Krishna Water Dispute: రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ABN , Publish Date - Nov 28 , 2025 | 05:59 AM
కృష్ణా జలాల విషయంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. నేటి విభజిత ఆంధ్రప్రదేశ్‌పై నెట్టేస్తామంటే ఎలాగని ఆంధ్రప్రదేశ్ గట్టిగా ప్రశ్నించింది...
తెలంగాణకు ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది స్పష్టీకరణ
తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణానికిఉమ్మడి రాష్ట్రం శాయశక్తులా యత్నించింది
ఆధారాలు చూపుతూ పటిష్ఠ వాదనలు వినిపించిన జైదీప్ గుప్తా
అమరావతి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల విషయంలో నాటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని.. నేటి విభజిత ఆంధ్రప్రదేశ్‌పై నెట్టేస్తామంటే ఎలాగని ఆంధ్రప్రదేశ్ గట్టిగా ప్రశ్నించింది. నదీ జలాల వాటాలు, కేటాయింపుల విషయంలో రాజకీయ నినాదాలు చేస్తే కుదరదని.. చారిత్రక ఆధారాలు చూపాల్సిందేనని తెలంగాణకు స్పష్టం చేసింది. కృష్ణా జలాల పునఃపంపిణీపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ఎదుట ఏపీ తరఫు సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వరుసగా మూడో రోజైన గురువారం కూడా గట్టిగా వాదనలు వినిపించారు. నీటి వాటాలు, కేటాయింపులపై చారిత్రక ఆధారాలు, ఉత్తర్వులను చూపారు. తెలంగాణ ప్రాంత సాగునీటి ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల విషయంలో చారిత్రక అన్యాయం, వివక్ష జరిగాయన్న తెలంగాణ ప్రభుత్వ వాదనలపై స్పందిస్తూ.. రాజకీయ నినాదాలు చేయడం కాకుండా వివక్షకు నిర్మాణాత్మక, నిర్దిష్ట ఆధారాలను చూపాలని.. లేదంటే ఆరోపణలు నిలబడవని స్పష్టంచేశారు. ‘వివక్ష జరిగిందంటూ తెలంగాణ ఏవో కొన్ని ఉదాహరణలను ప్రస్తావించింది. అయితే అవి నిజంగా వివక్షను ప్రతిబింబిస్తున్నాయా.. లేక ఇతర పరిస్థితుల కారణంగా ఉత్పన్నమయ్యాయా అనేది జాగ్రత్తగా పరిశీలించాలి. స్పష్టమైన ఆధారాల్లేకుండా ఇలాంటివి చెప్పరాదు. దురుద్దేశంతో నిర్లక్ష్యం చేశారనడానికి కూడా గట్టి రుజువులు చూపాలని న్యాయసూత్రాలు చెబుతున్నాయి. ఆధారాలు చూపాల్సిన పూర్తి బాధ్యత ఆరోపణలు చేస్తున్న రాష్ట్రానిదే’ అని తేల్చిచెప్పారు. తమ కోసం రూపొందించిన చాలా ప్రాజెక్టులను తిరస్కరించారని.. దారి మళ్లించారన్న తెలంగాణ ఆరోపణలు అతిశయోక్తులేనన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావ సమయంలో హామీలిచ్చారనేందుకు ఎలాంటి ఆధారాలనూ చూపలేదని తెలిపారు. ‘అప్పటి హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులను ప్రతిపాదించినట్లు అధికారిక రికార్డుల్లో కూడా లేదు. హైదరాబాద్ రాష్ట్ర నిర్లక్ష్యం కారణంగానే కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-1.. ప్రాజెక్టులను తిరస్కరించింది. అందుచేత ఉమ్మడి రాష్ట్రంలో వాటిని తిరస్కరించారని తెలంగాణ చేస్తున్న వాదనలను తిరస్కరించండి’ అని బ్రిజేశ్ ట్రైబ్యునల్‌ను గుప్తా కోరారు. నిర్ధారిత చారిత్రక నిర్లక్ష్యం వల్లనో, వనరుల పంపిణీలో అసమానతల వల్లనో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని స్పష్టంచేశారు. స్వతంత్ర ప్రాతినిధ్యం, ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాటుచేశారని తెలిపారు. ఏపీ విభజన చట్టం-2014లోని లక్ష్యాలు, కారణాల ప్రకటనలో.. అభివృద్ధి, నీటి కేటాయింపుల్లో అన్యాయానికి సంబంధించిన ఏ ఆరోపణలనూ పేర్కొనలేదన్నారు. నిర్దిష్ట గుర్తింపు, ప్రభుత్వ వ్యవస్థ కోసం చేసిన రాజకీయ డిమాండ్ కారణంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారని వెల్లడించారు. సాంకేతిక సాధ్యాసాధ్యాలు, ఆర్థికంగా లాభదాయకం, ట్రైబ్యునల్ అవార్డుల ప్రాతిపదికన ప్రాజెక్టులను చేపడతారని.. ప్రాంతీయ వివక్ష కారణంగా కాదని గుప్తా తెలిపారు.
తెలంగాణ వాదనలు దురుద్దేశపూరితం!
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ చేస్తున్న వాదనలన్నీ దురుద్దేశంతో కూడుకున్నవని 2013లో ముత్తా ఆసోసియేట్స్‌కూ మహారాష్ట్ర ప్రభుత్వం మధ్య జరిగిన కేసులో తేటతెల్లమైందని జైదీప్ గుప్తా చెప్పారు. తెలంగాణ ప్రాంత అభివద్ధిపై ఉద్దేశపూర్వకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నిర్లక్ష్యం చేసిందనేందుకు చారిత్రక ఆధారాల్లేవని కేంద్రం వర్సెస్ టి.రామచంద్రరావు (2001) కేసులో స్పష్టమైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో ప్రభుత్వాలు ఉన్నందునే 1956-2008 మధ్య రూ.4.99 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. భారీ సాగునీటి ప్రాజెక్టు నాగార్జున సాగర్, జూరాల, కోయిల్‌సాగర్, దేవాదుల, శ్రీరాంసాగర్, కడెం తదితర ప్రాజెక్టులు పూర్తయ్యాయని వివరించారు. గుప్తా తదుపరి వాదనలను వచ్చే నెల 17, 18 తేదీల్లో వింటామని చెబుతూ విచారణను ట్రైబ్యునల్ వాయిదా వేసింది.