Share News

KTR Accuses Revanth Reddy: ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

ABN , Publish Date - Nov 28 , 2025 | 04:52 AM

రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.....

KTR Accuses Revanth Reddy: ముఖ్యమంత్రా.. రియల్‌ ఎస్టేట్‌ ఏజెంటా..?

  • 500 మంది కోసం.. 5 లక్షల కోట్ల ప్రజా ఆస్తులు ధారాదత్తం

  • అందులో సగం డబ్బు రేవంత్‌,కాంగ్రెస్‌ నేతల జేబుల్లోకే

  • బీసీలను వంచించిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి:కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిలా కాకుండా, రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. ప్రజల ఆస్తులుగా ఉన్న 9300 ఎకరాల పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర చేశారని విమర్శించారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, ఇవ్వకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గురువారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎ్‌సలో చేరారు. వారికి కేటీఆర్‌ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. రేవంత్‌ రెడ్డి హిల్ట్‌ విధానం పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు. గతంలో ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు చౌకగా భూములు తీసుకున్నారని, ఇప్పుడా భూముల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు రేవంత్‌రెడ్డి అతి తక్కువ ధరకే అనుమతులిస్తూ రియల్‌ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదారు వందల మంది కోసం రూ.5 లక్షల కోట్ల ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయన్నారు. భూములను అప్పజెప్పే ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

42 శాతం బీసీ రిజర్వేషన్లకు హామీ.. ఇచ్చింది 17 శాతం

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మోసం చేసిందని కేటీఆర్‌ దుయ్యబట్టారు. గత ప్రభుత్వం 24ు రిజర్వేషన్లు కల్పిస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొందని విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి బీసీ సోదరులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కేసీఆర్‌ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేయగా.. మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్‌రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ లాంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని, రాజకీయాల్లో గెలుపోటములు సహజమని కార్యకర్తలకు కేటీఆర్‌ ధైర్యం చెప్పారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదుతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను నియమించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

Updated Date - Nov 28 , 2025 | 04:52 AM