Hyderabad: బాలికను చంపి.. కుందేలుపై జాలి
ABN , Publish Date - Aug 29 , 2025 | 07:31 AM
కూకట్‌పల్లిలో ఇటీవల 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్యాట్ దొంగతనం చేసేందుకు వెళ్లిన పద్నాలుగేళ్ల పక్కింటి బాలుడే ఆ బాలికను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు.
- సహస్ర హత్య కేసు నిందితుడిలో భిన్నకోణాలు
- కేసు విచారణలో పోలీసులకు సవాళ్లు
- నిందితుడి పోలీసు కస్టడీకి పిటిషన్ దాఖలు
హైదరాబాద్ సిటీ: కూకట్‌పల్లి(Kukatpally)లో ఇటీవల 10 ఏళ్ల బాలిక సహస్ర హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బ్యాట్ దొంగతనం చేసేందుకు వెళ్లిన పద్నాలుగేళ్ల పక్కింటి బాలుడే ఆ బాలికను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. ఆధారాలతో సహా.. నిర్థారించి నిందితున్ని జువైనల్ హోమ్‌కు తరలించారు. కేవలం బ్యాట్‌కోసం చిన్నారిని అతి కిరాతకంగా బాలుడు హత్య చేయడం, 27 కత్తిపోట్లు పొడవడం ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఇదిలా ఉండగా.. సహస్రను హత్య చేసిన బాలుడి క్రైమ్ కథా చిత్రంలో ఓ కుందేలు ఎపిసోడ్ వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.
క్రూరంగా చంపేసి..
బ్యాట్ దొంగతనం చేస్తుండగా పట్టుకుందని చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న బాలికను కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపిన బాలుడు గోడదూకి తన ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో ఉన్న తండ్రి, ఇద్దరు అక్కలకు రక్తం కనిపించకుండా వేరే షర్టు మార్చుకున్నాడు. తర్వాత తాను పెంచుకుంటున్న కుందేలుకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో దాన్ని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సహస్ర హత్య జరిగిన రోజే ఆ కుందేలు చనిపోయింది. బ్యాట్‌కోసం క్రూరంగా హత్య చేసిన బాలుడు కుందేలుపై ప్రేమ చూపడం ఆసక్తిగా మారింది. సహస్రను హత్య జరిగిన గంటలోనే దాన్ని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కరుడుగట్టిన నేరస్థులు కూడా హత్య తర్వాత టెన్షన్ పడతారు. పోలీసులకు దొరక్కుండా ఉండటానికి ప్రయత్నిస్తుంటారు. కానీ బాలుడు హత్య జరిగిన రోజు నుంచి పోలీసులతోనే తిరిగాడు. అప్పుడప్పుడూ అతనే పోలీసులకు పలు విషయాలు వెల్లడించేవాడని తెలిసింది. హత్య చేసిన గంటలోనే నిందితుడు భిన్న కోణాలను ప్రదర్శించడంపై పోలీసులే ఆవాక్కవుతున్నారు.
కుందేలు నిర్వహణకు డబ్బులు ఎలా?
బాలుడి ఇంట్లో అడుగడుగునా ఆర్థిక కష్టాలే. తాగుబోతు తండ్రికి సంపాదన లేకపోవడం, తల్లి ఒక్కతే కష్టపడి ఇద్దరు కూతుళ్లను, భర్తను, కొడుకును పోషిస్తోందని పోలీసులు తెలిపారు. ఇన్ని కష్టాల మధ్యన కుందేలు నిర్వహణకు డబ్బులు ఎలా వచ్చాయి? సహస్రను హత్య చేసిన తర్వాత కుందేలును ఏ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు? కుందేలు ఎందుకు చనిపోయింది? దాన్ని ఎక్కడ పాతే(రే)శాడు? అనే ప్రశ్నలకు సమాధానాలు రాబట్టే పనిలో పోలీసులు ఉన్నారు.
బాడీ షేమింగ్‌పై బాధపడేవాడు..
స్కూల్లో, చుట్టుపక్కల స్నేహితుల్లో చాలా మంది బాలుడిని బక్కగా, పీలగా ఉన్నావ్.. అంటూ బాడీషేమింగ్ చేసేవారని పోలీసులు తెలిపారు. అది అతని మనసులో బాగా నాటుకుపోయిందని వెల్లడించారు. ఎప్పుడూ ఒక్కడే ఒంటరిగా కూర్చొని యూట్యూబ్‌లో క్రైమ్ స్టోరీస్, వెబ్ సిరీ్‌సలు చూస్తుండేవాడని గుర్తించారు. అయితే.. కుటుంబ సభ్యులు బాలుడికి చిల్లి గవ్వ కూడా ఇచ్చే పరిస్థితిలేదు. అలాంటిప్పుడు అతనికి స్మార్ట్‌ఫోన్ ఎలా వచ్చింది? అందుకు అవసరమైన డబ్బులు ఎవరిచ్చారు..? అందుకోసం ఎక్కడైనా చోరీలు చేశాడా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకొని కుందేలు కథతో పాటు.. క్రైమ్ వెబ్‌సిరీ్‌సపై విచారించి వివరాలు రాబట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
4 నెలల్లో రాష్ట్ర రాబడి రూ.74,955 కోట్లు
Read Latest Telangana News and National News