Cyber Crime: అవి ఓపెన్ చేస్తే.. ఖాతా ఖల్లాస్
ABN , Publish Date - Dec 25 , 2025 | 07:02 AM
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ పేరుతో లింకులు పంపి అవి ఓపెన్ చేయడం ద్వారా ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు. ఈ వ్యవహారంపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
- ట్రాఫిక్ చలాన్ల పేరుతో నకిలీ లింకులు
- రూ.లక్షల్లో కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లు
హైదరాబాద్ సిటీ: నగరానికి చెందిన ఓ వ్యక్తికి ట్రాఫిక్ ఈ చలాన్ పేరుతో ఓ లింకు వచ్చింది. రూ.500 పెండింగ్ ఉందని వెంటనే చెల్లించాలని అందులో ఉంది. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్(Telangana Traffic Police) పేరుతో రావడంతో దాన్ని క్లిక్ చేసి, క్రెడిట్ కార్డు డిటెయిల్స్ ఎంటర్ చేశాడు. అతడు టైప్ చేసిన అమౌంట్ స్థానంలో తన ప్రమేయం లేకుండానే అంకెలు మారి 5లక్షల పై చిలుకు డబ్బులు డెబిట్ అయ్యాయి. సైబర్ మోసమని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
నకిలీ లింకులతో జర పైలం
ట్రాఫిక్ ఈ చలాన్ పేరుతో సైబర్ క్రిమినల్స్ నకిలీ లింకులు పంపుతున్నారని, ఇలాంటి మోసాలపట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల మాదిరిగానే వీటిని రూపొందిస్తున్న నేరగాళ్లు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. లింకులను క్లిక్ చేయగానే మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఇన్‌స్టాల్ కావడం లేదా బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ కావడం జరుగుతోందని పోలీసులు తెలిపారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- ట్రాఫిక్ చలాన్ చెల్లింపులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలి.
- ఎస్సెమ్మెస్, వాట్సాప్, సోషల్‌మీడియా ద్వారా వచ్చిన లింకులపై క్లిక్ చేయొద్దు.
- ఓటీపీ, యూపీఐ పిన్, డెబిట్/క్రెడిట్ కార్డు వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని ధ్రువీకరణ లేని వెబ్‌సైట్లలో నమోదు చేయొద్దు.
- యాప్‌లను అధికారిక యాప్ స్టోర్ల నుంచే డౌన్‌లోడ్ చేయాలి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎల్‌వీఎం 3 ఎం6కి అనంత్ టెక్నాలజీస్ పరికరాలు
సబ్బుల్లో నంబర్ 1 బ్రాండ్‌గా సంతూర్
Read Latest Telangana News and National News