Share News

Hyderabad: అపార్ట్‌మెంట్‌లోనే హంతకుడు... మిస్టరీగా బాలిక హత్య కేసు

ABN , Publish Date - Aug 20 , 2025 | 07:39 AM

కూకట్‌పల్లిలో సోమవారం జరిగిన బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది. సంగీత్‌నగర్‌లోని ఓ అపార్టుమెంట్‌ పెంట్‌హౌజ్‌లో ఉంటున్న కృష్ణ, రేణుక దంపతుల కుమార్తె సహస్రణి(11) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.

Hyderabad: అపార్ట్‌మెంట్‌లోనే హంతకుడు... మిస్టరీగా బాలిక హత్య కేసు

- పగతోనే చంపినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ

- చుట్టుపక్కల గల్లీల్లోనే తిరిగిన జాగిలం

- తల్లిదండ్రులను విచారిస్తేనే విషయం వెలుగులోకి..

హైదరాబాద్‌ సిటీ: కూకట్‌పల్లి(Kukatpally)లో సోమవారం జరిగిన బాలిక హత్య కేసు మిస్టరీగా మారింది. సంగీత్‌నగర్‌(Sangeetnagar)లోని ఓ అపార్టుమెంట్‌ పెంట్‌హౌజ్‌లో ఉంటున్న కృష్ణ, రేణుక దంపతుల కుమార్తె సహస్రణి(11) దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఐదు ప్రత్యేక పోలీసు బృందాలు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాయి. అపార్టుమెంట్‌ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఎక్కడా ఆ అపార్టుమెంట్‌కు బయటి వ్యక్తులు వచ్చిన ఆనవాళ్లు కనిపించలేదని తెలిసింది. దీంతో అందులోని వ్యక్తులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


అపార్టుమెంట్‌లోనే దాగి ఉన్న మిస్టరీ..?

అపార్టుమెంట్‌ సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా కీలక విషయాలను గుర్తించినట్లు తెలిసింది. అలాగే సంఘటనా స్థలంలో దొరికిన కొన్ని క్లూస్‌, పోలీసులు సేకరించిన టెక్నికల్‌ ఎవిడెన్స్‌ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అదే అపార్ట్‌మెంట్‌ రెండో అంతస్తులో ఉన్న ఒడిశాకు చెందిన సంజయ్‌ని అదుపులోకి తీసుకున్నారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న సంజయ్‌.. ఏ పనీ చేయకుండా ఆవారాగా తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించి విచారించారు.


అతనిచ్చిన సమాచారం మేరకు అపార్ట్‌మెంట్‌లోని ఇతర కుటుంబాలను సైతం పోలీసులు విచారిస్తున్నారు. కృష్ణ, రేణుక దంపతులతో ఎవరెవరికి విభేదాలున్నాయి.. వారి పిల్లలు ఎక్కువగా ఎవరితో ఆడుకుంటూ ఉంటారు..? ఇటీవల ఏదైనా గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయా...? అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరించినట్లు తెలిసింది. అన్ని కోణాల్లో పరిశీలించిన పోలీసులు అపార్టుమెంట్‌లోనే బాలిక హత్య మిస్టరీ దాగి ఉందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.


తల్లిదండ్రులను విచారిస్తేనే..

ఇదిలా ఉండగా.. బాలిక మృతదేహాన్ని తీసుకుని తల్లిదండ్రులు సొంతూరుకు వెళ్లారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత దంపతులను విచారిస్తామని పోలీసులు తెలిపారు. వారు చెప్పే వివరాలు, వ్యక్తం చేసే అనుమానాలను బట్టి నిందితులను గుర్తించే అవకాశముంటుందని పేర్కొన్నారు.


చుట్టుపక్కల గల్లీల్లోనే తిరిగిన జాగిలం..

ఘటనాస్థలికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు బాలానగర్‌ డీసీపీ ఆధ్వర్యంలో ఐదు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, డాగ్‌స్క్వాడ్‌ పెంట్‌హౌజ్‌ నుంచి నేరుగా కిందకు వచ్చి అపార్టుమెంట్‌ చుట్టుపక్కల ఉన్న గల్లీల్లో మాత్రమే తిరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. హంతకుడు ఆ కుటుంబానికి, పిల్లలకు బాగా తెలిసిన వ్యక్తే అయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అందుకే ఎలాంటి బెరకూ లేకుండా, ఎలాంటి క్లూస్‌ దొరక్కుండా జాగ్రత్త తీసుకుంటూ.. అవకాశం కోసం ఎదురు చూసి పక్కా ప్లాన్‌ ప్రకారమే బాలికను హత్య చేసి, ఆ తర్వాత బయట నుంచి తలుపు గొళ్లెంపెట్టి వెళ్లి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. బలమైన పగతోనే బాలికను హతమార్చి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలిసింది. ఏది ఏమైనా తల్లిదండ్రులను విచారిస్తే ఒకటి, రెండు రోజుల్లోనే నిందితులను పక్కా ఆధారాలతో పట్టుకుంటామని కూకట్‌పల్లి పోలీసులు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...

‘కన్ఫర్డ్‌’లుగా 17 మంది సిఫారసు!

విద్యుత్‌ స్తంభాలపై కేబుల్‌ వైర్లను తీసేయండి

Read Latest Telangana News and National News

Updated Date - Aug 20 , 2025 | 07:39 AM