
శ్రీవారి బ్రహ్మోత్సవాలను కన్నులపండువగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశాం. వాహన సేవలు తిరిగే మాడవీధులతో పాటు తిరుమల క్షేత్రం మరింత పరిశుభ్రంగా ఉండేలా ప్రణాళికలు రూపొం దించాం. ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఏ చిన్నలోపం లేకుండా బ్రహ్మోత్సవాలు నిర్వహి స్తామనే నమ్మకం ఉంది.
- అనిల్‌కుమార్ సింఘాల్, ఈవో, టీటీడీ
వాహన సేవల్ని అందరూ వీక్షించేలా...
దర్శనం, వసతితో పాటు బ్రహ్మోత్సవాల్లో వివిధ వాహనసేవలపై ఊరేగే ఉత్సవమూర్తులను సంతృప్తికరంగా భక్తులు వీక్షించేలా చర్యలు తీసుకున్నాం. వాహనసేవల్లో ఎలాంటి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. గ్యాలరీలు సిద్ధం చేశాం. గరుడవాహనం రోజున అన్నప్రసాదాల్లో ప్రత్యేక మెనూ ఉంటుంది. తగినన్ని లడ్డూలను కూడా అందుబాటులో ఉంచుతాం.
- సీహెచ్ వెంకయ్య చౌదరి, అదనపు ఈవో, టీటీడీ
కట్టుదిట్టమైన భద్రత
స్వామివారి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు దేశవిదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. వారి భద్రతతో పాటు తిరుమల క్షేత్రం భద్రత కోసం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాం. విజిలెన్స్ నుంచి సుమారు 1,600 సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశాం. ప్రతీ కదిలికలను సీసీ కెమెరాల ద్వారా కమాండ్‌కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలన చేస్తాం.
- కేవీ మురళీకృష్ణ, సీవీఎస్వో, టీటీడీ
ఈ వార్తలు కూడా చదవండి..
సరికొత్త స్థాయికి బంగారం, వెండి ధరలు..
Read Latest Telangana News and National News