Share News

Ananthapur News: నీకు చేతులెట్లా వచ్చాయ్‌ మామా..!

ABN , Publish Date - Nov 28 , 2025 | 11:22 AM

బావ మీద ఉన్న కోపాన్ని తన మేనల్లుడిపై చూపించాడో దుర్మార్గుడు. పసివాడిని కూడా చూడకుండా గొంతు నులిమి చంపేశాడు. ప్రేమ నటించి, మేనల్లుడు ఐదు సంవత్సాల హర్షవర్ధన్‌ను దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Ananthapur News: నీకు చేతులెట్లా వచ్చాయ్‌ మామా..!

- బాలుడిని చంపేసిన మేనమామ

- నమ్మించి తీసుకెళ్లి గొంతు నులిమేశాడు

కదిరి(అనంతపురం): అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడి వైద్యానికి తగినంత ఆర్థికసాయం చేయలేదనే కోపం..! ‘ఎక్కడ చూపించినా నీ కొడుక్కు నయం కాదు..’ అని అన్నాడన్న బాధ..! ఇంకా ఏవేవో కారణాలు..! బావ మీద ఉన్న కోపాన్ని తన మేనల్లుడిపై చూపించాడు. పసివాడిని తీసుకువెళ్లి గొంతు నులిమి చంపేశాడు. తలుపుల మండలంలో సొంత మేనల్లుడిని మేనమామ దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఆ కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులను కంటతడి పెట్టిస్తోంది. తలుపుల మండలం గరికపల్లికి చెందిన హర్షవర్ధన్‌(5) హత్యను జీర్ణించుకోలేకపోతున్నారు.


pandu1.2.jpg

ప్రేమ నటించి..

నిందితుడు ప్రసాద్‌ స్వస్థలం నంబులపూలకుంట మండలంలోని బందారుచెట్లపల్లి. ప్రస్తుతం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లిలో ఉంటున్నాడు. తలుపుల మండలం గరికపల్లికి చెందిన గంగాధర్‌తో ప్రసాద్‌ చెల్లెలు చంద్రకళకు వివాహం జరిగింది. వీరికి కూతురు మోక్షిత, కుమారుడు హర్షవర్ధన్‌ ఉన్నారు. బావపై లోలోన ఉన్న కోపాన్ని కక్షగా మార్చుకున్నాడు. విచక్షణ కోల్పోయి దారుణమైన ప్రణాళిక వేసుకున్నాడు. మేనల్లుడిని చంపడానికి రెండు నెలల ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేశాడు. చెల్లెలి ఇంటికి తరుచూ వచ్చిపోతూ.. మేనల్లుడికి చిరు తిండ్లు కొనిపెడుతూ దగ్గరయ్యాడు. మామ అంటే చచ్చిపడేంత ప్రేమను పసివాడు పెంచుకునేలా చేశాడు. అదను చూసి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి హత్య చేశాడు.


pandu1.3.jpg

బావ లేని సమయంలో..

తన బావ గంగాధర్‌ ఇంటి వద్ద లేడని నిర్ధారించుకున్న ప్రసాద్‌, బుధవారం ఉదయం 11గంటలకు వారి ఇంటికి వచ్చాడు. అంగన్‌వాడీ స్కూల్‌కు వెళ్లిన మేనల్లుడిని ఇంటికి పిలిపించుకున్నాడు. బైక్‌పై ఎక్కించుకుని, తోట వద్ద ఉన్న తన బావ గంగాధర్‌ వద్దకు తీసుకెళ్లాడు. తిరిగి 12గంటలకు ఇంటికి వచ్చారు. చెల్లెలు చంద్రకళ, మేనకోడలు మోక్షితతో మాట్లాడి, హర్షన్‌వర్ధన్‌కు రూ.20 ఇచ్చి, అంగడికి పంపించాడు. పది నిమిషాల తరువాత తిరుగు ప్రయాణమై, హర్షవర్ధన్‌ వెంట పడుతున్నాడని తిరిగి ఇంటి వద్దకు తీసుకువచ్చి వదిలిపెట్టాడు.


చంద్రకళ తన కుమారుడిని ఆడుకోమని చెప్పి బయటకు పంపగానే, ప్రసాద్‌ వ్యూహాత్మకంగా బయటకు వెళ్లి.. మేనల్లుడిని బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో బాలుడు అదృశ్యమైనట్లు గుర్తించారు. ప్రసాద్‌ వెంట వెళ్లి ఉంటాడనే అనుమానంతో ఫోన్‌ చేసినా, బుకాయించాడు. బాలుడిని చంపేసి, ఏమీ ఎరుగనట్లు మధ్యాహ్నం 3 గంటలకు తిరిగి వచ్చి, వెతుకుతున్నట్లు నటించాడు. విషయం తెలుసుకున్న గంగాధర్‌, తోట వద్ద నుంచి వచ్చి కొడుకు కోసం గాలించాడు. సాయంత్రం 6గంటలకు తలుపుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రసాద్‌ను అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. దీంతో దారుణ హత్య జరిగిన విషయం బయటపడింది.


pandu1.4.jpg

కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

తమ ముద్దుల కొడుకు మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. మేనమామే హత్య చేస్తే ఎవరికి చెప్పుకోవాలని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు గురువారం తెల్లవారు జామునే మృతదేహాన్ని గుర్తించినా, ఆధారాలను సేకరించేందుకు, పంచనామా కోసం సాయంత్రం వరకు మృతదేహాన్ని అక్కడే ఉంచారు. ఆ తరువాత మృతదేహాన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే

ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 11:22 AM